సుప్రభాత కవిత : -బృంద
రేయి గాచిన అలుపు తీరగా 
హాయిగా తేటనీటి తానమాడ
వేయిగా దిగిన చుక్కలన్నీ 
చేయి చేయి  కలిపి జలకమాడినట్టు..

తొలివెలుగుల రాకతో 
జిలిబిలి  జిలుగుల చీరకట్టి 
మొగమంత  నవ్వులు నింపి 
స్వాగతించె  నది నమస్కరించి.

నీలిరంగు నీటిపైన 
మెరుపులెన్నో!
లోన దాచిన తెలియరాని 
నిధులెన్నో!
వెదకిన దొరికే వెలలేని 
వెతలెన్నో!

హృదయాన బాధ దాచి 
అధరాన నవ్వులు చిందే 
అంతరంగము పొందు 
అంతులేని వ్యధలెన్నో!

కనిపించు సోయగమంతా 
కనులకు విందే కదా!
అనిపించు భావనలన్నీ 
మనసుకు సహజమే కదా!

తూర్పు నిజం మార్పు నిజం!
వెలుగు నిజం వేకువ నిజం!
ఏవి వచ్చినా ఎంత నొచ్చినా 
తరలి వచ్చినట్టే అవి మరలిపోవు నిజం!

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు