సుప్రభాత కవిత : -బృంద
కోటి వంపుల పయనం 
ఏటి మలుపుల గమనం 
నీటి పైని చిరు అలల సడి 
దాట దెన్నడు ఎందుకు తన దడి?

పురోగమనమే కానీ 
తిరోగమనమెరుగని 
సలిలపు  ప్రవాహము 
సాగర సమాగమం  వరకే!

కాలానికి నీటికి ఒక్కటే 
సూత్రం.
ఏ అదుపు అసలు లేని 
వేగం 
ఎవరికోసమో ఆగవు 
ఎందుకోసమో వేగవు!

ఏదోచ్చినా కలుపుకు పోవడం 
ఏ నిచ్చెనా  ఎక్కాలనుకోకపోవడం 
ఏ మెచ్చులు ఎవరికీ ఇవ్వకపోగా 
ఏ రొచ్చునూ  బయటకి పంపకపోవడం 

కలిసి రావడం లేదని 
కాలాన్ని నిందిస్తూ 
కన్నీరు చిందిస్తే 
కలతలు తీరేనా?

తెలిసి తన యోగ్యతను 
కలిసి అడుగులు కదిపితే 
అలిసి పోక ముందే 
కరిగి పోవు దూరం!

పాఠం నేర్పే ఏటి పాయకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు