న్యాయములు-784
" ఆత్మచ్ఛిద్రం నపశ్యంతి పరచ్ఛిద్రాను సారిణు"న్యాయము
*****
ఆత్మ అనగా జీవుడు, తాను, పరమాత్మ,బ్రహ్మము, సారము, చరిత్రము,స్వభావము, వ్యక్తి సమస్త శరీరము,ధైర్యము, ప్రయత్నము.చ్ఛిద్ర అనగా బెజ్జము, దోషము,న్యూనత.న అనగా లేదు/ కాదు.పశ్యతి అనగా చూచునది .పర అనగా ఇతరుడు,వేరయినవాడు,దూరస్థితుడు,ఎదుట,రెండవ ప్రక్క, శ్రేష్టమైనది, సర్వోత్తమమైనది,రెండవ వ్యక్తి, అపరిచితుడు, శత్రువు.ఛిద్ర అనగా బెజ్జము ,దోషము, న్యూనత .ఆనుసారిణి అనగా అనుగుణంగా వ్యవహరించడం అని అర్థము.
"ఆత్మచ్ఛిద్రం నపశ్యంతి పరచ్ఛిద్రానుసారిణు" అనగా "ఇతరుల తప్పులను ఎంచేవారు తమ తప్పులను చూచుకోరు అని అర్థము.
నిత్య జీవితంలో చాలా మందిలో కనిపించే గుణమే ఇది."తన తప్పు ఆవగింజ- ఇతరుల తప్పు అనకొండ" అన్నట్టుగా ఉంటారు చాలామంది.
అందుకే ప్రజాకవి వేమన ఇలాంటి వారిని ఉద్దేశించి ఓ చక్కని పద్యం రాశారు. అదేమిటో చూద్దాం.
"తప్పులెన్నువారు తండోపతండంబు/ లుర్వి జనుల కెల్ల నుండు తప్పు/ తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరు/ విశ్వధాభిరామ వినురవేమ..!"
అనగా ఎదుటివారి తప్పులను లెక్కించేవారు ఈ లోకంలో ఎంతో మంది అనగా కోకొల్లలు ఉన్నారు.కానీ తాము చేసిన తప్పులను తెలుసుకునే వారు మాత్రం కొంతమందే ఉంటారు.ఇతరుల తప్పులను లెక్కించేవారు తమ తప్పులను మాత్రం తెలుసుకోలేరు, సరిదిద్దుకోలేరని భావము.
ఇలా ఇతరులను తప్పు పట్టేవారు,తన లోపాలను కప్పిపుచ్చేవారు ఉండటానికి గల కారణం ఏమిటో కూడా చూద్దాం.
తనను తాను గొప్పగా చెప్పుకోవడానికి కారణం అహం.తానేది చేసినా ఒప్పుగానే కనిపిస్తుంది.ఈ గుణం కొందరిలో పుట్టుకతోనే వస్తుంది.ఎన్ని డక్కమొక్కీలు తిన్నా తన ఈ లోపాన్ని మాత్రం సరిచేసుకోరు.మరికొందరైతే మాట మాటకు తప్పు తీస్తూ వుంటారు.అసలు వారి పనే అది. దీనినే రంధ్రాణ్వేషణ అంటారు.అలా ఇతరులపై ఏదో ఒకటి చెప్పకుండా, వారి లోపాలు, తప్పులు ఎత్తకుండా ఉండలేని బలహీనత వారిలో ఉంటుంది.
ఇక ఇలాంటి తప్పులు వెదికెడి వారే మన పై యజమాని అయితే ఆ పరిస్థితి మహా దారుణంగా ఉంటుందని చెప్పిన సుమతీ శతక కర్త రాసిన పద్యాన్ని కూడా చూద్దాం.
ఎప్పుడు తప్పులు వెదికెడు/నప్పురుషుని గొల్వగూడ దదియెట్లన్నన్/సర్పంబు పడగనీడను/ గప్పవసించిన విధంబు గదరా సుమతీ!"
అనగా ఎప్పుడూ ఎదుటి వారి తప్పులు వెదికెడి అధికారి కింద పనిచేయడం చాలా కష్టంతో కూడుకున్న జీవితం. ఆత్మాభిమానం దెబ్బ తింటుంది.అలాంటి వారి కింద పనిచేసే వారి పరిస్థితి పాము పడగ నీడలో కప్ప ఉన్నట్లుగా ఉంటుంది.అంటే క్షణక్షణ గండం -దినదిన గండంగా ఉంటుందన్న మాట.
ఎప్పుడు తప్పులు వెదికే వారితో సహవాసం చేయడం వల్ల ఒకోసారి మనం కూడా వాళ్ళలా మారిపోయే ప్రమాదం ఉంది.కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి.
ఇతరుల తప్పులు వెదుకుతూ,బాధ పెడుతూ ఉండే వారిని ఉద్దేశించి ఓ కవి గారు చక్కని పాట రాశారు. మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి.ఏ దోషం లేని వారు ఎవరో చూపండి.అని అడిగితే సమాధానం ఉండదు. అలాంటి వారు కారణజన్ములే అవుతారు.
మొత్తంగా ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఇతరుల తప్పులను వెదకడం తేలికే కానీ తమలోని తప్పులను సరిదిద్దుకోవడం కష్టం అని. మరి తక్కువగా లేదా అరుదుగా ఉంటారని మనకు ఈ న్యాయం ద్వారా చాలా వరకు అర్థమై పోయింది.అలాగే మనం ఇతరుల తప్పులు వెదికెడి వారిగా ఎప్పుడూ మారొద్దని కూడా గ్రహించగలిగాం.తానొవ్వక,నొప్పించక ఇతరుల మనసు గెలుచుకోవాలి.
ఇదండీ!"ఆత్మచ్ఛిద్రం నపశ్యంతి పరచ్ఛిద్రానుసారిణు" న్యాయము లోని అంతరార్థము.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి