సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు-777
అనాథో దేవ రక్షితః న్యాయము
*****
అనాధ అనగా తల్లిదండ్రులు ఎవరూ లేని వ్యక్తి అసహాయుడు పేద పితృ హీనుడు,దేవ అనగా దైవము.రక్షిత అనగా  రక్షించు అని అర్థము.
"దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు" అన్నట్లుగా... అనగా  సహాయం అవసరం అయినప్పుడు ఎవరి నుండి సహాయం అందకపోతే  ఆ దేవుడి మీదే భారం వేయమని అర్థము.
 దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటుంటాం. మరి నిజంగానే దేవుడు ఉన్నాడా? ఉంటే  ఏదిక్కున ఉన్నాడు?  భక్త ప్రహ్లాదుడేమో తండ్రి హిరణ్యకశిపుడు ఏడిరా హరి? ఎక్కడ వున్నాడు? గద్దిస్తే... "ఇందుగలడందు లేడని/ సందేహము వలదు చక్రి సర్వోపగతుం/ డెందెందు వెదికి చూచిన నందందే కలడు దానవాగ్రణి! వింటే " అంటూ వినయంగా జవాబు చెబుతాడు.
మరిక మొసలి నోటికి చిక్కిన గజేంద్రుడు దాని నుండి బయట పడేందుకు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ చివరికి సందేహంతో " కలడందురు దీనుల యెడ/ కలడందురు పరమ యోగి గుణముల పాలం/కలడందురన్ని దిశలను/ కలడు కలండనెడు వాడు కలడో లేడో?"  సందేహపడతాడు. తన ప్రాణాపాయ స్థితికి దుఃఖిస్తూ "లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్/ ఠావుల్ దప్పెను మూర్ఛలు వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్/ నీవే తప్ప నితఃపరం బెఱుగ మన్నింపం దగున్ దీనునిన్/రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!" అంటూ మొరపెట్టుకున్న సమయంలో అల వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు గజేంద్రుని రక్షించేందుకు రావడము, గజేంద్రుని రక్షించడం మనందరికీ తెలిసిన  కథే.
ఏ దిక్కూ లేనప్పుడు ఏమీ తోచనప్పుడు భగవంతుడే ఇలా వచ్చి కాపాడుతాడు.దిక్కూ దిశా కూడా చూపిస్తాడని దైవ భక్తులు చెప్పిన శివుని కథను చూద్దాం.
 కొంతమంది శివభక్తులు శ్రీశైలంలో శివయ్యను దర్శించుకోవడానికి బయలుదేరుతారు.అలా రోజుల తరబడి ప్రయాణం సాగుతున్న సమయంలో ఆ యువకుల బృందంలో ఒక యువకుడు అడవిలో దారితప్పి తిరుగుతూ  ఓ చిన్న పల్లెకు చేరుకుంటాడు. అక్కడ ఓ పూరి గుడిసె అరుగు మీద ఒకానొక ముసలి అవ్వ వక్కాకు దంచుకుంటూ కనిపిస్తుంది.ఆమె దగ్గరకు వెళ్ళి శ్రీశైలం వెళ్ళాలి దారెటో చెప్పమని అడుగుతాడు. 
అప్పుడా అవ్వ ఇంత అర్థరాత్రి వెళ్ళలేవు.ఇక్కడికి దగ్గరలో పాడుపడిన శివాలయం ఉంది.అక్కడ పడుకొని పొద్దున్నే వెళ్ళమని చెబుతుంది. మరి ఆ శివాలయం ఏదిక్కున వుందో చెప్పమని అడిగితే తాను కాళ్ళు చాపిన వైపు ఉంటుందని, అటుగా వెళ్ళమని చెబుతుంది.
అయ్యో! శివుడు ఉన్న వైపు కాళ్ళు చాపావా? ఎంత అపరాధం చేశావు అవ్వా! అంటే  మరి శివుడు ఏ దిక్కున లేడో చెప్పు ఆ దిక్కున పడుకుంటా అన్న మాటలకు విసుక్కుంటూ వెళ్ళి పోతాడు.
 అలా ఆ యువకుడు ఎలాగైతేనేం అవ్వ చెప్పిన దారిలోనే శ్రీశైలం వెళ్తాడు.అక్కడ గుడిమెట్ల మీద ఆ అవ్వ కనిపిస్తుంది. "ఏ దిక్కు నుండి వచ్చావు నాయనా!" అంటున్న అవ్వలో సాక్షాత్తు శివయ్యే కనబడతాడు.దిక్కు తోచని స్థితిలో తనకు అవ్వ రూపంలో శివయ్య కనిపించాడని పొంగిపోతాడా యువకుడు.
ప్రహ్లాదుడు, గజేంద్రుడు,భక్తుడు.. ఇలా ఎవరైతే దిక్కు తోచక అనాధలుగా దుఃఖిస్తూ వుంటారో వాళ్ళను  సాక్షాత్తు భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడటం మనం ఇందులో గమనించవచ్చు.
ఇదండీ!అనాథో దేవ రక్షితః న్యాయము అంటే.నమ్మకమే ధైర్యం,దైవం అనేది ఇందులో మనం గ్రహించాల్సిన విషయం.

కామెంట్‌లు