సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-775
పరిశేష న్యాయము
***
పరిశేషము అనగా మిగులు.
 ఇక్కడ మిగులు అంటే ఒక మొత్తంలో మిగిలింది అని లేదా అంతా ఐపోగా చివరికి ఉన్నది అని అర్థము.మరి ఈ పరిశేషము గురించి వేదాంత,ఆధ్యాత్మిక, జ్యోతిష్య శాస్త్ర దృష్టితో చూసే వారు ఎంత గొప్పగా నిర్వచిస్తూ ఉదాహరణ యుక్తంగా చెప్పారో చూద్దాం.
సనాతన భారతీయ సంస్కృతిని దేదీప్యమానంగా వెలిగేలా చేసిన ఆది శంకరాచార్యుల గురించి తెలియని భారతీయులు ఉండరు. ఈ "పరిశేష న్యాయము"నకు ఆదిశంకరులు ఎంత అద్భుతంగా న్యాయము చేశారో చదువుతుంటే ఆశ్చర్యం,ఆనందం అంతకు మించిన భక్తిభావం గుండె లోతుల్లోంచి పెల్లుబికి వారికి శిరసు వంచి నమస్కరించేలా చేస్తుంది.
 అవి ఆదిశంకరులు  చదువుకునే  రోజులు.ఒకరోజు తాను భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక పేదరాలి ఇంటికి వెళ్ళారు. అయితే ఆమెకు తన ఇంట్లో భిక్ష పెట్టడానికి  ఏమీ లేనందుకు బాధ పడుతూ ఇంట్లో మిగిలి ఉన్న ఒకే ఒక్క ఉసిరికాయను ఆదిశంకరుల భిక్షాపాత్రలో  వేసింది.ఆమె కడు పేదరికం చూసి ఆదిశంకరులు చలించిపోయారు. వెంటనే 22 శ్లోకాల కనకధారా స్తోత్రము చదివారట.అలా వారు చదవడంతో ఆమె ఇంట్లో కనకవర్షం కురిసి పేదరికం మటుమాయమై పోయిందట.అలా తనకు ఇచ్చిన చివరికి మిగిలిన దానితో ఎంత మహిమ చూపారో  ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.అదే విధంగా మరో సందర్బంలో చివరికి  మిగిలేది ఆత్మేనని పది శ్లోకాలలో విడమర్చి చెబుతారు.ఆ పది శ్లోకాలే 'దశ శ్లోక'గా నేటికీ ఎంతో ప్రసిద్ధి చెందాయి.
ఈ పరిశేషము అనే పదము జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఉండటం గమనార్హం.ఖగోళ శాస్త్రవేత్తలు  సౌర కుటుంబంలో సూర్యుడు నక్షత్రం కాబట్టి గ్రహముల పట్టిక నుంచి  సూర్యుని  తొలగించారు. అలాగే చంద్రుడు ఉపగ్రహమని చంద్రుడిని కూడా తొలగించారు.ఇలా తొలగించిన వాటి స్థానంలో భూమి, యురేనస్, నెప్ట్యూన్,ప్లూటోలను చేర్చారు.అయితే ఇలా తొలగించడం,చేర్చడం చేసినప్పటికీ నవగ్రహాలు అనే సంఖ్యను మాత్రం మార్చలేదు.అయితే కొందరు జ్యోతిష్య శాస్త్ర పండితులు ఈ శాస్త్రంలో మొదటి నుంచి కూడా 'మాంది' అనే గ్రహము కలదని చెప్పి గ్రహాల సంఖ్య పదిగా నిర్ణయించారు. వారి నిర్ణయం ప్రకారం గ్రహానికో  అవతారం చొప్పున పరిశేష న్యాయము చేత  పదవ అవతారం 'మాందీ గ్రహాంశ అవతారం' కాలమూర్తి యగు కల్కి మూర్తిగా చెప్పారు. ఇందుకు సంబందించిన వివరాలు "వరాహ మిహిరాచార్య కృత హోరా శాస్త్రమనే" జ్యోతిష్య శాస్త్రములో చెప్పబడినవి.
 ఈ "పరిశేష న్యాయము"నకు  సంబంధించిన కథనం రామాయణంలో కూడా చూడవచ్చు. రామాయణంలోని బాలకాండ-అరవై రెండవ సర్గలో శునస్సేపుడు పరిశేష న్యాయము ద్వారా తాను యజ్ఞ పశువు అవ్వడంతో.అతడు విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్ళి భోరుమని విలపిస్తాడు. విశ్వామిత్రుడు శునస్సేపుడిని ఓదార్చి అసలు కారణమేమిటో అడుగుతాడు.
అయోధ్యేయాధీశుడైన అంబరీష మహారాజు గొప్ప యజ్ఞం తలపెడతాడు.ఆ యజ్ఞానికి సంబంధించిన యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరిస్తాడు. యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగేందుకు గురువుల సలహా ప్రకారం మానవుడి కోసం వెతుకుతూ ఋచీకుడు అనే మహర్షి దగ్గరకు వెళతాడు.వారి కుమారులలో ఒకరిని యజ్ఞ పశువుగా ఇవ్వమని అందుకు బదులుగా ఎంతో మూల్యం చెల్లిస్తానని చెబుతాడు.ఆ మాటలకు ఋచీకుడు పెద్దకుమారుడంటే తనకు ఇష్టం అనీ, ఋచీకుడి పత్నేమో తనకు చిన్న కుమారుడు అంటే ఇష్టమని వారిరువురినీ ఇవ్వలేమని చెబుతారు. దాంతో పరిశేష న్యాయము ననుసరించి మధ్యమ కుమారుడైన శునస్సేపుడిని తనతో తీసుకొని వెళ్తూ అతనికి బదులుగా ఋచీకుడికి లక్ష గోవుల్ని ఇస్తాడు.
ఈ విషయమంతా విన్న విశ్వామిత్రుడు శునస్సేపుడికి అభయమిచ్చి కొన్ని మంత్రములను బోధిస్తాడు.తనను తీసుకుని వెళ్ళి అంబరీషుడు యజ్ఞంలో యూప స్తంభమునకు కట్టినపుడు విశ్వామిత్రుడు చెప్పిన విధంగా ఆయన బోధించిన ఇంద్ర, ఉపేంద్ర మంత్రములతో ఆయా దేవతలను స్తుతిస్తాడు.అతడి మంత్ర పఠనానికి సంతుష్టుడైన ఇంద్రుడు శునస్సేపుడిని దీవించి దీర్ఘాయువును ప్రసాదిస్తాడు.ఈ విధంగా శునస్సేపుడికి మరణం తప్పుతుంది.అంబరీషునికి యజ్ఞ ఫలమూ లభిస్తుంది.
ఈ సందర్భంగా మహా భారతంలోని కథను కూడా చెప్పుకుందాం. అక్షయ పాత్ర పేరు వినని వారు,వివిధ సందర్భాలలో ఆ మాటను ఉపయోగించని వారు ఉండరు.
పాండవుల వనవాస సమయంలో యుధిష్ఠిరుడు/ ధర్మరాజుకు అతిథులకు ఆచార ఆతిథ్యం ఇవ్వడానికి ఎంతో కష్టం అవుతుండటంతో ఆ కష్టాన్ని తొలగించమని సూర్య భగవానుడిని ప్రార్థిస్తాడు.అప్పుడు సూర్య భగవానుడు  తరగని పాత్ర అయిన అక్షయపాత్రను ఇస్తాడు.ఆ పాత్ర  గొప్ప తనం ఏమిటంటే అది ప్రతి రోజూ అపరిమిత ఆహారాన్ని అందిస్తుంది.చివరిగా ఎవరైతే మిగలకుండా తినేస్తారో అప్పుడు ఇక ఆ రోజుకి ఇవ్వడం ఆపుతుంది.అలా రోజూ చివరిగా ద్రౌపది భోజనం చేస్తుందనీ ,ఆమె చేసిన తరువాత అది ఇవ్వడం ఆపుతుంది కాబట్టి ఆ సమయంలో దుర్వాసన మునిని అక్కడికి వెళ్ళి భోజనం పెట్టలేని వారిని శపించమని రహస్యంగా దుర్యోధనుడు మరియు శకుని ఆ మునిని కోరుతారు.
వారి కోరిక మేరకు వనవాసంలో ఉన్న పాండవుల వద్దకు దుర్వాసుడు తన శిష్యులతో కలిసి వెళ్తాడు.అప్పుడే పాండవుల తర్వాత ద్రౌపది భోజనం అయిపోతుంది. ఇంతలో దుర్వాసుడు తన శిష్యులతో కలిసి భోజనానికి వస్తున్నాడని తెలుస్తుంది.అది తెలిసిన పాండవులు,ద్రౌపది ఎంతో ఆందోళన చెందుతారు.
ఆ సమయంలో సహాయం కోసం ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తుంది. వెంటనే శ్రీకృష్ణుడు ఆమె ముందు ప్రత్యక్షమవుతాడు.తనకు బాగా ఆకలిగా ఉంది భోజనం పెట్టమని అడుగుతాడు.అదే కదా తన సమస్య . అందుకే తనను ప్రార్థించానని చెబుతుంది.
అప్పుడు శ్రీకృష్ణుడు ఆ అక్షయ పాత్రను తన వద్దకు తీసుకుని రమ్మని చెబుతాడు. ద్రౌపది తీసుకుని వచ్చిన అక్షయ పాత్రలో అడుగున అంటుకుని వున్న బియ్యం గింజ మరియు కూరగాయ ముక్కల పరిశేషం కనిపిస్తుంది.దానినే  శ్రీకృష్ణుడు తినేసి ఈ భోజనంతో తన కడుపు నిండిపోయి చాలా తృప్తిగ వుందని చెబుతాడు.ఆ మాట ఎప్పుడైతే అన్నాడో వీరి దగ్గరకు రాబోతున్న దుర్వాసుడు అతని శిష్యులకు కూడా కడుపు నిండిపోతుంది.దాంతో వాళ్ళు పాండవుల ఆశ్రమానికి రాకుండానే వెనక్కి వెళ్ళిపోతారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తూ పరమాత్మ కాబట్టి ఆయన సంతృప్తి అలా వారి ఆకలిని కూడా తీర్చిందన్న మాట.
ఇలా  అక్షయ పాత్రలోని పరిశేషము ఆ విధంగా పాండవులు, ద్రౌపదిని కాపాడింది.అందుకే మన పెద్దవాళ్ళు భోజనం చేసిన తరువాత అన్నం, కూర గిన్నెలను వెంటనే కడిగేయకూడదని అంటుంటారు.
 ఇలా పరిశేష న్యాయము గురించి అనేక కథలు, కథనాలు ఉన్నాయి. 
ఇలా మిగిలిపోయిన లేదా పరిశేషానికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం గమనించ వచ్చు. ఆ మిగులే ప్రసిద్ధి చెందుతుందనీ, మంగళకరంగా మిగులుతుందనే  అర్థంతో, అయ్యో  మిగులినదా అని బాధ పడకుండా దానికున్న ప్రత్యేకతను విడమర్చి చెబుతూ మన పెద్దవాళ్ళు ఈ న్యాయముతో  పోల్చి చెబుతుంటారు.
 పై వివరాలూ,విశేషాలూ  చదివినప్పుడు మనకి అర్థమైంది కూడా అదే. కాబట్టి ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటంటే ... పరిశేషమును తక్కువగా భావించకుండా ఎంతో విశేషమైనదిగా గుర్తించాలి.ఆ  సూక్ష్మంతోనే అంతులేని మోక్షం లభిస్తుందనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి.

కామెంట్‌లు