సుప్రభాత కవిత :- బృంద
కనులముందు పుట్టుకొచ్చిన 
హరిత స్వప్నం నువ్వు 
నీ పుట్టుకే ఒక అద్భుతమైతే 
ఆకలి తీర్చే అమృతం నువ్వు!

ఒక్క గింజకు పెక్కు లెక్కన 
ధాన్యమిచ్చి మానవజాతికి 
కడుపునింపే కన్నతల్లివి 
అన్నపూర్ణ దయవు నువ్వు!

రశ్మిమంతుని సహకారంతో 
సస్య సంపద సృష్టించి 
విశ్వ జీవుల కుక్షి నింపు 
సర్వలోక రక్షవు నువ్వు

బీడు నేలను చదును చేసి 
నారు పోసి నీరు పెట్టి 
అరుగాలము కాపు కాసి 
ఎదురుచూచు రైతుకంటి మెరుపువు నువ్వు!

నేలతల్లికి పచ్చపీతాంబరము 
కట్టబెట్టి కనులవిందుగా కళకళలు
ఒడినింపే ఒయ్యారపు పైరు పడుచు 
పైట కొంగు జలతారువు నువ్వు!

పంటపొలాల పసిడి సొగసు 
కంట చూచిన మనసు పడే 
అవ్యక్త ఆనంద అనుభూతులను 
అక్షరాలు అందుకోగలవా?

తొలివెలుగు కిరణాలు 
నులివెచ్చగ నుదుట సోకగా 
నిదురించే పసిపాపకు 
అమ్మ పెట్టె చిన్ని ముద్దుగా తోచె!

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు