పందెం గెలిచిన వీరుడు (ఆఫ్రికా జానపద కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒక ఊరిలో ఒక ధనవంతుడు వుండేటోడు. ఆయనకొక మందారపూవు లాంటి మంచి కూతురుంది. ఆ పిల్లది అలాంటిలాంటి అందం కాదు. పురి విప్పే నెమలైనా, వికసించే పూవైనా, మెరిసే తారైనా, మైమరపించే ప్రకృతైనా ఆ పిల్ల అందం ముందు తల వంచాల్సిందే. ఆ పిల్లకు నెమ్మదిగా పెళ్ళి వయసొచ్చింది. దాంతో నెమలీకలాంటి ఆ పిల్లను పెళ్ళి చేసుకోవడానికి ఊరిలోని యువకులందరూ ఉత్సాహపడసాగారు. మా పిల్లోనికియ్యమంటే మా పిల్లోనికియ్యమని వాళ్ళ తల్లిదండ్రులు గంటకొకరు ఆయన ఇంటి తలుపు తట్టసాగారు. అందరూ కావలసిన వాళ్ళే. ఒకరికిస్తే ఒకరికి కోపం. దాంతో ఎవరికిచ్చినా ఆ తరువాత మిగతావారందరికీ చెడ్డ కావలసి వస్తుంది. ఏం చేయాలా అని ఆలోచించసాగాడు.
అది మంచి చలికాలం. దుప్పటి మీద దుప్పటి ఎంత లావుది కప్పినా చలి ఆగడం లేదు. రాత్రి ఎనిమిది దాటితే చాలు మనుషులే కాదు జంతువులు కూడా బైట తిరగడం మానేస్తున్నాయి. ఆ ఊరి చివర ఒక పెద్ద చెరువుంది. చలికాలం కావడంతో అందులో నీళ్ళు బాగా చల్లగా మంచు కరిగినట్లు వుంటాయి.
ధనవంతుడు ఏం చేశాడంటే ఊరిలో తన కూతుర్ని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళందరినీ పిలిపించాడు. అనేకమంది ధనవంతులు, తెలివైనవాళ్ళు, అందగాళ్ళు, వీరులు అక్కడికి వచ్చారు. ధనవంతుడు అందరితో "మీరందరూ నా వాళ్ళే. నేనెవరినీ కాదనలేను. అలాగని నాకేమీ వందమంది కూతుర్లు లేరు. ఉన్నది ఒకే ఒక కూతురు. కాబట్టి నేనొక పోటీ పెడతా. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నా కూతురునిచ్చి పెళ్ళి చేస్తాను" అన్నాడు.
అందరూ "సరే... అలాగే. అదే మంచి పద్ధతి. ఎవరూ బాధ పడరు. చెప్పండి ఏం చేయాలో" అన్నారు.
ఆ ధనవంతుడు చిరునవ్వు నవ్వి "ఊరి బైట ఒక చెరువు వుంది గదా... రాత్రంతా ఒంటరిగా ఎవరైతే ఆ చెరువులో నిలబడి తట్టుకోగలరో వాళ్ళకి నా కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తా" అన్నాడు.
ఆ మాటలింటూనే అందరూ అదిరిపడ్డారు. వాళ్ళ మొహాలు తెల్లగా పాలిపోయాయి. "ఏందీ ఈ చల్లని చలికాలంలో ఆ చెరువు నీటిలో నిలబడాలా. ఇంకేమన్నా వుందా... రక్తం గడ్డకట్టి, కాళ్ళు కీళ్ళు ఎక్కడికక్కడ బిగుసుకుపోయి  చావడం ఖాయం. ఈ పెళ్ళీ వద్దూ పాడూ వద్దు. ఈ పిల్ల కాకుంటే దీనికి పదింతల అందగత్తెలు చుట్టుపక్కల వూర్లలో వీధికొకరు దొరుకుతారు. దేశంలో వీనికొక్కనికే అందమైన కూతురున్నట్లు తెగ నీలుగుతున్నాడు" అని తిట్టుకుంటా ముక్కాలు భాగం వెళ్ళిపోయారు.
కొంతమంది మాత్రం తెగించి ప్రయత్నం చేశారు. కానీ నీళ్ళలో కాళ్ళు పెట్టగానే ఆ చల్లదనానికి ఒళ్ళు జివ్వుమంది. గజగజగజ వణికిపోయారు. నీళ్ళలోకి సగం దూరం పోగానే ఇక చేతగాక వెనక్కొచ్చి "ఈ పెళ్ళీ వద్దూ... పిల్లా వద్దూ..." అంటూ దండం పెట్టి వెళ్ళిపోయారు.
ఆ ఊరిలో ఒక పేదవాడైన యువకుడు వున్నాడు. వాడు చానా తెలివైనవాడు. వీరుడు. ధైర్యవంతుడు. పట్టుదల కలిగినవాడు. వానికి ఆ పిల్లంటే చాలా ఇష్టం. కానీ 'ఏడంతస్తుల మేడలో ఎత్తు చెప్పులేసుకొని తిరిగే ఆ పిల్లెక్కెడ, వానబడితే నీళ్ళు కారే పూరిపాకలో వున్న నేనెక్కడ... ఇదంతా కలలో తప్ప నిజంగా జరిగేది కాదులే' అనుకొని లోపల్లోపలే బాధపడతా ఉండేవాడు. వానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరైనా గెలవొచ్చు. ఎవరైనా ఆ పిల్లను పెళ్ళాడవచ్చు. దాంతో వాళ్ళమ్మ దగ్గరికి పోయి "అమ్మా... ఇది ఎన్నాళ్ళనుండో నా తీరని కోరిక. ఎంత కష్టమైనా సరే ఈ పోటీలో గెలిచి ఆ పిల్లని నీ కోడల్ని చేస్తా" అన్నాడు.
ఆమెకు వాడు ఒక్కగానొక్క కొడుకు. దాంతో "రేయ్ నాయనా... ఎవరితో కానిది నీతో మాత్రం ఎలా అవుతుందిరా. నా మాటిను. ఆ నీళ్ళు ఈ చలికాలం ఎంత చల్లగా వుంటాయో నీకు తెలీదు. ఎక్కడికక్కడ బిగదీసుకొని పోతావు. దానికి తోడు రాత్రిపూట అడవి జంతువులు నీళ్ళ కోసం ఆ చెరువు దగ్గరికి వస్తాయి. వాటి కంట పడితే అంతే. నా మాటిను. ఈ గెలవలేని కోరిక వదిలెయ్యి" అంది.
కానీ ఆమె ఎంత బాధపడినా, మొత్తుకున్నా వాడు పట్టిన పట్టు విడవలేదు. సక్కగా ధనవంతుని దగ్గరికి పోయి "నేనీ పోటీకి సిద్ధం. ఈ రోజు రాత్రే చెరువులో ఒక్కన్నే నిలబడతా" అన్నాడు. ధనవంతుడు సరేనని కొంతమందిని "వీడు రాత్రంతా ఆ చెరువులో మెడ లోతు నీళ్ళలో వుంటాడో లేదో బాగా గమనించండి" అని చెప్పాడు.
ఆ పేదవాడు ఆ రోజు రాత్రి చెరువు దగ్గరికి పోయాడు. నెమ్మదిగా నీటిలోకి దిగాడు. గొంతు వరకు పోయి నిలబడ్డాడు. వీడు చెరువు దగ్గరికి బైలుదేరగానే వాళ్ళమ్మ వానికి తెలియకుండా వాని వెంటే పోయింది. ఆ చెరువు పక్కనే ఒక చిన్న కొండ వుంది. దాని మీదకు ఎక్కి అక్కడ ఒక చిన్న మంట వేసింది. ఆ మంటను చూసి అడవిలోని జంతువులు భయపడి చెరువు దగ్గరికి రావడం మానేశాయి.
చెరువులో చల్లని నీళ్ళలో గజగజా వణికిపోతా వున్న ఆ యువకునికి కొండ మీద వెలుగుతా వున్న ఆ మంట కనబడింది. అది తన అమ్మనే వేసి వుంటాదని వానికి అర్థమైంది. అంత చలిలో తనకోసం అమ్మ ఆ కొండ మీద ఒక్కతే నిలబడి తన గెలుపు కోసం ఎదురుచూస్తా వుందని అర్థమై వాని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. పట్టుదల పెరిగింది. కొండ మీద వెలుగుతా వున్న ఆ మంటను చూస్తా... అమ్మకు తన మీద వున్న ప్రేమను తలుచుకుంటా... ఆ రాత్రంతా గజగజా వణికించే ఆ చల్లని నీటి మధ్య అలాగే ధైర్యంగా నిలబడ్డాడు.
తెల్లవారగానే ఆ విషయం ధనవంతునికి తెలిసింది. ఆ యువకుడు సంబరంగా ధనవంతుని భవనానికి పోయాడు. కానీ వాడు చాలా పేదవాడు కదా... దాంతో ఆ ధనవంతునికి తన కూతురిని ఆ యువకునికి ఇవ్వడం ఇష్టం లేదు. దాంతో "చూడు... చెరువుకు కొద్ది దూరంలో వుండే కొండ మీద ఎవరో మంట వేశారని నా సేవకులు చెప్పారు. ఆ మంట వెచ్చదనం నీకు తగలడం వల్లనే నీవు ఆ చెరువులో రాత్రంతా వుండగలిగావు. కాబట్టి నీకు నా కూతురిని ఇయ్యను" అంటూ అడ్డం తిరిగాడు.
ఆ మాటలు విని ఆ యువకునికి చాలా బాధ కలిగింది. ఆ వూరిలో ఒక న్యాయాధికారి వున్నాడు. అతను చాలా నిజాయితీపరుడు. తెలివైనవాడు. ఎటువంటి చిక్కు సమస్యనయినా సరే చిరునవ్వుతో విప్పగలిగేవాడు. అతని మాట ఆ ఊరికి వేదం. ఒక్కసారి తీర్పు ఇస్తే ఎవ్వరూ కాదనడానికి వీలు లేదు. ఆ యువకుడు సక్కగా న్యాయాధికారి దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి "నేను పేదవాన్ని కాబట్టే అతను నన్ను మోసం చేయాలని చూస్తా వున్నాడు. ఎలాగైనా సరే మీరే న్యాయం చేయాలి" అన్నాడు.
న్యాయాధికారి ఆ రోజు రాత్రంతా బాగా ఆలోచించాడు. తరువాతి రోజు పొద్దున్నే ధనవంతున్ని న్యాయస్థానానికి పిలిపించాడు. విషయం తెలిసి ఊరంతా ఏమి జరుగుతుందో చూద్దామని ఎక్కడి పనులు అక్కడ వదిలేసి చుట్టూ మూగబడ్డారు. ఒకవైపు ఆ యువకుడు, అతని తల్లి వున్నారు. మరొక వైపు ఆ ధనవంతుడు వున్నాడు. కాసేపటికి న్యాయాధికారి వచ్చాడు.
"పొద్దున లేసినప్పటి నుంచీ రకరకాల పనులతో చాలా తలనొప్పిగా వుంది. వేడి వేడి తేనీరు తాగి సభ మొదలు పెడదాం" అంటూ సేవకులను తొందరగా తేనీరు తయారు చేసి అందరికీ ఇవ్వమన్నాడు.
ఒక సేవకుడు వెంటనే మూడు రాళ్ళు తెచ్చి, దాని మీద ఒక పెద్దపాత్ర పెట్టి, అందులో పాలు, కొంచెం నీళ్ళు, తేయాకు, చెక్కర, యాలకులు వేశాడు. దానికి కొంచెం దూరంలో కట్టెలు పెట్టి మంట అంటించి "అయ్యా... కొంచెం సేపు ఆగండి. నీళ్ళు బాగా సలసలసల మరగగానే ఘుమఘుమలాడేలా చక్కని తేనీరు తయారవుతుంది" అన్నాడు.
అది చూసి ఆ ధనవంతుడు చిరాగ్గా "ఏరా...  నీకేమయినా పిచ్చా... మంట పాత్ర కింద పెడితే నీళ్ళు వేడెక్కి మరుగుతాయి కానీ అంత దూరంలో పెడితే ఎలా మరుగుతాయి" అన్నాడు.
ఆ మాటలకు న్యాయాధికారి చిరునవ్వు నవ్వి "ఎక్కడో కొండ మీద మంట వేస్తే చెరువులో నీళ్ళు వెచ్చబడినప్పుడు, ఇంత దగ్గరలో మంట వేస్తే ఈ తేనీరు ఎందుకు వెచ్చబడదు" అన్నాడు.
ఆ మాటలకు అంతా అర్థమై ధనవంతుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. తప్పు ఒప్పుకొని పోటీలో ప్రకటించినట్లు తన కూతుర్ని ఆ యువకునికి ఇచ్చి పెళ్ళి జరిపించాడు.
***********
కామెంట్‌లు