మానసలో మార్పు ... : - -- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి- 94415 61655
  మాదారం అనే ఊరిలో  మానస అనే విద్యార్థి  పదవ తరగతి

చదువుతున్నది. ఆమె తల్లిదండ్రులు చాలా నిరుపేదలు . ఆ దంపతులకు ఈమె ఏకైక కూతురు. రోజంతా పనిచేసి సంసార జీవితం                గడిపేవారు. ఆ భార్యాభర్తలు పేదవారు అయినప్పటికీ, తమ కూతురుని బాగా చదివించాలని కలలు కనేవారు.  కానీ మానస  చదువులో వెనుకబడి ఉండేది. పైగా మగ పిల్లల దోస్తానం  చేస్తూ గాలి తిరుగుడు తిరిగేది. ఒకరోజు గమనించిన   స్కూల్ మాస్టారు తల్లిదండ్రులకు  ఫోన్ చేసి మీ కూతురు సరిగ్గా చదవడం లేదని చెప్పాడు.
      ఇంటికి వచ్చిన మానసతో ఆ  తల్లిదండ్రులు  బాధపడుతూ" అమ్మ! నీవు బాగా చదవాలని మేము కష్టపడి చదివిస్తున్నాం. నీవేమో చదవడం లేదని తెలిసింది. ఇలా అయితే నీ భవిష్యత్తు ఏమవుతుంది?" అని సున్నితంగా  మందలించారు.  తల్లిదండ్రుల మాటలతో అలిగి మానస అన్నం తినకుండా అనారోగ్యానికి గురి అయింది. బాగా జ్వరం వచ్చింది.  పరీక్షలు దగ్గర పడుతున్నాయి. తల్లిదండ్రులలో ఆందోళన కనిపించింది. బిడ్డను  దగ్గర్లో ఉన్న ఆసుపత్రి తీసుకెళ్లారు. అప్పు చేసి వైద్యం చేయించారు. నాలుగు రోజుల తర్వాత కాస్త  జ్వరం తగ్గింది. డాక్టర్ సలహా మేరకు  ఇంటికి తీసుకువచ్చారు. సులభంగా జీర్ణమయ్యే పండ్లు, డబల్ రొట్టె వంటి  ఆహార పదార్థాలను  అందించారు.  
      ఆరోగ్యం కుదుటపడి పడింది.    మానస  తిరిగి  బడి బాట పట్టింది. ఇంటి దగ్గర ఉన్న ఇన్ని రోజులు  తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకుంది.  బాగా చదువుతున్న వారితో స్నేహం  చేయాలనుకుంది. తాను కూడా వారిలాగా  చదవాలని  తపన బడింది. మాస్టారు చెప్పిన సూచనలు పాటించింది. కొత్త జీవితం మొదలుపెట్టింది. బడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా హోం వర్క్ చేయడం, గురువులు చెప్పిన పాఠాలను  చదవడం ప్రారంభించింది.అనతి కాలంలోనే మానసలో మార్పు కనిపించింది. పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంటానని, చెడు సావాసం చేయనని తల్లిదండ్రులకు, గురువులకు మాట ఇచ్చింది. మానస ప్రవర్తనలో వచ్చిన  మార్పుకు అందరూ సంతోషించారు.
పదవ తరగతి ఫలితాల్లో  స్కూల్ ఫస్ట్ సాధించింది. మానస అందరి నుంచి ప్రశంసలు పొందింది. స్వల్ప కాలంలోనే ఉన్నత చదువులు చదివి   మంచి ఉద్యోగం సంపాదించింది. అప్పుడు తల్లిదండ్రుల ఆనందానికి  అవధులు లేవు. మంచి సంబంధం చూసి  పెళ్లి కూడా చేశారు. జీవితంలో మంచిగా స్థిరపడి తల్లిదండ్రులను బాగా చూసుకో సాగింది. అంతేకాకుండా  తనకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడం కూడా నేర్చుకుంది. ఈ విధంగా మానసలో మార్పు వచ్చినందుకు  అందరూ సంతోషించారు.
        
కామెంట్‌లు