తియ్యటి మామిడి పండ్లు:- --- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి- 9441561655
 మామిళ్లగూడెం  అనే ఊరిలో రామకృష్ణయ్య అని రైతు ఉండేవాడు. అతడు చక్కగా వ్యవసాయం చేస్తూ మంచి పంటలు పండించేవాడు. అతనికి ఉన్న రెండెకరాల  ఎర్ర  నేలలో అంటూ మామిడి చెట్లు నాటించాడు. నాటిన కొద్ది కాలానికి మధురమైన మామిడి  పండ్లు కాసినవి  . దీనితో అతడు ఎంతో అల్లారి ముద్దుగా తోటను చూసుకునేవాడు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆ పండ్లను కొనడంతో బాగా గిరాకీ  పెరిగింది. ఆ పండ్ల తోటకు కాపలగా ఇద్దయ్య అనే వ్యక్తిని నియమించాడు.
       వేసవి కాలం కావడంతో  రామకృష్ణయ్య ఇంటికి బంధువులు వస్తారని కబురు చేరింది. అందుకుగాను తోటమాలిని పిలిచి "రేపు రుచికరమైన మామిడి పండ్లను తెంపుకొని ఇంటికి రా" అని చెప్పాడు. తోట మాలి ఇద్దయ్య  సరే అని అన్నాడు. యజమాని ఆదేశానుసారము  మామిడి తోట కి వెళ్లి గంపనిండా మామిడి పండ్లు కోసుకుని తెచ్చాడు.
 
        ఇంటికి వచ్చిన బంధువులు భోజనాలు తిన్న తర్వాత వారికి మామిడి పండ్లు పెట్టారు. కానీ అవి పుల్లగా ఉన్నందున సరిగ్గా వాటిని తినలేక పోయారు. ఆ విషయాన్ని గమనించిన రామకృష్ణయ్య  కు బాగా కోపం వచ్చింది. తియ్యటి పండ్లు తెమ్మంటే పుల్లటి పండ్లు తెస్తావా అని తోటమాలిపై రుస రుస లాడాడు. ఏ చెట్టు ఎటువంటి పండ్లు కాస్తాయో నీకు తెలియదా. చూసి మంచి పండ్లను తీసుకురమ్మని చెప్పాను కదా! నీవు చేసిన నిర్వాకానికి మర్యాద పోయింది. మళ్ళీ ఎప్పుడూ ఇలా చేయొద్దని  రామకృష్ణయ్య తన ముఖాన్ని ఎర్రగా చేసుకుంటూ కోపగించాడు.
       వెంటనే తోటమాలి ఇద్దయ్య     " ఆయ్యా ! నేను చెట్లను కాపాడే తోటమాలిని మాత్రమే. నా ప్రాణానికి ప్రాణంగా చెట్లను రక్షించడమే నా విధి. నేను ఇంతవరకు మీ తోటలోని ఏ చెట్టు పండును కూడా  తినలేదు. నాకు రుచిఎలా తెలుస్తుంది? అలా తినడం దొంగతనంతో సమానం అని నా  నమ్మకం. అందుకే తీయ్యటి పండ్లు ఏవో  పుల్లటి పండ్లు ఏవో తెలియక తెంపుకొని వచ్చాను. నన్ను క్షమించు నాయనా! అంటూ వేడుకున్నాడు. అతని నిజాయితీ మాటలకు బంధువులతో పాటు యజమాని కూడా మెచ్చుకున్నాడు.  తోటమాలి నెలసరి జీతాన్ని యజమాని రామకృష్ణయ్య  పెంచడమే కాకుండా జీవితాంతం తన తోటకు తోటమాలిగా భాద్యత అప్పగించాడు . దీనితో ఇద్దయ్య సంతోషపడ్డాడు.
        
      

కామెంట్‌లు