తింగ రోడు:- -- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి- సెల్ : 9441561655
    విక్రమసింహుడు  అనే రాజు ఉండేవాడు . అతడు మంచివాడు. తన ప్రజలను కూడా బాగానే చూసుకునేవాడు . అప్పుడప్పుడు రాజు  అంతఃపురం వదిలిపెట్టి అడవికి వేటకు పోయేవాడు. తన వెంట ఎటువంటి భటులను తీసుకుపోయేవాడు కాదు. ఒంటరిగానే వెళ్లేవాడు.  ఒక రోజున తాను      తన గుర్రం మీద  ఎక్కి అడవికి బయలుదేరాడు. 
     అడవిలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత  ఒక నదిని దాటవలసి వచ్చింది. ఆ నది నీటి లోతు ఎంత ఉందో తెలియదు. అందులో గుర్రం మునిగిపోతుందేమోనని ఆలోచించాడు. నదికి అవతలి ఒడ్డున ,ఇవతల ఒడ్డున తేరిపార చూశాడు. నది అవతలి వైపు ఒక పని పాట లేని తింగరోడు  కనిపించాడు. అతడు దర్జాగా కూర్చుని  ఉన్నాడు. రాజు కేక వేసి అతనితో "నదిలో లోతు ఎంత ఉంటుంది? అవతలికి దాటడానికి గుర్రం మీద ప్రయాణం చేయవచ్చా ?  అని అడిగాడు. 
        " ఓ... దానికేం..?  అవలీలగా  గుర్రం పై నదిని దాటవచ్చు . కంగారు ఎందుకు?  " అని అవతలి ఒడ్డున వున్న తింగ రోడు రాజుతో అన్నాడు. అతని మాటలు విన్న రాజు  మెల్లగా నదిని దాటడానికి ప్రయత్నించాడు.
కొంత దూరం వెళ్లాక గుర్రం కాళ్లు మునిగాయి. మరికొంత దూరం వెళ్లగా  తన కాళ్లు కూడా నీటిలో మునిగాయి. రాజుకి అప్పటికే భయమేసింది . లోతింతేగా... లోతింతేగా... అంటూనే  అనుమానంతో  మరికొంత  దూరం ప్రయాణించి నది మధ్యకు చేరుకున్నాడు. అప్పటికే గుర్రం  నీటిలో మునిగి పోసాగింది. ఇంకా తల పైకెత్తి   గుర్రం ముందుకు పోతుండగా.. గుర్రం మునిగి తాను కూడా ఎక్కడ నీటిలో కొట్టుకుపోతానేమోనని  భయపడ్డాడు. వెంటనే గుర్రాన్ని  వెనక వైపుకి తిప్పి  క్షేమంగా నది ఒడ్డుకు చేరుకున్నాడు.
          రాజు   అవతలి ఒడ్డున ఉన్న తింగరోని తో "  ఏమయ్యా! నదిని గుర్రం మీద దాటవచ్చునని  అన్నావు  కదా!   నీ మాటలు విని అట్లనే  ప్రయాణిస్తే  ప్రాణాలు  పోయేది. తెలియకుంటే తెలియదని చెప్పాలే గానీ, అబద్ధం ఎందుకు చెప్పావని" కోపంతో  గట్టిగా  అన్నాడు. రాజు మాటలు విన్న ఆ వ్యక్తి  "నది నీటి లోపల లోతు నాకేం తెలుసు? నా రెండు బాతులు ప్రతిరోజు  నదిలో ప్రయాణిస్తూ  అవతలి ఒడ్డుకి, ఇవతలి ఒడ్డుకి నదిలో సునాయసంగా  ప్రయాణించడం చూస్తూనే ఉన్నాను. నా బాతుల కాళ్ల ఎత్తు కంటే నీ గుర్రం కాళ్ళ ఎత్తు ఎక్కువగా ఉంది కదా..! బాతులే మునగనప్పుడు గుర్రం నీటిలో ఎలా మునుగుతుందని అనుకున్నాను. అందుకే నీటిలో మునగదని చెప్పాను " అని తింగ రోడు గంభీరంగా పలికాడు. అతని మాటలు విన్న రాజు  చేసేది లేక నవ్వుకుంటూ వెళ్లిపోయాడు .

కామెంట్‌లు