ఆఖేట భక్తి జ్ఞానకుసుమం డెంకిణీకోట జయలక్ష్మి సాహితీ ప్రస్థానం:- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి:-చరవాణి:-9490367383


 మంగళగిరి జయలక్ష్మిడెంకిణీ వేంకటేశ్వర స్వామి భక్తురాలు.సదా వెంకటేశ్వర స్వామితోనే ఆమె ఆలోచనలు జీవనం కొనసాగించింది.
 పెద్ద చదువు లేదు.కానీ దైవానుగ్రహం ఆమె పట్ల పూర్తిగా ఉంది.అందువల్ల జయలక్ష్మి గారు సహజ పాండిత్యం కలిగితెలుగు,తమిళం,కన్నడం భాషలోనే కాక సంస్కృత భాషలో కూడా రచనలు చేయడం విశేషం.పద్యరచనలో,కీర్తనలు,పాటలురాయడంలో అందె వేసిన చెయ్యి.రచనలన్నింటిలో భక్తి తొణికిసలాడుతుంది. ఒకసారి జయలక్ష్మి గారే  స్వయంగా చెప్పుకున్నారు.
ఇంటిముందు ఒక సంధ్యాసమయంలో గడప దగ్గర కూచున్నప్పుడు ఒక వెలుగు వచ్చి తన జిహ్వపై చుట్టుకున్నట్టు అనిపించిందట. వెంటనే "నర్తనమాడగా నే నిన్ను కోరితినాదు జిహ్వపైననునవ మోహనాంగినాతి శారదా దేవి" అంటూ
సరస్వతి రూపాన్ని చక్కగా వర్ణించారు ఆ కీర్తనలో..నా జిహ్వపై నర్తనమాడమంటూ వేడుకుంటూ కలికి నీ కృప కలిగింది కొంతకాలం అని అంటారు.. సరస్వతీ వైభవం గురించి కీర్తించారు.నిజంగా ఇదంతా  ఆమె చేసుకున్న పూర్వ జన్మ పుణ్య ఫలితమే సుమా.
  భక్త పోతన,ఆతుకూరి మొల్ల వలె జయలక్ష్మి గారికి ఆఖేట వేంకటేశ్వరుని కరుణా కటాక్షం పూర్తిగా ఉంది.
  ఆమె రచనలన్నింటిలో కూడా ఆ స్వామి ముద్రనే ఉంటుంది.
తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాపారపట్టి గ్రామానికి చెందిన హరితస గోత్ర సంజాతుడు, వైదికధర్మ నిష్ణాతుడు అయిన వేంకటరమణయ్య,లక్ష్మీ దంపతులకు రుద్రోత్కారీ సంవత్సరం జ్యేష్ట బహుళ విదియ అంటే  మే నెల 31 వ తేదీ 1923 వ సంవత్సరంలో జ్యేష్ఠ పుత్రికగా జన్మించింది.
 1934 సంవత్సరంలో తన 11 వ యేట తమిళనాడు కృష్ణగిరి జిల్లా డేంకిణీపుర నివాసి శ్రీవత్సస గోత్ర సంభవుడు శ్రీ వెంకట రామయ్య గారికి ధర్మపత్నిగా వచ్చి చేరింది.
    జయలక్ష్మి తన 39 వ ఏట నుండి హోసూరు ప్రాంతంలో తోగూరి అగ్రహారానికి చెందిన సాకమ్మ రచించిన యక్షగాన రామాయణం పఠనాస్ఫూర్తి వల్ల,చిన్నప్పటి నుండి స్త్రీల బృందం వల్ల తాను నేర్చుకున్న అనేక  
వ్రతానికి సంబంధించిన పాటలు, భక్తుల కథలు,కీర్తనలు,స్తోత్రాలు,శ్లోకాల పఠనాసక్తి వల్ల  భగవంతుని అనుగ్రముతో తెలుగు భాషలో 12 శతకాలు,
5 కావ్యాలు,1500 గద్యపద్యాలతో శ్రీరామకథామృతం పేరుతో రామాయణ ఇతిహాసం,
30 ప్రబంధాలు,సుమారు 600 కీర్తనలు 
రచించడమే కాక 
సంస్కృత భాషలో ఆఖేట వేంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రము, ప్రపత్తి, మంజరికా స్తోత్రము మంగళము కరావలంబం రచించారు.
తన చిన్నతనం లోనే అత్తగారింటికి వచ్చిన జయలక్ష్మి వారి ఊరిలో ఉన్న డేంకిణీ వేంకటేశ్వర స్వామి, సౌందర్యవల్లి లపై భక్తిని పెంచుకుని ప్రతిదినం వారి సేవలోనే తరించేది.
ఇక్కడ ఓ విషయం చెప్పాలి.
డేంకిణీ పురంలో వెలసిన శ్రీ  వేంకటేశ్వరుడు సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతి నాధుడే.ఇక్కడ  ఒక చిన్న కథ.
 యక్షుని సంహరించి కణ్వముని  మనోభీష్టమును పూర్తి చేయ డేంకిణీ పురము నందున
తిరుమల తిరుపతి నుండి శ్రీ వేంకటేశ్వర స్వామి కణ్వమహర్షి ప్రార్థన ద్వారా వ్యాఘ్ర రూపంలో ఉన్న మహార్ణవుడు అనే అధమ యక్షుని సంహరించి కణ్వముని  మనోభీష్టమును పూర్తి చేయ డేంకిణీ పురము నందు నెలకొన్నాడని స్కాంధపురాణంలో 580 శ్లోకాలలో వర్ణించబడింది.
తమిళనాడులోని హోసూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న దివ్య క్షేత్రం ఈ డేంకిణీపుర శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యధామము.
"నెలత నా హృదయమున కొలువైన ఆఖేట నాథుడు,మృగయా నాథుణ్ణి ,డేంకిణీ పుర వైశిష్ట్యాన్ని , చారిత్రక నేపథ్యమును కీర్తనలో  చక్కగా వివరించారు జయలక్ష్మి గారు.
వ్యాఘ్రరూపంలో వచ్చి మునిబాలకులను భక్షించిన అధమ యక్షుణ్ణి శపించాడు తపస్సు చేసుకుంటున్న కణ్వమహర్షి అంటూ చారిత్రక నేపథ్యం మాత్రమే కాక  స్థల వైశిష్ఠ్యమును  తన  చక్కటి రచనలో  మనకు అందించారు.
జయలక్ష్మి గారు 
12 శతకమాలలు రచించారు.ఒక్కో శతకంలో ఒక ప్రత్యేకత.
జయలక్ష్మి హృదయ వాస అని చెప్పుకుంటూ 
"బేట వెంకటేశ పుడమి పోష"
అనే మకుటంతో సౌందర్య వల్లీ సమేత శ్రీఆఖేట వేంకటేశ్వర స్వామిపై షష్ఠమ శతకం ఆటవెలది చందస్సులో రాశారు .
జయలక్ష్మి గారి  శతక మణిమాలలో ఇది ఆరవది.
నవమ శతక మాలలో
అనేక రకాల పద్యాలలో తే.గీ, ఆటవెలది, స్రగ్విణీ,సీసము,కందము,మత్తేభము,పంచ చామరము మొదలైన వివిధ చందస్సులలో  రాస్తూ వివిధ దేవతలు  అయిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి,
కాశీ విశ్వేశ్వరుడు ఎల్లమ్మ, గురించి వర్ణించడం జరిగింది.
శ్రీరాముని గురించి 
5 సీసపద్యాలలో రాశారు.
తెచ్చిపెట్టుకోక సాఫీగా సాగుతున్న శైలి.భక్తి పారవశ్యంతో రాసిన కీర్తనలు,పద్యాలు.
అన్నింటిలో ఆఖేటనాథుని ముద్ర జయలక్ష్మి గారి 
రచనలలో కనిపిస్తుంది.సులువైన శైలితో అందరికి అర్ధమయ్యే రీతిలో రచన చేయడం ఈమె ప్రత్యేకత.
దేవునితో తాదాత్మ్యం చెంది భక్తిలో ఈదులాడిన వైనం.
తనరచనలు ఆఖేట నాథునికి సమర్పించిన ఆభరణాలుగా వర్ణించడం తన రచనలోని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ప్రతి పదం సులువుగా జాలువారుతూ చదువరుల మనస్సును భక్తి ఆనందంలో ముంచెత్తుతుంది.
డెంకిణీకోట జయలక్ష్మి వెంకటరామ్ గారి భక్తి రచనలు.
తన 13 వ యేట నుండి తుదిశ్వాస విడిచేవరకు 14/8/2017 వరకు పాడుతూనే  తన మాతృ భాష తెలుగులోనే కాక  చిన్న వయసులో వివాహం చేసుకొని వచ్చిన తర్వాత తమిళ భాషలో కూడా రచనలు చేశారు.
భక్తిపారవశ్యంతో తన 
39 వ ఏటనుండీ రాయడం మొదలు పెట్టారు. తనకు చదువు పూర్తిగా రాకపోయినను  అంటే మూడవతరగతి వరకు మాత్రమే చదివినప్పటికి భగవంతుని కృప వలన సహజ పాండిత్యంతో ఆమె వెలుగొందారు.
ఎక్కడ కూడా నేను రాశాను.ఇన్ని రచనలు చేశాను అని గొప్పలు చెప్పుకోలేదు.పోతన మహాకవి వలె ఆ దేవుడే రాశాడు ,రాయించు
కున్నాడు అని ఎంతో వినయంగా చెప్పుకున్నారు జయలక్ష్మి గారు. భక్తిభావం తొణికిసలాడే విధంగా ఎన్నో రచనలు చేసి 
ఆ దేవునికి సమర్పించే ఆభరణాలంటూ  చక్కని సీసపద్యాల్లో చెప్పారు.
స్వయంగా ఆ దేవుడే వచ్చి నాలుకపై కొలువున్నాడంటే మహాకవి కాళిదాసుకు సరస్వతి జిహ్వపై వాక్కును గీసినట్లుగా ఆమెకు కూడా సరస్వతి జిహ్వపై ఆ దేవీ కటాక్షంతో గొప్ప పాండిత్యం అబ్బింది.
వీరి పూర్వజన్మ సుకృతం వల్లనే కాబోలు అక్షరం రాని వారిని కూడా అందలమెక్కించారు నమ్ముకున్న ఆఖేట స్వామి వారు. జయలక్ష్మి గారు కారణజన్మురాలు.
ప్రేమ జాలువారగా భక్తి పొంగారగా
అక్షరాలు పరుగెత్తాయి కాదు దౌడు తీశాయి. అది అంతా భగవత్ సంకల్పం.
 
 హేవిళంబి  నామ నంవత్సరం శ్రావణమాసం బహుళ సప్తమి తిథి రోజు తన 95 వ ఏట తన ఇష్టదైవము,తాను కొలిచిన
 దైవమయిన శ్రీ ఆఖేట వేంకటేశ్వర స్వామిలో లీనమైనారు జయలక్ష్మి గారు.
ఆమె రచనలు కోకొల్లలు.
తెలుగు భాషలో చేసిన రచనలు:
కావ్యాలు:
1.గజేంద్ర మోక్ష కథనము
2.శ్రీ బాల ప్రహ్లాద పరిపాలనము
3.వామన చరిత్రము
4.డేంకిణీ కోట స్థల పురాణము
5.శ్రీ బాలకృష్ణ లీలలు
పురాణ కథనాలు
1.మత్స్యావతారము
2.కూర్మావతారము
3.ఆదిశేష గరుడ వృత్తాంతము
4.ఆంజనేయ వృత్తాంతము
5.శిబిచక్రవర్తి కథనము
6.ద్రౌపదీ వస్త్రాపహరణ కథనము
ఇంకా ఇతర రచనలు తెలుగు భాషలోనే.
1.కుముళ విలాపము
2.చంద్రావళి
3.వృశ్చిక మాల
4.నౌకా చరిత్ర
5.ధనుర్భంగసమయ
మందు సీతమనస్సు
6.శుకముని స్నానము
7.తిరువళ్ళికేణి లేక బృందావనక్షేత్ర మహిమ
8.హంసవిశతి
9.పద్మావతీ వల్లభ అష్టకము
10.శ్రీరామ శ్రీకృష్ణ పోలిక మాటలు
11.శ్రీ హరి హరుల పోలిక మాల
12.సహస్రమణిమాల స్తోత్రము
13.నామావళి స్తోత్రములు. ఇలా ఇన్ని రచనలు చేసి
భగవదర్పితం చేశారు.
తెలుగు మాతృభాషగా కలిగిన కుటుంబంలో పుట్టి 3 వ తరగతి వరకే చదివి తన 10 వ ఏట ఉపాధ్యాయవృత్తిలో ఉన్న డేంకిణీ కోట నివాసి వెంకటరామ్ గారితో వివాహం జరిగి ఆఖేట వేంకటేశ్వరుని భక్తురాలుగా జీవితాన్ని కొనసాగించి నలుగురు పిల్లలతల్లి అయినది.
ఇప్పుడు వారి అబ్బాయిలు ముగ్గురు మంగళగిరి జయలక్ష్మి గారి రచనలను వెలికితీసి ముద్రించడమే కాకుండా వారు రచించిన కీర్తనలను సైతం ప్రముఖ గాయకులచే పాడించి రికార్డు చేసి యూ 
ట్యూబ్ లో పెడుతున్నారు. శ్రమకోర్చడమే కాకుండా ఎంతో డబ్బు వెచ్చించి తల్లి ఋణాన్ని తీర్చుకుంటున్న 
గొప్ప పుత్రులు, సహృదయులు.
వారు చేస్తున్న కృషి ఎంతో శ్లాఘనీయం. కేవలం తన పుత్రుల వల్లనే ఆమె కవయిత్రిగా సంకీర్తనాచార్యులుగా ప్రసిద్ధి గాంచిందంటే అతిశయోక్తి కాదు.
ఆమె జీవితం పరిపూర్ణం. ఆమె పుత్రుల జీవితం ధన్యం
 జయలక్ష్మి గారి ముగ్గురు పుత్రులు హోసూరులో మే నెల  2023 సంవత్సరంలో వారి తల్లిగారి శత జయంతి ఉత్సవాలను  ఎంతో ఘనంగా నిర్వహించి తల్లిగారి స్మృతిలో కవులందరి చేత రచించిన పద్యసంకలనం అభినందన సంచికను ఆవిష్కరించడమే కాకుండా తల్లి గారి రచనలను కొన్ని ముద్రించి కవులందరికీ  ఉచితంగా పంచి శ్రీమతి  జయలక్ష్మి గారి ఘనతను ప్రజలకు తెలియజేయడం ఎంతో ముదావహం.
ద్వితీయ శతక మణిమాలలో ఆమె రచనా ఔన్నత్యాన్ని నిరూపిస్తూ మచ్చుకు  
ఒక చక్కని పద్యం సీసపద్యాలతో రాసిన శతకంలో జయలక్ష్మి గారి భక్తిప్రపత్తికి,ఆమె రచనా వైదుష్యానికి  అద్దం పడుతుంది.
ఇందులో ఆమె మనసుతో భక్తిని రంగరించి చేసిన పాయసాన్ని 
వండి వార్చిన విధానాన్ని , ఆరగింపుచేసి వేడుకోవడమే కాక మోక్షమివ్వమని ప్రార్థిస్తూ చాలా చక్కగా వర్ణించారు.
సీ.ప.
 
"పాయసంబొక్కటి వండితి మనమందు
బహురుచితోడను పక్వముగను
చిత్త శుద్ధనియేటి
క్షీరంబులను బోసి
భక్తనే చెష్కర పరగ వేసి
ఏకచిత్తంబనే ఏలక్కులను వేసి
గొప్ప కోర్కెయనేటి ఘోమృతముతొ
నమ్మిన భావంపు నారికేళంబుతో
నగుమోము ఆఖేటనాథు నీకు
తే.గీ
ఇట్టి పాయసంబును అలియింపు గ్రోలి
ఇంతి నాకు మోక్షమును నీవు నివ్వవలెను
సదయ మృగయాపతీ నాదు హృదయ వాస
డెంకణీపురశ్రీ భేట వేంకటేశ!!
సులువైన శైలిలో నిండైన భక్తితో
మెండైన రచనలు చేసి మనకు అందించిన అభినవమొల్ల జయలక్ష్మి గారి జీవితం ఆఖేట నాథ హృదయ మిళితం..
ఒక మొల్ల,పోతన,రామదాసు మొదలైన భక్తకవుల వలె జయలక్ష్మి స్వయంసంజాత కవయిత్రి..
 జయలక్ష్మి అమ్మగారికి ఈ విధంగా స్మరించుకోవడం మనకు దక్కిన యోగఫలమే సుమా.
 ఇంతటి ఘనతకు పాత్రురాలైన సహజకవయిత్రి శ్రీమతి జయలక్ష్మి గారి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నా భావన.
------------------
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
విశ్రాంత సహాయాచార్యులు
హైదరాబాద్
చరవాణి:
9490367383


కామెంట్‌లు