నిలువెత్తు నిజాయితీ !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి .-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
 రామాపురం అను ఊరిలో రామయ్య, సీతమ్మ అను దంపతులు ఉండేవారు. వారికి
యమున, జమున అను ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారిని సర్కారు బడిలో చదివిస్తున్నారు.
రామయ్య రిక్షా తొక్కి వచ్చిన పదో పాతికో సంపాదించి కుటుంబాన్ని నడుపుతున్నాడు. సీతమ్మ బట్టలు కుట్టి భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది.
వారి పిల్లలు యమున ,జమున బడిలో క్రమశిక్షణతో ఉంటూ అందరి ఉపాధ్యాయుల మనసులను ఆకట్టుకున్నారు. అంతేకాక బాగా చదివి ఆ బడిలోని పిల్లలందరి కన్నా ముందుండేవారు. అందుకే ఉపాధ్యాయులకు వారిపై అంత అభిమానం.
ఒకరోజు యమున, జమున తమ తల్లిదండ్రులతో" అమ్మ నాన్న! ఈరోజు మా బడిలో బడి వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. మా ఉపాధ్యాయులు తల్లిదండ్రులను వెంట తీసుకురావాలని ఆదేశించారు. కాన ఈరోజు మీరు మాతో బడికి రావాలి" అని కోరారు!
ఓహో ! అలానా! సరే అనగా పిల్లలు సంతోషించారు. సాయంత్రం అంతా తయారయ్యి బడికి వెళ్లారు.
బడి వాతావరణం అంతా కోలాహలంగా ఉంది. ముఖ్య అతిథిగా ఆ ఊరి గ్రామ సర్పంచ్ గారు వారి భార్య పిల్లలతో సహా విచ్చేశారు. వారిని స్టేజి పైకి ఉపాధ్యాయ వర్గం ఆహ్వానించింది
వారి చేతుల మీదుగా బాలబాలికలకు బహుమతి ప్రధానం చేయించారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు వారిచే నిర్వహింపజేసి కార్యక్రమాన్ని ముగించారు.
         ఆ పిదప స్టేజిపై ఉన్న కుర్చీలు, టేబుల్లను సర్దమని బాల బాలికలకు ఆదేశించారు. ఆ కార్యక్రమంలో యమున జమునలు కూడా మమేకమైనారు.
పనిముట్లను సర్దుతుండగా, యమునా, జమునలకు ఓ  బంగారు హారం కనపడింది. ఆ హారాన్నీ తమ చేతిలోకి తీసుకొని వెంటనే ప్రధానోపాధ్యాయుల వారికి అప్పజెప్పారు.
    ప్రధానోపాధ్యాయులు "మీకు ఈ హారం ఎక్కడ దొరికింది"అని ప్రశ్నించారు. స్టేజిపై ఉన్న టేబుల్ క్రింద దొరికింది సార్"అని సమాధానం ఇచ్చారు. సరే మీరు వెళ్ళండి వెళ్ళండి అనగానే ఆ పిల్లలు ఇద్దరు ప్రధానోపాధ్యాయుల గది నుండి నిష్క్రమించారు.
దొరికిన ఆ నగను ప్రధానోపాధ్యాయులు అటు ఇటు తిప్పి చూడగా నగమధ్య ఓ లాకెట్టు ఉంది. దాన్ని తెరిచి చూడగా అందులో ఆ ఊరి సర్పంచ్ గారు, వారి సతీమణి ఫోటోలు ఉన్నాయి. హెచ్ఎం గారు వెంటనే సర్పంచ్ గారికి కాల్ చేసి బడికి పిలిపించారు."చూడండి! ఈ హారం మీదేనా! ఇందులో మీ ఫోటోలు ఉన్నాయి అనగానే వారికి హారం పోయిన సంగతి గుర్తుకొచ్చి"ఏది ఇటు ఇవ్వండి!
అంటూ నగ తీసుకొని చూసి మాదే అని చెప్పి, మీ చేతికి ఎలా వచ్చింది ఈ నగ" అని ప్రశ్నించారు.
వెంటనే హెచ్ ఎం గారు యమున జమున తెచ్చిన సంగతి చెప్పారు.
"అలానా! ఆ పిల్లలను తల్లిదండ్రులతో సహా ఈ రోజే పిలిపించండి. వారికి ఉడతా భక్తిగా సన్మానం చేద్దాం అనగా"
"సరే సార్ పిలిపిస్తా! మీరు వెంటనే రండి"ఆ పిల్లల తల్లిదండ్రులకు కాల్ చేస్తా అని చెప్పాడు.
మరునాడు జమున, యమున ప్రధానోపాధ్యాయుడి పిలుపుకు ఆశ్చర్యపోయి"ఎందుకు పిలిపించారబ్బా"అని వారి మదిలో అనుకుంటూ పిల్లలను తోలుకొని బడికి వచ్చారు. అప్పుడే సర్పంచ్ గారు వారి సతీమణి గారు స్టేజి పైన కూర్చొని ఉన్నారు. హెచ్ఎం గారు వీరిని చూసి స్టేజి పైకి ఆహ్వానించారు.
ప్రేక్షకుల సమక్షంలో ఆ పిల్లలు ఆపజెప్పిన నగను గూర్చి తెలియజేసి ఆ పిల్లలను, వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. నిలువెత్తు నిజాయితీకి యమునా జమున లు నిదర్శనమని, వీరిని తోటి పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ గారు, బడి ప్రధానోపాధ్యాయులు  సెలవిచ్చారు.

కామెంట్‌లు