మచ్చిక:- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
         నామాకొండ అడవిలో జంతువులు ఆనందంగా నివసిస్తున్నాయి. అడవిలో పెద్ద కొండ ఉండడం మూలంగా అధిక వర్షాలు కురవడంతో ఆహారానికి ఎలాంటి లోటు లేకుండా ఉండేది. కడుపునిండా తిని, కంటి నిండా కునుకు తీసేవి.
               ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు మారువేషంలో మామూలు వ్యక్తిలా వచ్చాడు. అడవంత కలియతిరిగి జంతువులను మచ్చిక చేసుకోసాగాడు. ఒక వృద్ధనక్క వచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదని, వేటగాడని కనిపెట్టింది. కానీ ఈ విషయం జంతువులకు చెప్తామంటే, జంతువులు నమ్మవని, వృద్ధాప్యం వచ్చినా, కపట బుద్ధి పోలేదా అని కోపగిస్తాయని,  తనలోనే విషయం దాచుకుంది. వేటగాడు ప్రతిరోజు రావడం జంతువులకు ఆహారం అందించి, వాటితో ఆడుతూ తిరగసాగాడు. వేటగాడు వలద్వారా కాకుండా మత్తు భోజనంతో జంతువులను అడవి నుంచి అమ్మకానికి తరలించాలనుకున్నాడు.
                 ఒకరోజు ఎడ్ల బండి కట్టుకొని, మత్తు కలిపిన భోజనంతో వేటగాడు అడవిలోకి వచ్చాడు. జంతువులతో కాసేపు ఆడి, ముచ్చటించి మత్తు భోజనం వేస్తానని, వేటగాడు జంతువుల వద్దకు వెళ్లాడు. నక్క నెమ్మదిగా ఎడ్ల బండి వద్దకు వచ్చి, మత్తు కలిపిన భోజనం కాస్త ఎద్దులకు పెట్టింది. వేటగాడు జంతువులతో ఎడ్ల బండి వద్దకు వచ్చాడు. మత్తు కలిపిన భోజనం తింటూ ఒక్కసారిగా ఎద్దులు కింద కుప్పకూలాయి. జంతువులన్నీ ఆశ్చర్యపోయి వేటగాడి వంక కోపంగా చూశాయి. వేటగాడు బతుకు జీవుడా! అంటూ అడవి నుంచి పరుగు తీశాడు. 
                వేటగాడి బారి నుండి కాపాడినందుకు వృద్ధ నక్కకు జంతువులు కృతజ్ఞతలు తెలిపాయి. కాసిన్ని నీళ్లు తెచ్చి, ఎద్దులపై చల్లి తిరిగి ఎద్దులను సురక్షితంగా జంతువులు తిప్పి పంపాయి. ఏమి అర్థం కాక ఎద్దులు బండితో అడవి నుంచి తమ నివాసానికి చేరాయి. జంతువులు వృద్ధనక్క సూచనలు వింటూ అపరిచితులను నమ్మకుండా జాగ్రత్తగా జీవించసాగాయి.
                 


కామెంట్‌లు