సాయం:- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084

           అంకిరెడ్డిపాలెం గ్రామంలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు. తాను కూరగాయల సాగు చేస్తూ జీవించేవాడు. ధర్మయ్య ఉన్నత విద్య చదువుకున్నాడు. పట్నంలో పలు కంపెనీలలో ఉద్యోగం వచ్చినా, తాను మాత్రం ఇంటిపట్టునే ఉంటూ వ్యవసాయ పనులు చేస్తూ జీవించసాగాడు. 
                  ధర్మయ్యకు ఉన్న పది ఎకరాల పొలంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటతో పాటుగా కూరగాయలు సాగుజేస్తూ, ఆవుపాల వ్యాపారం చేసేవాడు. అంతా బాగానే ఉంది కానీ ధర్మయ్యకు వివాహం చేద్దామంటే దగ్గరి బంధువులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ మట్టిని పూసుకుని తిరిగే నీకు మేం పిల్లను ఇవ్వలేం. పట్నంలో ఉద్యోగం చేసే వాళ్లకే ఇస్తామంటూ ధర్మయ్యను మాటలతో ఇబ్బందికి గురి చేస్తూ, పట్నంలో ఉద్యోగం చేసే వారి సంబంధాలు కుదుర్చుకునేవారు.
              ధర్మయ్య మాత్రం చిరునవ్వు సమాధానంతో తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడు. పేద కుటుంబంలో దూరపు చుట్టరకమైన కమలను వివాహం చేసుకుని సంతోషంగా జీవించసాగాడు. ఓపికతో వ్యవసాయం చేస్తూ ధర్మయ్య నాలుగు రాళ్లు వెనుకేసుకుని, అగ్గువ ధరలో ఇరుగుపొరుగు భూములను కొనుగోలు చేసుకోసాగాడు. 
              తనకు పిల్లనివ్వకుండా పట్నంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఇచ్చినవారు. సెలవు రోజు వచ్చిందంటే చాలు దాచిన డబ్బులతో  ఒకటి, రెండు ఎకరాల పొలం కొనుక్కోవాలంటూ మధ్యవర్తులతో పల్లెలు తిరగసాగారు. పది ఎకరాలు ఉన్న ధర్మయ్యకు పిల్లనివ్వకుండా, ఒకటి, రెండు ఎకరాల కోసం పల్లెలు తిరుగుతున్న బంధువులను చూసి జనం ముక్కున వేలేసుకోసాగారు.
                పట్నంలో ఉద్యోగం చేస్తూ దూరం ఉన్న కూతురు, అల్లుడు ఆపద సంపదకు రాకపోవడంతో బాధపడుతున్న వారికి  ధర్మయ్య మాత్రం మనసులో ఏం పెట్టుకోకుండా తోచిన సాయం చేయసాగాడు. ధర్మయ్యను చూసిన గ్రామస్తులు, బంధువులందరూ వ్యవసాయంలోనే సాయం చేయాలన్నా గుణం ఉందన్న నిగూడార్ధాన్ని గ్రహించారు.

కామెంట్‌లు