విహారయాత్ర :- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084

  నందగోకులం గ్రామంలో ఒక రోజు పాఠశాలకు వెళ్లిన విద్యార్థులను ప్రకృతి విహారయాత్రలో భాగంగా ఉపాధ్యాయుని కౌసల్య గ్రామంలోని అడవిలోకి తీసుకవెళుతుంది. విద్యార్థులందరూ అడవంతా తిరుగుతూ పండ్లు, ఫలాలు తింటూ ఆనందంగా గెంతులు వేగసాగారు. కొంతసేపయ్యాక  ఉపాధ్యాయినీ కౌసల్య అందర్నీ ఒక చెట్టు కిందకు పిలిచి ముచ్చటించసాగింది.
           పచ్చని ప్రకృతితో పాటుగా, పక్షుల కిలకిల రావాలతో ఉన్న అడవిని చూసి విద్యార్థులందరూ ఆనందం వ్యక్తం చేశారు. అడవి గురించి ఎన్నెన్నో కబుర్లు చెబుతూ ఆనందపడసాగారు. ఇంత చక్కని అడవిని మన బడిలో కూడా నిర్మిద్దామంటూ విద్యార్థులు ముచ్చటించుకోసాగారు. విద్యార్థులు అందరూ ఆనందంగా ఉండడం ఉపాధ్యాయుని కౌసల్య ఆనందించింది.
           మన గ్రామంలో ఇంత పచ్చని ప్రకృతి ఉండడానికి కారణం ఏమిటని? విద్యార్థులను ప్రశ్నించింది. ఇక్కడ చెట్టు, చేమ బాగుంది. వర్షం ఎక్కువగా ఉంది. జంతువులు ఉన్నాయంటూ రకరకాలుగా విద్యార్థులు తలో సమాధానం చెప్పారు. ఎవరు ఎన్ని సమాధానాలు చెప్పినా ఉపాధ్యాయిని కౌసల్య మాత్రం నిజమనలేదు. అసలు విషయం మీరే చెప్పుమని, విద్యార్థులందరూ ఉపాధ్యాయుని కౌసల్యను  అడిగారు.
                 ఇప్పుడు మనమున్న ప్రాంతం గతంలో  ఎడారిగా ఉండేదని, మనమున్న ప్రాంతానికి కాస్త దూరంలో ఒక శివాలయం ఉండేది. అక్కడ పండరయ్య అనే పూజారి శివుడిని పూజించేవాడు. తాను ఒక ఆవును పెంచుకునేవాడు. ఆవుకు చిన్న లేగ పుట్టింది. పండరయ్య శివ పూజతో పాటుగా ఆవులేగలను సాదేవాడు. అడవిలోకి జనం అస్సలు  వచ్చే వారు కాదు.
              ఒకరోజు కొండయ్య అనే వేటగాడు జింకల కోసం ఒక వల వేశాడు. కొండయ్య వేసిన వలలో పండరయ్య పెంచుతున్న లేక దూడ చిక్కుకుంది. వలలో చిక్కిన లేగ దూడను చూసి, కొండయ్య సంబరపడి లేగదుడను ఈరోజు అంగడిలో  అమ్ముకోవాలని ముందుకు కదిలాడు. కానీ అంతలోనే పండరయ్య వలలోంచి లేగ దూడను తప్పించి, తన భుజంపై వేసుకుని పరుగు తీశాడు. పండరయ్య వెనకాలే వేటగాడు పరుగుతీస్తూ, వలలో చిక్కిన ప్రతి జీవం నాదే! అంటూ అరుస్తూ పండరయ్యను అనుసరించాడు. పండరయ్యకు ఎటు వెళ్లాలో తెలువక సరాసరి గ్రామ కచేరి వద్దకు వెళ్లాడు.
                 పూజారి పండరయ్య పరిగెత్తుతూ రాకను గమనించిన గ్రామ పెద్ద మనుషులు విషయం తెలుసుకున్నారు. కొండయ్య మాత్రం వలలో పడిన జీవి నాదేనంటూ మొండిగా వాదించసాగాడు. ప్రజల జీవనాధారమైన గోవులను ఎలా నీకు ఇస్తామని వేటగాడు కొండయ్యతో గ్రామస్తులు వాదించారు. మరి నేను ఎలా బతకాలి. నా జీవనాధారమే వేట అంటూ కొండయ్య ప్రజలను  ఎదురు ప్రశ్నించాడు. పూజారి పండరయ్య కొంత ధనము వేటగాడు కొండయ్యకు ఇచ్చి, తన లేగదూడని తీసుకువెళ్లబోగా, అయ్యా! పూజారి మరి ఈరోజు మీరు లేగదూడ కోసం ధనమిచ్చారు. మరి మేము రేపటినుండి అడవిలో వేటగాడి వలలో చిక్కిన జీవమున్న వాటికి మేము ఏమి ఇవ్వాలని ప్రజలు అడిగారు.
           పూజారి పండరయ్య నవ్వుతూ దీనికంతటికి కారణం అడవిలో మనం చెట్లు నరకడం. అందువల్ల చెట్లు నరకకుండా అడవిని పెంచుకుంటే, వర్షంతో  వ్యవసాయ సాగు, పండ్లు, ఫలాలతో సుఖంగా జీవించవచ్చని అన్నాడు. వేటగాడు కొండయ్య కూడా నాకు జీవనోపాధి ఉంటే వేటను మానేస్తానని తెలిపారు. ప్రజలంతా బాగా ఆలోచించి, అడవిని కాపాడడంతో పాటు పెంచడం మూలంగా నేడు మన గ్రామానికి నందగోకులం అనే పేరు వచ్చిందని ఉపాధ్యాయుని కౌసల్య విద్యార్థులకు చెప్పింది. విద్యార్థులంతా మన గ్రామానికి ఇంత చరిత్ర ఉందా అంటూ సంతోషించారు.
                విద్యార్థులంతా కూడా బాగా ఆలోచించి, అడవిలో అందమైన ప్రకృతి ఉన్నట్లుగానే కొద్ది రోజుల్లో పాఠశాలలో కూడా పచ్చదనం కలకలలాడేలా నిర్మించారు. పచ్చని ప్రకృతి ఆడెందుకై  విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు పాఠశాలను నందనవనంగా మార్చారు. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులను విజ్ఞాన విహారయాత్రలకు తీసుకువెళ్లి, విద్యార్థుల ఆలోచనాశక్తికి ఉపాధ్యాయుని కౌసల్య  చేయూత నివ్వసాగింది.


కామెంట్‌లు