ధైర్యం:- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
  మూలవరం అనే గ్రామంలో రాజమ్మ అనే వృద్ధురాలు ఉండేది. గ్రామంలో ఎవ్వరి ఇంట్లో ఆపద కలిగిన రాజమ్మ పండో, ఫలమో తీసుకువెళ్లి, పలకరించి వచ్చేది. రాజమ్మ మనుమడు కనకయ్య. రాజమ్మ అలా గంటల తరబడి పలకరింపులకు వెళ్లడం మనుమడు కనకయ్యకు నచ్చేది కాదు.
             ఎవరి ఇంట్లో ఏ ఆపద కలిగిన రాజమ్మకు క్షణాల్లో తెలిసేది. తన అనుభవంతో సమస్యకు పరిష్కార మార్గం తెలిపి, ఇంటికి వచ్చేది. ఎలాంటి పని పాట లేకుండా ఇంట్లో మూలన కూర్చోక, ఇలా ఇల్లు ఇల్లు తిరగడమేంటని ఇంట్లో వాళ్ళు కోపగించుకునేవారు. అయినా రాజమ్మ ఎవరి మాట వినేది కాదు. కాలుకు చక్రాలున్నట్టుగా ప్రతి ఇల్లు తిరిగి పలకరిస్తూ వచ్చేది. ఒకరోజు మనమడు కనకయ్యకు దోస్తులతో ఆటలు ఆడడానికి ఏ గల్లీ వేళ్ళినా నానమ్మ రాజమ్మనే కనిపించింది. ఆరోజు నానమ్మ రాజమ్మపై ఇష్టం వచ్చినట్లు కనకయ్య కోపగించుకున్నారు. రాజమ్మ అలిగి తెల్లవారి కూతురు దగ్గరికి పక్క ఊరికి వెళ్ళింది.
           అదేరోజు పాఠశాల నుంచి సైకిల్ పై వస్తున్న కనకయ్య అదుపుతప్పి కిందపడ్డాడు. కాలుకు బాగా దెబ్బ తగిలి,  రక్తం కారిపోవడంతో  స్పృహ  కోల్పోయాడు. దారిలో వెళ్లేవాళ్ళు ఆసుపత్రికి తరలించగా, అయ్యో! రాజమ్మ మనుమడికి దెబ్బ తగిలిందని, గ్రామస్తులంతా ఆసుపత్రికి వెళ్లారు. కనకయ్యకు రక్తం అవసరమైతే ఇచ్చారు. తల్లిదండ్రులకు డబ్బు సాయం కూడా చేశారు. నెమ్మదిగా కండ్లు తెరిచిన కనుకయ్యకు గ్రామస్తులు చెప్పే మాటలకు ధైర్యం వచ్చి, సగం గాయం తగ్గిపోయింది. అంతలోనే విషయం తెలుసుకున్న రాజమ్మ ఆసుపత్రికి వచ్చింది. కనకయ్య నానమ్మ రాజమ్మను క్షమించమన్నాడు. నానమ్మ నువ్వు ఎంతోమందికి ధైర్యం చెబుతున్నావన్న విషయం తెలువక కోపగించుకున్నానన్నాడు. గ్రామస్తులు ఇచ్చిన పండ్లు, ఫలాలు ఆస్పత్రిలో ఉన్న వారందరికీ రాజమ్మతో పంచాడు. మనుమడి మంచి మనసుకు రాజమ్మ సంబరపడింది.


కామెంట్‌లు