ఓటు:- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
    శివనాగుపురంలో లక్ష్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు. గ్రామంలో నిజాయితీపరుడుగా ఉండేవాడు. లక్ష్మయ్యది కష్టపడి పని చేసే మనస్తత్వం. కానీ తాను ఎన్నికలలో ఏ వ్యక్తికి ఓటు వేసిన ఓడిపోతుండేవాడు. ఎందుకో లక్ష్మయ్యకు ఓటు వేయాలంటే భయం పుట్టుకుంది.
            ఓసారి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. సాంబయ్య, కోటయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఎన్నికలలో నిలబడ్డారు. ఎన్నికల సమయంలో లక్ష్మయ్య వద్దకు వచ్చి ఓటు అడిగారు. నేము సుమారు పది ఎన్నికల్లో ఓటు వేశాను. నేను ఓటు వేసిన వారందరూ ఓడిపోయారు. మరి మీకు వేయమంటే వేస్తానని లక్ష్మయ్య అన్నాడు. అమ్మో! నాకు ఓటు వేయకూ, వామ్మో! నాకు ఓటు వేయకూ అంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు. సాంబయ్య, కోటయ్యలు లక్ష్మయ్యను ఓటు వెయ్యమనడమే మానేశారు. 
             ఎన్నికల రోజు అందరూ ఓటు వేశారు. కానీ లక్ష్మయ్య మాత్రం ఓటు వేయలేదు. సాయంకాలం ఎన్నికల ఫలితాలు లెక్కించారు. సాంబయ్య, కోటయ్యలకు సరాసరి ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు తమకున్న అధికారాలతో డ్రా తీసి, సాంబయ్యను సర్పంచ్ గా నియామక పత్రం అందజేశారు. గ్రామస్తులందరూ లక్ష్మయ్య నీవు ఎవరికి ఓటు వేసినా వారు గెలిచేవారు కదా! అంటూ ఎగతాళి చేయసాగారు. లక్ష్మయ్య మాత్రం మౌనంగా ఉండేవాడు. 
           ఒకసారి పొలంకు సంబంధించిన ఆస్తి కాగితాలలో అక్షర దోషం వచ్చింది. సర్పంచ్ సాంబయ్య దగ్గరికి వెళ్లి, ఎన్నిసార్లు విషయం చెప్తినా నువ్వు నాకు ఓటేశావా, నీకు నెమ్మదిగా చేస్తాపో అనేవాడు. ఓస్! లక్ష్మయ్య గింత చిన్న పని నేను నీకు ఎప్పుడో చేసేవాడిని కదా నాకు ఓటేస్తే అని కోటయ్య వెటకారంగా మాట్లాడేవాడు. సాంబయ్యకు ముందు చూస్తే నుయ్యీ, వెనక్కెళ్తే గొయ్యీ అన్న చందంగా మారింది. మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా! ఎప్పుడో వేకువ జామున వెళ్లి, మొదటి ఓటు వేసి వచ్చేవాడు. తన ఓటు గెలిచిందా! ఓడిందా! అని మళ్ళీ లక్ష్మయ్య ఎవరితో చర్చించేవాడు కాదు.


కామెంట్‌లు