సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-810
"అపంథానం తు గచ్ఛన్తం సోదరోపి విముంచతి" న్యాయము
****
పంథానం అంటే మార్గం లేదా దారి.అపంథానం అనగా సరికాని మార్గములో, తప్పు మార్గంలో. తు అనగా కానీ.గచ్ఛన్తం అనగా వెళ్ళడం ద్వారా.సోదరోపి అనగా  సోదరో+అపి ఒకరి స్వంత సోదరుడు.విముంచతి అనగా విడిచి పెట్టు అని అర్థము.

తప్పు త్రోవన పోవువానిని సోదరుడు కూడా వైచును అని అర్థము అనగా సరియైన మార్గములో వెళ్ళని వ్యక్తిని స్వంత సోదరుడు కూడా వదిలేస్తాడు అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు తరచూ ఉదాహరణగా చెబుతుంటారు.
 ఈ న్యాయమునకు సంబంధించిన పూర్తి శ్లోకాన్ని చూద్దామా...
"యాంతి న్యాయ ప్రవృత్యస్య -తిర్యంచోపి సహాయతం/అపంథానంం తు గచ్ఛంతం - సోదరోపి విముంచతి!" అనగా న్యాయ మార్గంలో వెళ్ళే వారికి పశువులు, పక్షులు కూడా సహాయం చేస్తాయి. సరైన మార్గంలో వెళ్ళని వాడిని  అనగా తప్పుడు మార్గంలో నడుస్తున్నట్లయితే అతని స్వంత సోదరుడు కూడా వదిలేస్తాడు అని అర్థము.
 దీనికి చక్కని ఉదాహరణగా శ్రీమద్రామాయణమునే చెప్పుకోవచ్చు.
 రామాయణంలో శ్రీరాముడు న్యాయ మార్గంలో వెళ్ళే వాడు.ధర్మాన్ని రక్షించే వాడు.సత్యవాక్పరిపాలకుడు, శాంతి,దయ, కరుణ మొదలైన మానవీయ విలువలతో సమస్త లోకాలకు ఆదర్శంగా నిలిచాడు. అందుకే రాముడికి జటాయువు, సంపాతి పక్షులు, హనుమంతుడు, సుగ్రీవుడు, సుగ్రీవుని సేన వంటి వానరాలు, జాంబవంతుడు లాంటి వారు శ్రీరామునికి సహాయం చేశాయి.
 మరి చెడు వర్తన లేదా తప్పు మార్గంలో నడిచే రావణాసురుడిని సొంత సోదరుడని కూడా చూడకుండా  విభీషణుడు రావణాసురుడిని వదిలేస్తాడు.
వాలి ఎంత గొప్ప వీరుడు అయినప్పటికీ అధర్మ వర్తన వల్ల చంపబడ్డాడు.
అందుకే పెద్దలు మరో మాట కూడా అంటుంటారు."తమ్ముడు తన వాడైనా ధర్మం తప్పు చెప్పకూడదు"అని. తరతమ భేదాలు లేకుండా శిక్ష విధించాలని.
పోతన రాసిన భాగవతంలోని వామన చరిత్రలో  భూదేవి బ్రహ్మతో  ఎవరినైనా భరిస్తాను కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేను " అంటుంది. అంటే ఇక్కడ ఆడిన మాట తప్పడం అంటే కూడా సరియైన మార్గములో నడవక పోవడమే అని అర్థము చేసుకోవచ్చు.
 ఇదండీ "అపంథానం తు గచ్ఛంతం సోదరోపి న్యాయము "ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఎలా ఉండాలో, ఉండకూడదో తెలుసుకోవలసిన విషయం. 

కామెంట్‌లు