న్యాయములు-804
"అత్యంత పరాజయా ద్వరం సంశయోపి" న్యాయము
******
అత్యంత అనగా ఎక్కువగా, అధికంగా. పరాజయం అనగా ఓటమి, వైఫల్యం, ఏదైనా పనిలో లేదా ప్రయత్నంలో విజయం సాధించలేక పోవడం. ద్వరం అనగా కన్నా . సంశయోపి అనగా ఏదో సందేహము అని అర్థము.
"పూర్తిగా పరాజయం పొందడం కంటే సంశయాస్పదమైన స్థితికి వచ్చుట కొంత వరకు శ్రేయస్కరం" అంటుంటారు మన పెద్దలు.అదెలాగో చెప్పిన ఉదాహరణ చూద్దాం.
ఓ ఇరువురు సమాన శాస్త్ర పండితులు ఓ శాస్త్ర చర్చ చేస్తున్నప్పుడు .అందులో ఒక వ్యక్తికి విషయానికి తగిన సమాధానం గుర్తుకు రాలేదు..తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అతడు ఆ సమయంలో నోరు తెరిచి ఏదో చెప్పబోవడమో కానీ, మరొక వెఱ్ఱి చేష్టకు దిగడం కానీ చేశాడంటే ఓడిపోవడం ఖాయం. మరి అలాంటప్పుడే కొంచెం సమయస్ఫూర్తిగా సంశయించుచున్న స్థితిలో ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టు అభినయిస్తూ నోరెత్తకుండా ఉన్నట్లయితే కొంతవరకైనా గౌరవము నిల్పుకునే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఓడిపోలేదనే తృప్తి ఉంటుంది." కదా! అంటుంటారు.
అంటే ఏదైనా శాస్త్ర చర్చకు దిగినప్పుడు పూర్తి పరిజ్ఞానంతో ఎదుటి వారితో తలపడాలి. ఏ మాత్రం సంశయం ఉన్నా ఓటమి పేరుతో అవమానం బారిన పడకుండా కొంత ఇంగితంతో ఈ విధంగా బయట పడవచ్చు. అది తెలిసిన ఎదుటి వ్యక్తిలో మంచి మనసు ఉంటే ఈ వ్యక్తి స్థితిని గమనించి చిరునవ్వుతో ఆపేస్తాడు.
ఏది ఏమైనా పూర్తిగా అపజయం పొందడం కంటే పోటీ పూర్తిగా ఉంటే ఈ వ్యక్తే గెలుస్తాడు కాబోలు అన్నట్లుగా ప్రవర్తించడం మంచిది."గుడ్డి కంటే మెల్లకన్ను నయం కదా! "మరణం కంటే వ్యాధి తో ఉండటం నయం కదా" అని అర్థము.
అప్పుడప్పుడూ ఇలాంటి పరిస్థితులు కేవలం శాస్త్ర విషయాల్లోనే కాకుండా సమస్యల పరిష్కారాల్లో కూడా వస్తూ ఉంటాయి. మనం చెప్పేది మంచిదైనా ఎదుటి వ్యక్తులకు రుచించనప్పుడు , వాళ్ళ మాటల దురుసుతనంతో బాధ పడటం కంటే మనంతట మనమే గౌరవంగా తప్పుకోవడం మేలు.
సుమతీ శతక కర్త కూడా కొంచెం మార్పుతో ఇదే విషయాన్ని చెబుతాడు."తనవారు లేని చోటను/జనమించుక లేని చోట జగడము చోటను/ అనుమానమైన చోటను/ మనుజునకు న్నిలువ దగదు మహిలో సుమతీ!"
అనగా తమకు సంబంధించిన వారు లేని చోట, పరిచయం ఉన్నప్పటికీ అంతగా చనువు లేని చోట, తగాదా జరుగుతున్న చోట, అనుమానంగా ఉన్న చోట ఉండకూడదని అర్థము. ఒకవేళ ఉండాల్సిన పరిస్థితిలో చిక్కుకుంటే లౌక్యంగా తప్పించుకొనే ప్రయత్నం చేయాలి.
దీనికి సంబంధించి అమర గాయకుడు ఘంటసాల గారు పాడిన ఓ సరదా జానపద గేయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం." అత్త లేని కోడలుత్తము రాలు ఓలమ్మా! కోడలు లేని అత్త గుణవంతురాలు..."కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓయమ్మా! పచ్చిపాల మీద మీగడేదమ్మా! వేడి పాల మీద వెన్న ఏదమ్మా! అని అత్త అడిగితే కోడలు ఘాటుగానే సమాధానం ఇస్తుంది.వంట ఇంటిలోన ఉట్టిమీదుంచిన సున్నుండలేమాయె కోడలా అంటే.. ఇంటికి పెద్దైన గండుపిల్లుండగా ఇంకెవరు వస్తారే అత్తమ్మా, ఇంకెవరు తింటారే అత్తమ్మా!.. కోడలి మాటలకు కొరివితో రాబోతుంటే కాలుకు తేలు కుట్టడంతో, మంచి దానిలా మారు మాట్లాడకుండా మళ్లిపోతుంది... అక్కడ కోడలు ముందు పరాజయం పొందడం కంటే ,అవమాన పడటం కంటే తప్పుకోవడం మేలు అనుకుందన్న మాట.
"అత్యంత పరాజయా ద్వరం సంశయోపి న్యాయము" ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే అవమాన పడటం కంటే అతి లౌక్యంగా తప్పించుకోవడం మంచిది. దీనిని ఎల్లప్పుడూ గమనంలో ఉంచుకోవాలి.
పరాజయం పాలు కాకుండా పరువు, గౌరవాన్ని కాపాడుకునేందుకు పై విధంగా చేయడం మంచిది. ఇదండీ "అత్యంత పరాజయా ద్వరం సంశయోపి న్యాయము" అంటే. పెద్దలు చెప్పిన ప్రతిమాట హితోక్తియే.కాబట్టి దానిని సమయానుకూలంగా ఉపయోగించుకుందాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి