న్యాయములు-813
"నిర్ధనతా సర్వాపదా మాస్పదమ్" న్యాయము
*"**
నిర్ధనతా అనగా ధనము లేదా సొమ్ము లేకుండుట. సర్వాపదా అనగా అన్ని ఆపదలకు .ఆస్పదమ్ అనగా నెలవు,పని, గొప్ప పదవి అనే అర్థాలు ఉన్నాయి.
"దారిద్ర్యము ఆపదలకన్నింటికీ వాసము కదా! అని అర్థము
దారిద్ర్యము ఆపదలకే కాదు.అన్ని బాధలకు, కూడా మూలం. దానిని తొలగించకపోతే సమాజంలో అనేక అనర్థాలు కలుగుతాయి.
అయితే ఒక్కో మతం ఒక్కో విధంగా పేదరికం గురించి చెప్పింది. హిందూ మతము మరియు ఆధ్యాత్మిక శాస్త్రం సంపద కోసం అన్వేషణ ఆమోదించింది.ధర్మంగా అర్థాన్ని సంపాదించాలని చెప్పింది.మహాభారతం పేదరికం గురించి "పేదరికం అనేది మహా పాపపు స్థితి". అద్భుత సంపద కలిగివుండటం నుంచి అన్ని పుణ్య కార్యాలు ప్రవహిస్తాయి " అని చెప్పింది.
బాధలకు మూలం పేదరికం కాదు అసంతృప్తి, కోరికలు మరియు అనుబంధం అని బౌద్ధ మతం బోధిస్తుంది. కోరికలు నెరవేరకపోతే బాధ వస్తుంది.కాబట్టి అలాంటి కోరికలు లేకుండా జీవించాలని బౌద్ధమతం చెబుతుంది.
తీవ్రమైన పేదరికం ఎన్నో ఆపదలను తీసుకుని వస్తుంది.పేదరికం చూడటానికి భౌతికమైనదే అనిపిస్తుంది కానీ అది మానసికమైన ప్రభావాన్ని చూపుతుంది.అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.జీవితాన్ని గడపడానికి ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకునేందుకు ఇబ్బంది పడవలసి వస్తుంది. దీనిని మనం ప్రత్యక్షంగా సమాజంలో చూస్తూ ఉంటాం.
బౌద్ధ మతంలో దీనికి సంబంధించిన కథ ఉంది.అది చూద్దాం.
ఒక రాజు తన దగ్గర ఎంతో సొమ్ము మూలుగుతూ ఉన్నప్పటికీ పేదలకు ఎలాంటి సహాయం చేయడు.ఫలితంగా ఆ రాజు రాజ్యంలో దొంగతనాలు ఎక్కువైతాయి. ఒక వ్యక్తి పట్టుబడ్డాడు.
ఏవైతే తనకు లేదో వాటిని ఇతరుల నుండి పొందడానికి ప్రయత్నం చేస్తాం.అలాగే ఆ వ్యక్తి కూడా తనకు జీవించడానికి ఏమి లేదని అందువల్ల ఆ పని చేశానని చెబుతాడు.అప్పుడు రాజు అతనికి కొంత ఆస్తిని ఇచ్చి వ్యాపారం చేసుకుంటూ తనకు తన కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుందని చెబుతాడు.
ఇలా రాజు ఇస్తూ పోతుంటే దొంగతనం పెరగడం గమనించాడు. అందుకని దొంగతనం చేసిన వారికి కఠిన శిక్ష వేయాలని అలాంటి వ్యక్తిని చంపి తల నరికి వేయాలని చెబుతాడు. అది విన్న కొందరు మన కోసం పదునైన కత్తులు చేసుకుని వాటితో కావాల్సినవి ఇవ్వని వారిపై దాడి చేద్దాం.వారి తలలు నరికేద్దాం అని గ్రామాలు పట్టణాలు నగరాల్లో హత్యాయత్నాలు ప్రారంభించారు.అందువల్ల సమాజ వ్యవస్థ అసమానతతో, అరాచకంతో బాధ పడవలసి వచ్చింది. కాబట్టి పేదరికాన్ని అంతం చేయాలంటే అభివృద్ధి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు కల్పించాలి.అప్పుడే సమాజంలో కొంత వరకు అసమానత తగ్గిపోతుంది.
"దారిద్ర్యము లేదా పేదరికము మానవులకు శాపము "అది మానవ జీవన ప్రమాణాలను దిగజారుస్తుంది.సమాజం అభివృద్ధి చెందకుండా ఆటంకం అవుతుంది.
అయితే కొంతమంది పెద్దలు పేదరికం మనిషికి కొత్త పాఠాలు నేర్పుతుందనితెష్ల చెబుతుంటారు. పేదరికం వల్ల డబ్బు విలువ తెలుస్తుంది.ఎవరు తన వాళ్ళో అర్థం అవుతుంది.
ఏది ఏమైనా పేదరికం పెను భూతం ,శాపం అని చెప్పుకోవచ్చు. అదే అన్ని అనర్థాలకూ మూలము. మానసిక పేదరికం, భౌతిక పేదరికం, సామాజిక పేదరికం అనే పేదరికాలు ఉంటాయి.
కాబట్టి ప్రజలను పాలించే ప్రభుత్వాలు వ్యక్తుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వారికి సరైన జీవనోపాధి కల్పించాలి. స్వయం ఉపాధికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే "నిర్ధనతా సర్వాపదా మాస్పదమ్" న్యాయము గురించి ముచ్చటించుకుని బాధ పడాల్సిన అవసరం ఉండదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి