భలే స్నేహితులు: సరికొండ శ్రీనివాసరాజు

 రోజూలాగే స్నేహితులు క్రికెట్ ఆడటానికి వచ్చారు. తనివి తీరా ఆడుకున్నారు. ఆ తరువాత వారి నాయకుడు సుదర్శన్ అందరితో సమావేశం ఏర్పాటు చేశాడు. కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత మిత్రులు తమ ఇళ్ళకి వెళ్ళినారు.
      ఉగాది పండుగ వచ్చింది. అందరూ సంతోషంగా వేడుక చేసుకున్నారు. ఆ తర్వాత చాలామంది క్రికెట్ ఆడటానికి రావడం లేదు. పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ముగిశాక కొంతమంది యథావిధిగా క్రికెట్ ఆడటానికి వస్తున్నారు. కొంతమంది జాడ లేదు. ఎండాకాలం సెలవుల్లో ఊళ్ళకు వెళ్ళారులే అనుకున్నారు. సెలవులు అయిపొయాయి. స్కూళ్ళు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత కూడా నలుగురు ఐదుగురు రావడం లేదు. 
      సుదర్శన్ తన పుట్టిన రోజు నాడు అందరు పాత మిత్రులను పిలిచినాడు. వేడుకలు ముగిసాక తన పూర్వ క్రికెట్ జట్టుతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ నలుగురు ఐదుగురు క్రికెట్ ఆడటానికి కారణం అడిగాడు. ఆ రోజున ఉగాదికి ముందు మీటింగ్ పెట్టి, నువ్వు ఏమి మాట్లాడావో గుర్తు చేసుకో అన్నాడు వాసు. గుర్తు చేసుకున్నాడు సుదర్శన్. "ఉగాది పండుగ రాబోతుంది. అది మనకు అసలైన కొత్త సంవత్సరం. ఆ రోజున మనం చెడు అలవాటుకు స్వస్తి చెప్పి, కొత్త నిర్ణయం తీసుకోవాలి."  ఇవి సుదర్శన్ అన్న మాటలు. "నేను క్రికెట్టుకు పూర్తిగా స్వస్తి చెప్పి, సమయం వృధా చేయకుండా చదువుకోవాలి అనుకున్నా." అన్నాడు వాసు. "మా ఇంట్లో నా చెల్లెలితో ఆటలు ఆడేవారు ఎవరూ లేరు. ఉగాది పండుగ తర్వాత ఇంట్లోనే ఉండి నా చెల్లెలితోనే రకరకాల ఆటలు ఆడుకోవాలి. అని నిర్ణయం తీసుకున్నా." అన్నాడు రాము. 'నేను ఈ టైం వేస్ట్ ఆటలకు గుడ్ బై చెప్పి, తీరిక సమయాలలో కథల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నా. ముందు ముందు కథా రచయిత కావాలని ఉంది." అన్నాడు తిరుమలేశు. 
      సుదర్శన్ ఆలోచనలో పడ్డాడు. తాను ఏదో మాట వరుసకు తన తాతయ్య చెప్పేన మాటలు చెపితే దీన్ని వీళ్ళు ఇంత బాగా గ్రహించి ఇలా నిర్ణయాలు తీసుకున్నారా? ఛీ! ఒట్టి మాటలు చెప్పడం వేస్ట్. దాన్ని ఆచరణలో పెట్టడం బెస్ట్. అనుకున్నాడు సుదర్శన్. వారిని అభినందించాడు. 

కామెంట్‌లు