న్యాయములు -817
జలాంజలి న్యాయము
****
జలము అనగా నీరు, ఉదకము,సలిలము అని అర్థము .అంజలి అనగా దోసిలి,దోయిలి,కైమోడ్పు, నమస్కారము, పైకి తెరిచి యున్న రెండు చేతులను దగ్గరకు చేర్చి మడిచి యుంచగా ఏర్పడిన ఖాళీ స్థలాన్ని అంజలి అంటారు.
ఇక ఏదైనా వస్తువు పేరు గానీ పదార్థం పేరుగాని ముందు చేర్చి, దాని తర్వాత అంజలి అనే పదాన్ని జోడిస్తే అర్థము ఆ వస్తువు లేదా పదార్థమనేది ఆ ఖాళీ స్థలంలో ఉన్నదని,అది నిండిన దోసిలి అని అర్థము.
పుష్పాంజలి అంటే పువ్వులతో నిండి యున్న దోసిలితో నమస్కరించుట లేదా అభివాదం చేయుట.
అలాగే శ్రద్ధతో అంజలి ఘటించుటను శ్రద్ధాంజలి అంటారు.ఇది ఎక్కువగా మరిణించిన వారికి సమర్పించే అంజలి.ఈ పదాన్ని మనం తరచూ వింటుంటాం, వార్తా పత్రికలలో చూస్తుంటాం ఫలానా వారికి శ్రద్ధాంజలి ఘటించారు అని .
అసలు అంజలి అంటే.. దైవము ఎదుట,పెద్దల ముందు లేదా అధికారుల వద్ద గౌరవ సూచకంగా అభివాదం చేయడం.ఇలా అంజలి ఘటించడం లేదా అంజలి పట్టి నిల్చోవడం మన నిత్య జీవితంలో చూస్తుంటాం చెస్తుంటాం.అంటే వారికి వినయంగా తలవంచడం,నమస్కరించడం అన్నమాట.
మరి జలాంజలి అంటే ఏమిటో?ఎందుకు చేస్తారో , దాని గొప్పతనం ఏమిటో తెలుసుకుందాం.
జలాంజలి అంటే దోసిలిలో నీళ్ళు తీసుకొని నమస్కారం చేయడం.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో పంచభూతాలను దైవాలుగా భావించి తప్పని సరి విధిగా కొలవడం అనేది అనాదిగా చూస్తూనే ఉన్నాం.
అయితే జలానికి అధిపతి చంద్రుడు అంటారు.చేసే ప్రతి పూజా కార్యక్రమాలలో కలశపూజ చేయడం ఆనవాయితీ.అంటే జలానికి చేసే పూజ అన్నమాట.అలాంటి జలం మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే.అయితే జలాన్ని మనసుతో కూడా పోల్చడం జరిగింది.జాగ్రత్తగా పట్టుకుంటేనే జారిపోకుండా వుంటుంది.ఏ మాత్రం అజాగ్రత్త వహించినా జారిపోతుంది.కాబట్టి మనసు అనే జలాన్ని భక్తి అనే పాత్రలో బంధించాలి అంటారు భగవద్భక్తులు.
మన భారతీయ సంస్కృతిలో శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా సూర్యుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సమస్త ప్రాణులకు ప్రాణాధారం జలమైతే,ఆ సృష్టికి జీవనాధారం సూర్య భగవానుడు.ప్రజలందరికీ కనిపించే ప్రత్యక్ష దైవం భాస్కరుడు.అలాంటి సూర్యుని ఆరాధన వేదకాలం నాటి నుండి నేటి వరకూ నిరంతరం కొనసాగుతూనే ఉంది.ఈ ఆరాధనలో భాగంగా సూర్యునికి నీటిని లేదా జలాన్ని సమర్పించడం పురాతన హిందూ ఆచారంగా కొనసాగుతోంది.
వేద శాస్త్రాల విశ్వాసం ప్రకారం సూర్యుడు మొత్తంగా మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాడని తెల్లవారుజామున సూర్య కిరణాలు మానవులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నమ్మకమే కాదు వాస్తవం కూడా.అందుకే ప్రతి నిత్యం ఐదు నిమిషాలు ధ్యానం చేస్తూ ఉషోదయ కిరణాలు దేహానికి తాకేలా చూసుకుంటే ఆ రంగుల కిరణాల నుండి వెలువడే సానుకూల శక్తి మన దేహంలోకి చేరుతుంది. కంటి చూపు కూడా తేజోవంతంగా మారుతుంది.
అలాంటి సూర్యుని పూజిస్తే మనలో జ్ఞాన సంపద పెరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. సూర్య కిరణాలలో డి విటమిన్ ఉంటుందని చెబుతూ ప్రతి ఉదయం లేలేత కిరణాలు ఒంటికి తగిలేలా చూసుకోవాలని వైద్యులు కూడా సూచించడం మనందరికీ తెలిసిందే.అలా సూర్య కిరణాలు మనపై ప్రసరించడం ద్వారా ఆరోగ్యం ఎంతో బాగుంటుంది.అందుకే సూర్యుణ్ణి ఆరోగ్య ప్రదాత అని కూడా పిలుస్తారు. అలా పొద్దు పొద్దున్నే సూర్య భగవానుని కృపను పొందడానికి మన పెద్దవాళ్ళు జలాన్ని సమర్పిస్తుంటారు.ఇలా జలాన్ని సమర్పించడాన్ని అర్ఘ్యం సమర్పించడం అంటారు.
గతంలో చెరువులు, కాలువలు నదుల్లో ప్రతి రోజూ ఉదయం స్నానాదులు ముగించుకుని ఆ తర్వాత అర్ఘ్యం/ సమర్పించే వారు. జలాంజలి ఘటించి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని భక్తితో పొందేవారు.
మరి ఈ రోజుల్లో ఆ నీళ్ళు పరిశుభ్రంగా ఉన్నాయా? లేవు కదా!ఈ హడావుడి జీవితంలో సూర్య నమస్కారాలు, జలాంజలి సాధ్యమేనా? మరెలా? ప్రత్యామ్నాయం ఏముందో చూద్దామా.
మన ఇంటి ముంగిలే ఆలయంగా భావించి, సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఉతికిన దుస్తులు ధరించాలి.రాగి పాత్రలో నీరు నింపి దానికి కొంచెం తేనె లేదా పంచదార కలపాలి.ఉదయించే వైపు అనగా తూర్పు దిక్కున స్పష్టంగా కనిపించే చోట నిలబడి రాగి పాత్రతో అర్ఘ్యం ఇచ్చేటప్పుడు "ఓం సూర్యానమః" అనే మంత్రాన్ని జపిస్తూ నీరు నేలపై పడకుండా పూల మొక్కలపైననో, ఓ శుభ్రమైన పాత్రలోనో పడే విధంగా చూసుకోవాలి.అలా నీటిని కింద పడకుండా తొక్క కుండా స్వచ్ఛమైన మనసుతో శుచి శుభ్రతతో సూర్య భగవానునికి జలాంజలి ఘటించాలి. ఇందు వలన మనకు ఆరోగ్యం, ఆనందంతో పాటు ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుందని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు.
అంతే కాదు పొద్దు పొద్దున్నే లేచి ముందుగా 12 రకాల భంగిమలతో సూర్యభగవానుడి యొక్క పన్నెండు పేర్లను పఠిస్తూ సూర్యనమస్కారాలు చేయాలని , అలా చేసిన తర్వాత ఉషోదయం కాగానే సూర్య భగవానునికి జలాంజలి ఘటిస్తే శరీరానికి తగినంత వ్యాయామం లభిస్తుంది.మంచి ఆరోగ్యం సొంతమవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఇలా కళ్ళ ముందు కనిపించే ప్రత్యక్ష దైవానికి నిత్యం చేసే సూర్య నమస్కారాలతో పాటు భక్తి శ్రద్ధలతో జలాంజలి సమర్పిద్దాం. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అంతులేని మానసిక ప్రశాంతతను పొందుదాం.అంతే కాదండీ! మనకు ప్రాణాధారమైన జలాన్ని వృధా చేయకుండా పొదుపుగా వాడుకుందాం.
జలాంజలి లాంటి మన సంస్కృతి, సంప్రదాయాలలో ఇమిడి వున్న ఆరోగ్య సూత్రాలను అందరికీ తెలిసేలా చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడికి ఉందనేది మర్చిపోవద్దు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి