సునంద భాషితం:-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-821
"ఇతో వ్యాఘ్ర ఇత స్తటీ" న్యాయము
******
ఇతో  అనగా ఇటు.వ్యాఘ్ర అనగా పెద్ద పులి.ఇత అనగా అటు.స్తటీ అనగా నది.
ఇటు పెద్దపులి అటు నది అని అర్థము. అనగా "ముందు నుయ్యి వెనుక గొయ్యి" అన్నట్లు. 
ఈ న్యాయము వ్యక్తి యొక్క సందిగ్ధావస్థ గురించి చెబుతుంది. ముందు వెనుక పరిస్థితులు అనుకూలంగా లేనపుడు  ఒక వ్యక్తి పడే బాధను తీసుకోలేని నిర్ణయాన్ని ఈ న్యాయముతో పోలుస్తారు .వ్యక్తికి ఉన్న సంకట స్థితిని సూచిస్తుంది.
ఏదైనా మార్గం మంచిది అనుకుని ఇక ఆ మార్గంలో వెళ్దామని పూర్తిగా ప్రయాణమైన వ్యక్తిని భయపెడుతూ ముందు నిలిచిన పెద్ద పులి. అమ్మో అని భయపడి తప్పించుకుందామని అనకుంటే వెనుక నది. ఎటూ తేల్చుకోలేని సాహసించలేని పరిస్థితి.
 ఇది కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు. జీవితంలో ఎదురయ్యే సంకట స్థితిని సూచిస్తుంది.కనిపించే రెండు మార్గాలు చూసేందుకు మంచిగా అనిపించినా  దాని పూర్వాపరాలు ఆలోచిస్తే అనుకూలంగా లేవని అర్థం అవుతుంది. 
అలాగే ఒక పనిని చేద్దామని మొదలు పెట్టినపుడు కనిపించే మార్గాలు, తీరా మొదలు పెట్టిన తరువాత కలిగే ముప్పును ఇది సూచిస్తుంది.
 కుటుంబ బంధాలలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి.ఎవరిని కాదనలేము. వద్దని వదిలేయలేము.
 కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట ఖాతరు చేయకుండా తమకు నచ్చిన పని చేయడానికి వచ్చినప్పుడు తల్లిదండ్రుల పడే బాధ ఇలాంటిదే. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చిన్న విషయానికే అతిగా స్పందిస్తూ  తల్లిదండ్రులు చెప్పే మంచి చెడులను విచక్షణా దృష్టితో చూడకుండా.. ఆత్మహత్యలకు పాల్పడిన  ఉదంతాలు ఉన్నాయి.అందువల్ల ఏమీ అనలేని పరిస్ధితి. ఆమధ్య కాలంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఇలాంటిదే. పరువు - చెప్పిన మాట వినలేదనే ఉక్రోషంతో జరిగిన హత్య వల్ల ఎలాంటి అనర్థం జరిగిందో మనకు తెలుసు. వారంతా కొంచెం సంయమనం పాటిస్తే ఇంత అన్యాయం జరిగేది కాదు.
 రెండు రకాలుగానే కాదు ఇంకొంచెం లోతుగా వెళితే ప్రత్యామ్నాయ మూడో మార్గం కూడా ఉంటుంది .అదే మనం సృష్టించుకునేది. దానికోసం  ఆలోచించాలి. అప్పుడే  చేసే ఆలోచనల్లో స్పష్టత వస్తుంది . పెద్ద ప్రమాదాల బారిన పడకుండా కొంచెంతో తప్పించుకోవచ్చు. సమస్యను అధిగమించవచ్చు.
ఇక్కడ పెద్ద పులి నోటికి చిక్కితే మరణం తప్పదు. కానీ నది ఒడ్డుకు వెళ్ళి ప్రాణాపాయం కాకుండా ఉండేందుకు కొంత ప్రయత్నం చేయవచ్చు. అది ఆయా వ్యక్తుల మానసిక స్థితిని బట్టి ఉంటుంది.
 ఏది ఏమైనా  ఇదొక సంకట స్థితి.ఎటూ తేల్చుకోలేని, సాహసించలేని స్థితి అయినా ఏదో ఒకటి చేయాలి తప్పదు. కాబట్టి పైన చెప్పిన విధంగా ఏదో ఒకటి చేయాలి. సమస్యలకు వెరువకుండా, భయపడి పారిపోకుండా ఉన్న చోటనే ఉండి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకోవాలని  చెప్పేందుకు మన పెద్దలు ఈ న్యాయాన్ని ఉదాహరణగా చెబుతుంటారు.
 మానసిక స్థైర్యం ఎంత ఉందో పెట్టే పరీక్ష అన్నమాట.అలాంటి సందిగ్ధంలో చేసే పని,తీసుకునే నిర్ణయం ఇతరులకు స్ఫూర్తిగా, ప్రేరణగా వుండేలా తీసుకుందాం. మీరు నాతో ఏకీభవిస్తారు కదూ!.

కామెంట్‌లు