ఒత్తిళ్ళు లేని చదువులు:- సి.హెచ్.ప్రతాప్

 రేపటి భవిష్య భారత దేశానికి మూల స్థంబాలయిన విద్యార్థులు విద్యాసంస్థలు  పెట్టే ఒత్తిళ్లకు బలవుతున్నారు. వారానికి ఏడు రోజుల పాటు రొజుకు పన్నెండు- పధ్నాలుగు గంటల పాటు చదువుల పేర విద్యార్థులు కార్పొరేట్‌ విద్యాసంస్థలలో బందీలుగా జీవితం గడుపుతూ అతి విలువైన తమ బాల్యాన్ని ర్యాంకుల వేతలో పడి పోగొట్టుకుంటున్నారు.. ఈ ఒత్తిడిని తట్టుకోలేక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. లక్షల్లో ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు మార్కులు, ర్యాంకుల మాయలో పడి, దాని వలన జరిగే నష్టాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైమరీ పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, యు.పి, ఉన్నత పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలి. వీటిలో కూడా వారానికి మూడు రోజులు గంటపాటు వ్యాయామం, క్రీడలకు కేటాయించాలి. ఇక కళాశాలల విషయానికొస్తే ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించాలి. మన రాష్ట్రంలో 90 శాతం విద్యా సంస్థలు నిబంధనలు పాటించిన దాఖలాలు లేవు. ఈ ఒత్తిళ్ళకు తట్టుకోలేక  అనేక మంది విద్యార్థులు ర్యాంకుల వేటలో వచ్చే ఒట్టిళ్ళను తట్టుకోలేక  ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది విద్యార్థులు ఒత్తిడిని లోలోపల దాచుకుంటూ ఆరోగ్య సమస్యలను కొనితెచ్చు కుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిబంధనలకు అనుగుణంగా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లలకు విద్యావిధాన కొత్తపోకడలు.. సిలబస్‌లు.. పరీక్షలు.. ఇవన్నీ భరించలేని ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఆ ఒత్తిడిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కొట్టడం, తిట్టడం లాంటి తొందరపాటు చర్యలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. దాంతో వారు మానసికంగా కుంగిపోతారు. అవమానంగా భావించి, ఆత్మహత్యలకు పాల్పడతారు. పక్కింటి, బంధువుల పిల్లలతో పోల్చి.. 'వారిలా ఎందుకు చదవవు? నీకేం తక్కువ..?' లాంటి పదేపదే ఒత్తిడి కలిగించే మాటలు ఆ పసిమనసులకు ఈటెల్లా తగులుతాయి. ఈ బంధనాల నుంచి బయటపడటానికి ఆ పసిమనసులు ఎన్నుకుంటున్న మార్గం ఆత్మహత్య. ఇంతకంటే హృదయవిదారకమైన విషయం మరోటిలేదు.  ఒత్తిడి లేని పిల్లలు మంచి విలువలను కలిగి ఉన్నారు. వారు శారీరక, మానసిక ఆరోగ్యం విషయంలో కూడా ధృఢత్వాన్ని కలిగి వుంటారని పలు అధ్యయనాలు తెలుపితున్నాయి. స్కూల్‌లో మంచి మార్కులు సాధించడం ఒక్కటే సరిపోదని, ఓవరాల్‌ డెవలప్‌మెంట్‌పై తల్లిదండ్రులు దృష్టి పెట్టడం చాలా అవసరమని అందరం తెలుసుకోవడం మంచిది.
పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థుల్లో తెలియని ఒక ఆందోళన మొదలవుతుంటుంది. సంవత్సరమంతా  ఎంత బాగా చదువుకున్నా, మొదటి నుండి సరిగ్గా ప్రిపేర్ అయినప్పటికీ కూడా పరీక్షలు ఒత్తిడిని కలిగిస్తాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వైపు నుంచి కూడా విద్యార్థులపై ఉండే అంచనాలు వారి ఒత్తిడి స్థాయిలను మరింత పెంచుతాయి. ఈ ఒత్తిడిలో నేర్చుకున్నదంతా మర్చిపోతారు, ఇది విద్యార్థులను నిరాశ, నిస్పృహలకు గురిచేస్తుంది. పరీక్షల వేళ ఇలాంటి ఒత్తిడి, ఆందోళనలు ఉండటం సర్వసాధారణం. అయితే పరీక్షల ఒత్తిడి నుంచి బయటపడేందుకు మార్గాలు ఉన్నాయి. వాటిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్ధులకు నేర్పించాలి. భయం వల్ల అలజడి కలిగి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. సానుకూల దృక్పథమే ఆయుధం. క్లాసులో పాఠాలు చెప్పడంతోపాటు పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంతో బట్టీ విధానం వద్దు. ఒత్తిడి లేకుండా చదవాలి.మన పిల్లల కెపాసిటీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. వారి ఛేదించగలిగే లక్ష్యాలను మాత్రమే వారికి ఇవ్వాలి. విద్యార్థులందరూ టాపర్‌లు లేదా మొదటి ర్యాంకర్‌లు కాలేరు. భారీ అంచనాలు పెట్టుకొని అసంతృప్తి చెందడం కంటే వారి స్థాయికి తగ్గ గమ్యాన్ని ఎంచుకుంటే మంచిది.  
కామెంట్‌లు