స్వాగతం:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కొమ్మల్లో కోయిలమ్మ కొత్తరాగం వినిపిస్తోంది
మల్లె పొదలు మాంచి పరిమళాలను ప్రసరింపచేస్తున్నాయి
తుమ్మెదలు మకరందాన్ని గ్రోలి మత్తుగా సోలిపోతున్నాయి 
పిల్లగాలి మెల్లగా చల్లగా వీస్తోంది
వేపలు  మామిళ్ళు వేగంగా పూసి కాస్తున్నాయి
నాకు ఇప్పుడు తెలిసింది 
చెట్టు చేమలన్నీ చిగురు సొగసులతో 
పూల గంధాలతో కొత్త అందాలు కనువిందు చేయడంలోని రహస్యం!
నవనవోన్మేష సౌందర్య దీప్తితో వెలిగిపోతున్న 
ప్రకృతి సామ్రాజ్యంలోని అందాలకు ప్రతి గుండె పులకిస్తున్నది
రంగుపూల ఇంద్ర ధనుస్సును కొప్పున ముడిచి 
చైత్రలక్ష్మి రాయంచలా నడిచి వస్తోంది 
మాకు షడ్రుచుల వంటకాలతో బాటు 
ఆనందాలను కూడా వెంట తెస్తోంది
గుండె గాయాలను మాన్పుకుని 
ప్రేమానురాగాలను కొంగున ముడేసుకుని 
శుభకార్యాల పల్లకీ మోసుకుని
మా బతుకు భవంతిలో వెలుగు నింపే దివిటీ అయి 
వస్తున్న ఓ శ్రీవిశ్వావసు వత్సరమా!
మా బతుకుల్లో ఆనందాలు నింపమ్మా!!! 
**************

కామెంట్‌లు