న్యాయాలు-808
"అనిర్వేద ప్రాప్యాణి శ్రేయాంసి" న్యాయము
****
అనిర్వేదము అనగా విరక్తి లేకుండుట, దుఃఖము లేకుండుట,నిరాశ లేకుండుట, నిరాశ నొందకుండుట, ఆత్మ విశ్వాసము. ప్రాప్యాణి అనగా లేకుండా పొందండి. శ్రేయాంసి అనగా శుభం, మేలు, మంచి అనే అర్థాలు ఉన్నాయి.
నిర్వేదమును వదిలివేసి శ్రేయస్సును పొందవలెను అని అర్థము. మనలోని నిరాశ , దుఃఖం లాంటివి వదిలేసి ఆత్మ విశ్వాసముతో ముందుకు సాగితే ఎన్నో శుభాలు కలుగుతాయి అనే అర్థంతో ఈ న్యాయము చెప్పబడింది.
మరి ఈ న్యాయానికి సంబంధించిన వివరాలను, విశేషాలను తెలుసుకుందామా...
దీనికి సంబంధించిన సుభాషిత శ్లోకాన్ని మనం వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణంలో కనబడుతుంది.
"అనిర్వేదో సతతం సర్వార్ధేషు ప్రవర్తకః!/కరోతి సఫలం జన్తోః యత్తత్కరోతి కరోతి సః!!/"
ఎల్లప్పుడూ అనిర్వేదమును కలిగి ఉండాలి అంటే నిరాశ నిస్పృహలు లేకుండా దుఃఖము లాంటివి వదిలేసి అన్ని సందర్భాల్లోనూ ఉత్సాహంగా ఉండాలి. అలా ఉంటేనే అన్ని కార్యాలను విజయవంతంగా చేయగలము.అంటే అనిర్వేదమే మానవులు తలపెట్టిన ఏ పనినైనా సఫలమగునట్లు చేస్తుంది అని అర్థము అని ఆ శ్లోకము యొక్క భావము.
"సీతమ్మ జాడ కోసం వెళ్లిన హనుమంతుడు సీత ఎక్కడ కనబడక పోయేసరికి ఒకలాంటి నిర్వేదానికి లోనవుతాడు. ఒకానొక దశలో చచ్చిపోవాలని కూడా అనుకుంటాడు.అలా కొద్ది సేపటి తరువాత తేరుకొని కర్తవ్యం దిశగా ఆలోచన చేస్తాడు.అనుకున్నది సాధిస్తాడు".
మరి అన్ని రోజులు మన రోజులు అవుతాయా? అనుకున్నప్పుడు సమాధానం కావు అనే వస్తుంది
ఎందుకంటే మన పెద్దలు "కళ్ళు తడవకుండా జీవితాన్ని -కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేం " అంటుంటారు.
కారణం"ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు"చిన్నవో,పెద్దవో సమస్యలు ప్రతి వ్యక్తికీ వస్తుంటాయి. మరి అవి వచ్చాయని బెంబేలెత్తి పోతూ నిర్వేదము పెంచుకుంటే కలిగేది ఆత్మ తృప్తి కాదు ఆవేదనే. కాబట్టి ఆ ఆవేదనను తొలగించుకొని మనసులోని భారమంతా భగవంతునికి నివేదన చేస్తే అంతా తానే, చూసుకుంటాడని ఆథ్యాత్మిక వేత్తలు, భక్తులు అంటుంటారు.
ఎవరు చెప్పినా మంచి మాటే కాబట్టి వినాలి.మనసులోని నిరాశా నిస్పృహలను ఎప్పటికప్పుడు వదిలేసుకుని ,ఎవరికి వారే వెన్ను తట్టుకుని "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం "కంటే ఉత్సాహమే ఊపిరిగా, ఆత్మ విశ్వాసమే ఆయుధంగా ముందుకు సాగిపోతే అనుకున్నది సాధించగలరు. విజయాల్ని సొంతం చేసుకోగలరు. కాబట్టి.
"మనం "అనిర్వేద ప్రాప్యాణి శ్రేయాంసి న్యాయాన్ని" ఎల్లప్పుడూ గమనంలో ఉంచుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల జీవితాంతం తప్పకుండా శుభాలే జరుగుతాయి.అలా కలగాలని కోరుకుందాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి