కొండల కావల దూరాన
నిండుగ కాంతులు చిందిస్తూ
గుండెలు నింపే కమ్మని కబురుతో
పండుగ తెచ్చే ప్రియ మిత్రమా...
వేగమే వచ్చి వేకువ నిమ్మని
జగానికంతా వెలుగులు తెమ్మని
గగనాల దారుల సాగే
యుగాల వేలుపు నీవే లెమ్మని.....
నింగిని మబ్బుల రంగులు
నేలను పువ్వుల నవ్వులు
నీటిని అలల సవ్వడులు
గాలి మోసే గంధాలు ... నీకే లెమ్మని..
కొమ్మల కూసే కోయిలలు
రెమ్మల దాగిన గువ్వలు
రెక్కలు చాపి ఎగిరే పక్షులు
ఒక్కటై పిలిచే పిలుపు నీ కోసమేనని
పూల గుత్తులతో తీగ తల్లులు
చేప పిల్లలను మోస్తూ అలలు
ఊగే కొమ్మల ఆకుల గలగలలు
అన్నీ నీకై పలికే ఆహ్వానాలే.... అంటూ..
దోసిలి నిండా నీరు నింపి
కనుదోయిని దారిని పరచి
మదినిండా ఆరాధనతో
మమేకమైన ప్రకృతితో మనసు పాడే
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి