సుప్రభాత కవిత : - బృంద
వేకువకై ఎదురుచూసి 
వేచి విరిసిన మనసును 
చూచి కమ్మగా నవ్వినట్టు....

తూర్పు వైపు చూపు నిలిపి 
ఓర్పుగా నిరీక్షించు మదికి 
మార్పేదో కనిపించినట్టు....

అంకురించిన వెలుగురేఖలు 
చిలకరించిన  జిలుగురవ్వలు 
మెరుపులేవో కుమ్మరించినట్టు...

సుకుమారమైన కుసుమరేకులు 
విప్పారి చూచు వేళ 
కిరణమొచ్చి తాకి కుశలమడిగినట్టు..

కోమలమైన సుమమే అయినా 
కోరుకున్న వరమేదో దొరికి 
కొండంత బలం చేకూరినట్టు...

బ్రతుకుదారిని ఒంటరయినా 
వదలిపోని ధైర్యమేదో 
చెదరని తోడుగా దొరికినట్టు...

చిన్ని పువ్వు  చెబుతున్నది 
చిన్నదైన జీవితాన
మిన్నగా బ్రతికే తీరు!

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు