న్యాయాలు-805
నరసింహ న్యాయము
****
నర అంటే నరుడు లేదా జీవుడు లేదా మనిషి. సింహ అంటే సింహము, హింసించేది, నాశనం చేసేది అని అర్థము.
నర సింహా లేదా నారసింహ అంటే నరుడూ,సింహం కలిపి కనిపించే రూపం లేదా అవతారమని సామాన్య అర్థము.ఈ నరసింహావతారాన్ని శ్రీ నారసింహుడు, నృసింహావతారము, నరహరి, నరసింహ మూర్తి, నరసింహుడు అనే పేర్లతో పిలుస్తారు.
మరి నరసింహ అవతారము ఎవరు? ఎందుకు దాల్చారు? నరసింహ న్యాయము లోని అంతరార్థం ఏమిటో చూద్దాం.
సాధు రక్షణ కోసం, దుష్ట శిక్షణ చేయడం కోసం త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు యుగ యుగాన ఎన్నో అవతారాలలో అవతరిస్తూ వుంటాడని ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకమైన కారణము, ప్రత్యేకత ఉంటుంది.అలాంటి అవతారాలలో ముఖ్యమైనవి 21 అవతారాలు. వాటిని ఏక వింశతి అవతారములు అంటారు.అందులో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. అందులో నాల్గవ అవతారమే నారసింహావతారము.
ఆధ్యాత్మిక వాదులు నరసింహ అవతారమును త్రిమూర్త్యాత్మకమని అంటారు.పాదాల నుంచి నాభి వరకు బ్రహ్మ రూపము.నాభి నుండి కంఠం వరకు విష్ణు రూపము.కంఠం నుండి శిరస్సు వరకు రుద్ర స్వరూపంగా నృసింహ స్వామిని వర్ణించారు. మామూలుగా చూసినట్లయితే రెండు రూపాల్లో కనిపిస్తాడు.పాదాల నుండి కంఠం వరకు నరత్వం.కంఠం పై భాగం సింహత్వం నిండి ఉంటుంది. నర అంటే నరుడు లేదా జీవుడు సింహ అంటే హింసించేది నాశనం చేసేది అనే అర్థాలు ఉన్నాయి కదా.ఆ ప్రకారం అజ్ఞానం, అహంకారం మొదలైన లక్షణాలను నిర్మూలించే వాడే నారసింహుడు అని చెబుతారు.
శ్రీమహావిష్ణువు నరసింహునిగా అవతారం దాల్చి ఏం చేశాడో క్లుప్తంగా పూర్వాపరాలు తెలుసుకుందాం.
భక్తుని మాటను నిజం చేయడానికి, తన సేవకుడిని శాప విముక్తి గావించడానికి నరసింహ అవతారములో అవతరించాడు.
భక్తుని మాట, సేవకుని శాప విమోచనం రెండూ ఒకదానికొకటి సంబంధం ఉన్నాయి.అదెలాగో తెలియాలంటే సేవకుడి గురించి ముందుగ తెలుసుకోవాలి.
జయ విజయులు అనే వారు వైకుంఠంలో శ్రీమహా విష్ణువు యొక్క ద్వారపాలకులు. ఒకసారి సనక:సనందనాది మునులు శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వచ్చినప్పుడు సరైన సమయం కాదని అడ్డగిస్తారు. మునులైన మమ్మల్నే అడ్డగిస్తారా? ఈ విష్ణు లోకానికే దూరమై బతుకుదురు గాకా అని శపించడంతో విష్ణువు దగ్గరకు వెళ్ళి శాప విముక్తి చేయమని శరణు కోరుతారు. మునుల శాపానికి తిరుగులేదు కాబట్టి మీరు భక్తులుగా ఐతే ఏడు జన్మలు. విరోధులుగా ఐతే మూడు జన్మలలో మీకు శాప విమోచనం అవుతుంది.కాబట్టి రెండింటిలో ఏది నచ్చితే అలా జన్మించమని చెప్పగానే విరోధులుగా 3 జన్మలెత్తి శాప విముక్తి పొంది మీ చెంతకు చేరుకుంటామని అంటారు.
అలా కృత యుగంలో హిరణ్యాక్ష, హిరణ్య కశిపులు గానూ, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగానూ,ద్వాపర యుగంలో శిశుపాల, దంత వక్తృలుగానూ జన్మించి ప్రతి జన్మలో విష్ణువు అవతారం చేత వధింపబడి శాప విముక్తి పొందుతారు.
ఆ విధంగా కృత యుగంలో జయ, విజయులు కశ్యప ప్రజాపతికి, దితికి హిరణ్యాక్షుడు , హిరణ్య కశిపుడుగా జన్మిస్తారు. హిరణ్య కశిపుడు అంటే బంగారు పడక మీద పడుకునే వాడని అర్థం.అంటే భోగలాలసత కలిగిన వాడు.శ్రీమహావిష్ణువు వరాహ మూర్తి అవతారంలో జయుడైన హిరణ్యాక్షుని వధిస్తాడు.
సోదరుడి మరణానికి చింతిస్తూనే ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుండి తాను "గాలిలో, ఆకాశంలో,భూమిపై గాని, నీటిలో, అగ్నిలో గాని, రాత్రి,పగలు గాని దేవదానవ మనుష్యులచే,జంతువులచేత,ఆయుధముల చేత,ఇంటా బయటా గాని మరణం వుండకూడదనే వరాన్ని పొందుతాడు.
ఇక ఆ తర్వాత తనకు ఎలాంటి మరణ భయం లేదనే వర గర్వంతో విర్రవీగుతూ ఎన్నో అకృత్యాలు చేస్తూ విష్ణువునే చంపేందుకు వెదుకుతూ వుంటాడు.
హిరణ్య కశిపుడి భార్య లీలావతి గర్భంతో ఉన్నప్పుడు నారద మహర్షి ఆశ్రమంలో ఉండాల్సి వస్తుంది.ఆ సమయంలో నారదుడి ద్వారా గర్భస్థ శిశువైన ప్రహ్లాదుడు అష్టాక్షరీ మహామంత్రోపదేశం పొందుతాడు. అందువల్ల ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహా విష్ణువు భక్తుడిగా పేరు పొందుతాడు.
విష్ణు ద్వేషి అయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చండా మార్కులనే గురువు వద్దకు పంపించి విష్ణు స్మరణ మాన్పించేందుకు ప్రయత్నం చేస్తాడు.ఎన్నో విద్యలు నేర్చుకున్నా విష్ణు నామ స్మరణ మాత్రం మానని ప్రహ్లాదుడిని అనేక రకాలుగా హింసిస్తాడు. శూలాలతో పొడిచినా,ఏనుగులతో తొక్కించినా, మంటల్లో పడదోసినా,కొండలపై నుంచి త్రోయించినా మారని కుమారుడితో ఓ రోజు "ఎక్కడ ఉన్నాడు రా నీ హరి? చూపించు అని నిలదీసి అడిగితే " ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి" అంటూ సమాధానం చెబుతాడు.
అది రాత్రి పగలు కాని సమయం గడప లోపల బయటా కాని స్థలం. అక్కడే ఉన్న స్తంభాన్ని చూపి ఇందులో విష్ణువును చూపకుంటే నీ తల తీయిస్తాను. అప్పుడు నీ హరి అడ్డుపడతాడా? అంటూ స్తంభాన్ని చేతితో చరచగానే నరసింహ స్వామి రూపంలో విష్ణుమూర్తి ఆవిర్భవిస్తాడు. ఉగ్ర నరసింహ మూర్తియై గడప మీద కూర్చుని తొడల మీద హిరణ్యకశిపుడిని పడేసి గోళ్ళతో చీల్చి సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుడి మాటను నిజం చేస్తాడు.
ఈ "నరసింహ న్యాయము" లేదా అవతారము భక్తులకు, నరులకు ఇచ్చే సందేశం ఏమిటంటే.భగవంతుడు సర్వాంతర్యామి.సృష్టిలో అంతటా వ్యాపించి వున్నాడు.భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామిని పూజిస్తే ఏ రూపంలోనైనా వచ్చి కాపాడుతాడు. వైర భక్తి అనేది ఒక రకమైన భక్తి.శత్రువులుగా వున్న వారి వల్ల మనలోని అంతఃశక్తి బయటికి వస్తుంది.
ఇక మనిషి, మృగం రెండూ కలిసి ఉన్న నృసింహ అవతారం ద్వారా చెప్పేదేమిటంటే కొందరు మనుషుల్లో లోలోపల మృగ స్వభావం ఉంటుంది. ఆ స్వభావం పైకి విజృంభించినప్పుడు ఆ వ్యక్తి విచక్షణ కోల్పోయి మృగంలా హిరణ్య కశిపుడిలా ప్రవర్తిస్తాడు.తద్వారా అతనికి ఎదుటి వారికి అనేక నష్టాలు కష్టాలు కలుగుతాయి.కాబట్టి ఆ స్వభావం కూడదు.మానవుడిగా నైతికతతో జీవిస్తూ,జ్ఞానాన్ని వెతుక్కుంటూ విలువల అభివృద్ధి చెందుతూ ఆనందంగా బతకాలి ఇదే "నరసింహ న్యాయము" లోని అంతరార్థము.
హిరణ్య కశిపుడు లోని దానవత్వాన్ని ,మృగత్వాన్ని ,దుర్గుణాలను దరికి చేరనీయకుండా మానవత్వంతో బతుకుతూ ఆ నరసింహ స్వామి కృపకు పాత్రులమవుదాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి