సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు- 818
"ఆషాఢ వాతే చలతి ద్విపేన్ద్రే చక్రీవతో వారిధి రేవ కాష్ఠా" న్యాయము
****
ఆషాఢ అనగా ఆషాఢ మాసంలో. వాతే అనగా గాలిలో చలతి అనగా కదలికలో ఉండటం లేదా గతి.ద్విప అనగా నీటితో చుట్టబడిన.ద్విపేంద్రే అనగా నీటితో చుట్టబడిన ఉరుములు మెరుపుల వర్షముతో, ఇంద్రుడు.చక్రీవతో బలమైన గాలికి.వారిధి అనగా సముద్రము.రేవ అనగా వర్షము,నది ( ప్రవహించే నది), వేగం మరియు దూకడం.కాష్ఠా అనగా కొయ్య , కప్పబడిన ప్రదేశం అనే అర్థాలు ఉన్నాయి.
"ఆషాఢ వాయు సంబద్ధే ద్విపేంద్రే గజేంద్రే చలతి ఇతస్తతో దోలాయమానే సతి చక్రీవతో రాసభస్య వారిధిః సముద్ర ఏవ కాష్ఠా విశ్రమావధి రిత్యర్థ"
అనగా వానతో భయంకరమైన ఆషాఢ మాసమందలి విసురు గాలిలో కట్టివేయబడి యున్న ఏనుగే చలించిపోయి అస్తవ్యస్తం అవుతున్నప్పుడు గాడిదకిక సముద్రమే గతి అని అర్థము.
ఇదొక పోలికతో కూడిన న్యాయము. ఇందులో మనం  విసురు గాలిని విధి రాతగా  చెప్పుకోవచ్చు. అందుకే మన పెద్దవాళ్ళు తరచూ "రాముడంతటి వాడికే ఈతి బాధలు తప్పలేదు - మనమెంత వారము" అంటుంటారు. ఆ మాటతో పాటు  శ్రీకృష్ణుడి గురించి కూడా "సాక్షాత్తూ కృష్ణ పరమాత్మకే తప్పలేదు నీలాపనిందలు - మానవులమైన మనమెంత?" అని. మరి అలాంటి ఘటనలు జరిగినప్పుడు, పరిస్థితులు ఎదురైనప్పుడు ఊరటగా ఇలా అనడం, అనుకోవడం పరిపాటి.
 పెద్ద పెద్ద వాళ్లతో పోల్చుకుని కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, నీలాపనిందలొచ్చినా మన మంచి మనసును, ప్రవర్తనను, నడవడికను గుర్తు చేసుకుంటూ... మనకే రావాలా! ఇలాంటివి అనుకుని బాధ పడకుండా ఇదిగో లాంటి వాటిని ఎదురీదేందుకు సమాయత్తం అవుతుంటాం.
 తీవ్రంగా వీచే గాలి. అనగా  తుఫాను లాంటి గాలి. ఆ గాలికి భూమి మీద అతిపెద్ద బరువైన ఏనుగు లాంటి జంతువే తట్టుకోలేక అటూ ఇటూ ఊగిపోయింది అంటే ఇక చిన్న బరువుతక్కువ జంతువుల పరిస్థితి ఏమిటీ! అవి ఇలాంటి తుఫాను గాలిని తట్టుకొని నిలబడటం సాధ్యమవుతుందా? కాదు కదా! అందుకే ఈ పోలికలతో సామాన్య మానవుడిని ఊరడించడం, హెచ్చరించడం అన్న మాట.
 ప్రకృతి వైపరీత్యాల ముందు అందరమూ తల వంచాల్సిందే. విధి రాత  పెట్టే  పరీక్షను తలవంచుకుని భరించాల్సిందే. 
అందుకే  జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సినారె గారి జీవన భాష్యం గజల్ లో "ఎంతటి ఎత్తున కెదిగినా ఉంటుంది పరీక్ష- హిమగిరి శిరసే మాడితే ఓ ఏరవుతుంది" అంటారు. అంటే హిమగిరి శిఖరానికే పరీక్ష తప్పలేదు. మానవ మాత్రులం మనమెంత ..మనకూ ఉంటాయి పరీక్షలు అని అర్థము.
"ఆషాఢ వాతే చలతి ద్విపేన్ద్రే చక్రీవతో వారిధి రేవ కాష్ఠా" న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ భూమ్మీద జన్మించిన ప్రతి ఒక్కరికీ స్థాయీ భేదాలతో ఈతి బాధలు తప్పవు.కాబట్టి మన సమస్యలను భూతద్దంలో/ కుంభాకార కటకంలో చూడకుండా పుటాకార కటకంలోంచి చూస్తే సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. అలా చూడటం నేర్చుకుంటే మనం ఎలాంటి కష్టమైనా  ఎదుర్కోవచ్చు అని ఈ న్యాయము ద్వారా అర్థము ౙసుకోవాలి.
అదండీ సంగతి! మనం కూడా సంతోషాలను భూతద్దంలో చూసుకుందాం. సమస్యలను సామాన్యమైన అద్దంలో చూద్దాం..

కామెంట్‌లు