సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-801
అజ్ఞాత కుల శీలస్య వాసో దేయో కస్యచిత్" న్యాయము
*****
అజ్ఞాత అనగా ఉనికిని బయట పడనీయకుండా,కుల అనగా వృత్తిని బట్టి పూర్వ కాలంలో కులాలు ఏవో చెప్పేవారు. శీలము అనగా వ్యక్తి యొక్క మంచి వ్యక్తిత్వం. వాసో అనగా వసించడానికి ఉండడానికి. కస్యచిత్ అనగా ఎవరైనా ఒకరు, కొంతమంది అని అర్థము.
ఊరు, పేరు, కులము,శీలము తెలియని పురుషున కెవరికినీ ఇంటిలో ఆశ్రయం ఇవ్వకూడదు.అలా ఇస్తే చాలా ప్రమాదకరం. అనే అర్థముతో ఈ "అజ్ఞాత కుల శీలస్య వాసో దేయో కస్యచిత్" న్యాయమును మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
 మొత్తంగా విషయం ఏమిటంటే అపరిచితులకు ఆశ్రయం ఇవ్వకూడదు. అపరిచితులు అంటే ఎవరు? వారిలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. 
అజ్ఞాతులు అంటే తన ఉనికిని బయట పడనివ్వకుండా జీవితాన్ని గడిపే వ్యక్తులు. వాళ్ళ గతం ఏమిటో, గత చరిత్ర ఏమిటో, ఊరు ,పేరు ఏమిటో కూడా మనకు తెలియదు.  మాటలను బట్టి మంచి వ్యక్తి అయితే ఫరవా లేదు అనుకుంటాం .కానీ కొంతమందిని పరిస్థితులే మారుస్తూ ఉంటాయి. కాబట్టి మాటలతో,చేతలతో మనకు ఎంత నమ్మకం కలిగించాలని ప్రయత్నించినా ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పెద్దలు చెబుతుంటారు.
 ఇక కులము. మరి కులము అనే పదము ఎక్కడ నుండి వచ్చిందో చూద్దాం. భగవద్గీతలో కులం గురించి ప్రస్తావించబడింది.కులం అనగా తాను పుట్టిన వంశము అని చెప్పుకోవచ్చు. ఇంటి కోడలును '⁵కుల వధువు' అంటారు
"కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మాశ్చ శాశ్వతాః అనే శ్లోకంలో ఉంది.
 
కాళిదాసు రాసిన "అభిజ్ఞాన శాకుంతలం" లో రెండు మూడు చోట్ల కుల ప్రస్తావన వస్తుంది.
అలాగే వేమన కవి కూడా "కులములోన నొకడు గుణవంతుడుండిన/ కులము వెలయు వాని గుణము చేత/వెలయు వనములోన మలయజంబున్నట్లు/అని కుల ప్రస్తావన తీసుకుని పద్యాన్ని రాశాడు.
అలా పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక కులం అనేది ఉంటుంది ..అది బీరకాయ పీచులానో ,తీగ లాగితే డొంకంత కదిలినట్లుగానో ఫలానా వ్యక్తిగా తెలుస్తుంది.మరి అది తెలియని వ్యక్తి మన ప్రాంతానికి చెందిన వాడు కాకపోవచ్చు.కాబట్టి అలాంటి వారికి ఆశ్రయం ఇవ్వకూడదని అంటారు.
ఇక చివరిది 'శీలము'."ఏది పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ శీలం పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోలేం " అంటుంటారు.
మరి శీలం అంటే మంచి నడవడిక, నైతిక విలువలు కలిగి వుండటం, ఒక వ్యక్తి యొక్క  మంచి వ్యక్తిత్వం. దీనిని శీలం అంటారు. అలాంటి శీలం లేని వారు అంటే విలువలకు తిలోదకాలు ఇచ్చిన వారే కాబట్టి వారు ఎలాంటి దుర్మార్గపు పనులకైనా సిద్ధపడతారు. అందువల్ల  శీలం లేని వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు అని అర్థము
ఇలా ఊరు పేరు కులము, శీలము లేని వారికి ఆశ్రయం ఇచ్చి మనం ప్రమాదంలో పడకూడదు అని చెప్పేందుకే ఈ న్యాయమును పదే పదే ఉటంకిస్తూ ఉంటారు.
 అందుకే పెద్దలు చెప్పినట్లు ఈ "అజ్ఞాత కుల శీలస్య వాసో దేయో కస్యచిత్" న్యాయమును  సదా గమనంలో పెట్టుకొందాం.
ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన గురించి అన్ని కూపీలు లాగి వచ్చి మోసం చేసేవాళ్ళు ఎక్కువై పోయారు. ప్రసార మాధ్యమాల్లో ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం.కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందాం.

కామెంట్‌లు