మానసిక ఒత్తిడి:- సి.హెచ్.ప్రతాప్

 ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కొంత మందికి తమలో మానసిక ఒత్తిడి ఉందన్న సంగతి కూడా తెలీదు. ఈ లక్షణాలు గనక ఉన్నట్లయితే.. అప్పుడు  ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఉండే నొప్పుల కంటే కండరాల నొప్పులు, ఒంటి నొప్పులు, మైగ్రేన్, తలనొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం ఇవి స్ట్రెస్‌కి ప్రాథమిక లక్షణాలుగా చెప్పొచ్చు.ఏ పని చేయాలన్నా, తినాలన్నా, బయట తిరగాలన్నా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. నలుగురితో మాట్లాడేందుకు కూడా ఇష్ట పడరు. ఒంటరిగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. పనులపై కూడా శ్రద్ధ తగ్గుతుంది. ఏ పని చేయడానికి కూడా ఆసక్తి చూపించరు.సామాన్యుల దగ్గరి నుంచి విద్యార్థులు, మేధావులు, అధికారులు, కార్పొరేట్‌ దిగ్గజాల వరకూ అంతా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. దీంతో ఆందోళన, కుంగుబాటు, గుండెజబ్బులు, స్ట్రోక్‌ వంటి మానసిక, శారీరక సమస్యలెన్నో చుట్టుముడుతున్నాయి.  ఒత్తిడితో భయం, ఆందోళన, విశ్రాంతి తీసుకోలేకపోవడం, హృదయ స్పందన రేటు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిద్రలో మార్పు రావడం, ఏకాగ్రత లేక పోవడం, ఇవిగాక ప్రజలకు ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవడం, శారీరక, మానసికంగా నష్టం అయ్యే అవకాశం ఉంది. ఒత్తిడి మనకు విశ్రాంతి తీసుకోవడం కష్టతరం చేస్తుంది. ఆందోళన, చిరాకుతో సహా అనేక భావోద్వేగాలు కలుగవచ్చు.ఒత్తిడి స్థాయిలను తగ్గించే.. ఉత్తమ మార్గాల్లో వ్యాయామం ఒకటని నిపుణులు చెబుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది, ఈ హార్మోన్‌ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాయామం ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ వ్యాయామం చేస్తే.. శరీరం, మనస్సు విశ్రాంతి స్థితికి వెళ్తాయి.మానసిక ప్రశాంతత బాగుండాలంటే నచ్చినవాళ్లతో మాట్లాడటం చాలా ముఖ్యం. ఒత్తిడికి కారణం ఏదైనా మనసుకు దగ్గరగా ఉండే వాళ్లతో మాట్లాడితే ఒంటరితనం, ఒత్తిడి క్రమంగా తగ్గుతాయి. మనసు తేలికపడుతుంది.కొన్ని కొన్ని విషయాలను పదే పదే ఆలోచించడం వల్ల అధిక ఒత్తిడికి గురై లేనిపోని ఆలోచనలు వచ్చే అవకాశాలుంటాయి. వరుసగా పనులు చేస్తుంటే ఒత్తిడికి గురవుతుంటారు. మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయాలను సైతం చూడడం, వినడం కాని చేయవద్దు. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మానసికంగా బాగా కుంగిపోతాము.ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండే సమయంలో వీలైనప్పుడు అందరితో కలిసిపోయేలా ఉండాలి. స్నేహితులతో మాట్లాడుతుండాలి. ఏవైనా సమస్యలుంటే వారితో షేర్‌ చేసుకుంటే కొంత కొంత ఒత్తిడి అనేది దూరమవుతుంది. చీకటిలో ఉండకుండా ఫ్రీగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా నిద్రలేమి సమస్య కూడా ఆరోగ్యానికి గురి చేస్తుంది.
కామెంట్‌లు