సమాజంలోని ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి తమ పనులు చేసుకోవాలని కాల్వశ్రీరాంపూర్ ఎస్సై సులువ వెంకటేశం అన్నారు. చట్ట విరుద్ధమైన పనులు చేసిన వారిని కోర్టులో హాజరు పరిచి, న్యాయమూర్తి తీర్పు మేరకు వారిని జైలుకు పంపిస్తామన్నారు. శనివారం
కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 'వారానికో వక్త' కార్యక్రమంలో భాగంగా భోజన విరామ సమయంలో ఆయన 'చట్టాలు - శాంతిభద్రతలు' అనే అంశంపై ప్రసంగించారు. పాఠశాల పిల్లలకు వివిధ అంశాలపై అవగాహన కలిగించేందుకు ఊషన్నపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఇటీవల 'వారానికోవక్త' కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి వారం పాఠశాలకు ఒక ముఖ్య అతిథిని పిలిపించి వివిధ విషయాలపై ప్రసంగాలు ఇప్పిస్తుంటారు. అందులో భాగంగా శనివారం స్థానిక ఎస్సైని ఆహ్వానించి 'చట్టాలు - శాంతి భద్రతలు' అనే అంశంపై పిల్లలకు అవగాహన కల్పించారు. అలాగే సెల్ఫోన్ వినియోగం - సైబర్ నేరాలు, పిల్లల చదువు కొనసాగింపు అంశాలపై ఎస్సై పిల్లలకు వివరించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పిల్లల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు పాఠశాలలో వివిధ రకాల వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఊషన్నపల్లి పాఠశాలను అందంగా, ఆకర్షణీయంగా తయారు చేస్తున్నామని, సకల సౌకర్యాలతో ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. తమ పిల్లల్ని ఊషన్నపల్లి పాఠశాలలో చేర్పించాలని, ఆరుగాలం కష్టించి సంపాదించిన వేలాది రూపాయలను పొదుపు చేసుకోవాలని ఆయన పిల్లల తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, శ్రీవాణి, పిల్లలు, పోలీస్ సిబ్బంది, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి