కడలన్నాక అలలు తప్పవు....
కనులున్నాక కలలు తప్పవు...
ఇది నిజం పచ్చినిజం...
నిన్నటి వరకు గురకల
చప్పుళ్లలో నిద్రపోయిన నేను...
నిన్నరాత్రి కలత నిద్రలో ఓ కలగన్నాను...
నా కనురెప్పలు రెండు కనిపించడం లేదు..
నిశ్శబ్దపు నల్లని పొదల్లో
నా మనసు మసకబారిపోయింది...
మెత్తని పరుపు తలరాతను తాకినా...
నా చేతులు దిండును వేడుకున్నా...
నిద్ర మాత్రం కనుచూపంత దూరం...
కంటి గూటిలో గువ్వల్లా
రెప్పలు గుసగుసలాడుతున్నాయి...
గుడ్లగూబల్లా ఉరిమిచూస్తున్నాయి...
మౌనంగా ఏదో చెప్పాలని తపిస్తున్నాయి...
కనురెప్పల వాకిళ్లు మూతపడలేదెందుకని...
ఔను..! నా రెప్పలు ఆ పరమాత్మ
పాదాలపై వేలాడుతున్నాయి...
వేడుకుంటున్నాయి...ప్రార్థిస్తున్నాయి...
తమను శాశ్వతంగా ఒక్కటి చేయవద్దని...
ఎట్టకేలకు
నా నిట్టూర్పు నిద్రగా మారింది...
నన్ను చుట్టుముట్టిన
చీకటి తెరలు చిరిగిపోయాయి...
ఉషస్సు వెండి వెలుగులో
నా కళ్ళురెండుస్నానం చేశాయి...
కనురెప్పల వాకిళ్లు
భళ్ళున తెరుచుకున్నాయి....
కానీ…
నా రెప్పల చివరి కోరిక తీరాలని...
నేను కన్నకల నిజం కావాలని...
నేను సైతం వేయిదేవుళ్లను
వేడుకుంటున్నాను.
కనురెప్పలు మూతపడితే…
కొన్ని క్షణాలు మగత నిద్ర...
ప్రశాంతమైన శాంతి...విశ్రాంతి...
కనురెప్పలు విడిపోతే…వెన్నెలకాంతి...
కానీ రెప్పలు రెండు
శాశ్వతంగా ఒక్కటైతే..?
అదే మనిషికి ఆఖరి నిద్ర...శాశ్వత నిద్ర..!
ఆపై పరలోక ప్రయాణానికి ఆమోముద్ర..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి