తెలంగాణ చట్టసభలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు జర్నలిస్టులు? అనే ప్రశ్నను లేవనెత్తారు. ఈ అంశంపై అవసరమైతే ఒకరోజు చర్చ జరగాలని కోరారు. జర్నలిస్టు సంఘాలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో ప్రస్తావించినప్పటికీ జర్నలిజాన్ని రక్షించుకునేందుకు, జర్నలిస్టును కాపాడుకునేందుకు ఈ చర్చ తోడ్పడుతుందనే ఉద్దేశంతో మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం.
మీడియాలో వస్తున్న మార్పులు, సమాజ అభివృద్ధికి తోడ్పడేందుకు వీలుగా ఉండేందుకు, పెడదారులు పట్టకుండా చూసేందుకు 1952 లో నాటి భారత ప్రభుత్వం జస్టిస్ రాజ్యాధ్యక్ష నేతృత్వంలో ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేసింది. అ కమిషన్ సిఫార్సు లకు అనుగుణంగా అనంతర కాలంలో 1955లో వర్కింగ్ జర్నలిస్టుల చట్టం అమల్లోకి వచ్చింది. 1958లో పత్రికారంగంలో పనిచేసే వారి కోసం వేతనాల చెల్లింపు చట్టం రూపుదిద్దుకుంది. దేశంలోని పత్రికా రంగంలో పని చేసే వారందరికీ ఈ చట్టాలు శిరోధార్యాలు గా భాసిల్లాయి.
వర్కింగ్ జర్నలిస్టుల చట్టంలోనే ఎవరు జర్నలిస్టు, ఎవరు నాన్ జర్నలిస్టు అనే విభజన వారు చేసే పనిని బట్టి నిర్ణయిస్తూ నిర్వచించారు. ఈ రంగంలో పనిచేసే వారి జీతనాతాలు, ఇతర సదుపాయాలు తదితర అంశాలన్నింటినీ పరిశీలించి నిర్ణయించేందుకు వేజ్ బోర్డులను ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఆమోదించిన వేజ్ బోర్డులను అమలు చేసే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పై ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా యజమానులు, జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులతో కూడిన త్రైపాక్షిక కమిటీల ద్వారా ఈ వేజ్ బోర్డు సిఫారసులను అమలు చేసే బాధ్యత రాస్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు.
పత్రికారంగ సంతులనం దెబ్బతినకుండా సజావుగా సాగేందుకు వీలుగా ఈ వేజ్ బోర్డులు సమగ్రంగా ఉండేందుకు పత్రికా యాజమాన్య ప్రతినిధులు, జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల ప్రతినిధులు, అధికారులతో భారత ప్రభుత్వం వేజ్ బోర్డు ఏర్పాటు చేస్తుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో పర్యటించి ఆయా రాష్ట్రాలలోని పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం వేజ్ బోర్డు తన సిఫారసులను రూపొందిస్తుంది. పత్రికా రంగంలోని భాగస్వామ్య పక్షాలన్నీ తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అవకాశం ఉంటుంది. లిఖితపూర్వకంగా తమ ప్రతిపాదనలను కూడా వేజ్ బోర్డు ముందు ఉంచవచ్చు. ఈ అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం వేజ్ బోర్డు సిఫారసులను తయారు చేస్తుంది. తయారు చేసిన సిఫారసులను పార్లమెంటు ఆమోదం పొందిన తరువాతనే చట్టరూపం దాలుస్తాయి.
పత్రికా రంగాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించేందుకు సమాజ పురోభివృద్ధిలో జర్నలిస్టు లను భాగస్వాములను చేసేందుకు రూపొందించిన ఈ ఏర్పాటు వాస్తవంలో ఏ విధంగా అమలవుతోందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో జర్నలిస్టులు అగ్రభాగాన నిలిచారు. అనంతర కాలంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగేందుకు తమ వంతు కర్తవ్యాన్ని దీక్షతో నిర్వర్తించారు. ఆ దీక్ష, పట్టుదల, చిత్తశుద్ధి కొరబడడానికి కారణాలేమిటి అనేది ఇప్పటికయినా సమగ్రంగా చర్చించాల్చిన అవసరం ఉంది. గతంలో పరిమితమైన ప్రచురణ కేంద్రాలే ఉన్నప్పటికీ అపరిమితమైన ప్రజాదరణ పొందిన పత్రికారంగం మసకబారడానికి దారి తీసిన పరిస్థితులేమిటి, అందుకు బాధుద్యులెవరు అనే విషయంపై చర్చ జరగాలి.
1980 తరువాత మీడియా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. యజమానుల ధోరణి, ప్రభుత్వ వైఖరి మారాయి. యాజమాన్యాలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని బహుళ ప్రచురణ కేంద్రాలను ప్రారంభించారు. సమాజ సంక్షేమాన్ని మించి వ్యాపార ధోరణి విస్తరించింది. అధికారంలో ఉండే రాజకీయ పక్షాలు తమ స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని క్రమంగా యాజమాన్యాలకు వంతపలికే స్థితికి వెళ్ళిపోయాయి. ఫలితంగా పత్రికా రంగంలో పెను మార్పులు వచ్చాయి. జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టు ల ఉద్యోగ భద్రత కొరవడి కాంట్రాక్టు పద్ధతితో పాటు రకరకాల పద్ధతులు ప్రవేశించాయి. చట్టబద్ధంగా యాజమాన్యాల నుంచి జీతనాతాలు, ఇతర సదుపాయాలు పొందే స్థితి పోయింది. జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల మధ్య ఐక్యత అంతరించింది. ప్రభుత్వాల ప్రాపకంతో జర్నలిస్టులు కొద్దిపాటి సదుపాయాలు పొందే ప్రయత్నాలు మొదలయ్యాయి. జర్నలిస్టులకు ఆరోగ్య భీమా కార్డులు, బస్సు పాస్ సదుపాయం ఆ కోవలోకి వచ్చేవే. తమ ఇతర వ్యాపారాల విస్తరణకు, లాభార్జనకు పెద్దపీట వేసిన యాజమాన్యాలు, తమ విధానాల ప్రచారానికి మీడియాని వినియోగించుకోవాలనుకునే ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొనే ధోరణి పెరిగి పోయింది. తమ స్వప్రయోజనాలను కాపాడు కునే క్రమంలో యాజమాన్యాలు, ప్రభుత్వాలు పత్రికా రంగ అభివృద్ధికి రూపొందించుకున్న చట్టాల అమలు పక్కన పెట్టేశాయి. ప్రభుత్వాలే చట్టాల అమలును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఫలితంగా మీడియాలో అభద్రతా భావం పెరిగింది. పలు అవ లక్షణాలు ప్రవేశించాయి.
ఈకాలంలో పత్రికారంగానికి జతగా బ్రాడ్ కాస్ట్ మీడియా విస్తరించింది. డిజిటల్ మీడియా రంగ ప్రవేశంతో సోషల్ మీడియా మరింతగా పెరిగింది. రాజ్యాంగంలో పేర్కొన్న పౌరులకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ తప్ప జర్నలిస్టులకు ఎటువంటి ప్రత్యేకమైన హక్కులు లేవు. సోషల్ మీడియా రంగ ప్రవేశం తర్వాత కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ కొన్ని నియమ నిబంధనలను రూపొందించింది. అవి ఈ రంగంలో పనిచేసే వారికి ప్రయోజనం కలిగించేవి కాదు, కేవలం అదుపు చేయడానికి ఉద్దేశించినవే.
కార్పొరేట్ శక్తులు వ్యాపార వర్గాలు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తులు సోషల్ మీడియాను తమ అవసరాలకు, ప్రచారానికి విస్త్రుతంగా వినియోగించుకుంటున్నారు. తమ స్వప్రయోజనాలే లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్న ప్రచారం కారణంగా సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించటం లేదనే అపప్రద మోసే స్థితికి వెళ్ళిపోతోంది.
మీడియా రంగాన్ని మరింత సమర్థంగా, విశ్వసనీయంగా వినియోగించుకునేందుకు, దేశ పురోభివృద్ధికి బాటలు వేసేందుకు బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా పత్రికారంగానికున్న రెండు చట్టాలను రద్దుల బాటలో చేర్చింది. జస్టిస్ గురుభక్షు మతీజియా వేతన బోర్డు సిఫార్సుల అమలు కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఎంత మాత్రం పట్టించుకోలేదు. జర్నలిజం ఇతర పరిశ్రమలతో, వ్యాపారాలతో పోల్చదగినది కాదని, ఇది ప్రత్యేకమైన వృత్తి, విలక్షణమైనది కనుక ఈ రంగానికి ఉన్న చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం లేదని చేసిన వ్యాఖ్యలు పెడచెవిన పెట్టింది.
కొంతకాలం జర్నలిస్టుగా పనిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయాలు తెలియనివి కావు. ఈ పరిస్థితులన్నిటి నేపథ్యంలో జర్నలిజం వృత్తిగా కొనసాగేందుకు, జర్నలిస్టు లను రక్షించేందుకు వీలుగా తెలంగాణ చట్టసభ చర్చించాలని మేము కోరుకుంటున్నాం. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం.
మీడియాలో కొందరు వాడుతున్న భాష పట్ల జర్నలిస్టులుగా మేం కూడా ఆవేదన చెందుతున్నాం. రాజకీయ నాయకుల ప్రోద్బలం కారణంగానే ఇటువంటి భాష వినియోగిస్తున్నారనే విషయం మీకు తెలియంది కాదు.
రాష్ట్ర పరిధిలోని మొత్తం మీడియాను (ప్రింట్, బ్రాడ్ కాస్ట్, డిజిటల్, సోషల్ మీడియా) ఒకే చట్ట పరిధిలోకి తీసుకురావాలి. అందుకు గల అవకాశాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మీడియా కమిషన్ ను నియమించాలి. తెలంగాణ పరిధిలో గల వివిధ మీడియాల సంస్థల పరిస్థితిని స్థితిగతులను అధ్యయనం చేసి ఆ కమిషన్ నివేదికను రూపొందించాలి.
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో 1952లో తొలి ప్రెస్ కమిషన్ ఏర్పాటు అయింది. ఆనాడు ఉన్న మీడియా పరిస్థితిని అధ్యయనం చేసి ప్రతిపాదించిన సిఫారసుల కారణంగానే భారత మీడియా క్రమ పద్ధతిలో ముందుకు సాగటం సాధ్యమైంది. నేడు ఉన్న పరిస్థితులను, మీడియా వ్యవహార సరళిని అధ్యయనం చేసి అందుకు తగిన సిఫారసులు ప్రతిపాదించాలి. స్వయంగా ముఖ్యమంత్రి ఈ విషయంలో చొరవ చేయడం వల్ల తెలంగాణలో మీడియా కమిషన్ ఏర్పాటు చేస్తే దేశంలోనే అది పెద్ద సంచలనం అవుతుంది. మీడియాలో సంస్కరణలకు బాటలు వేసినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి చట్టసభలో చేసిన ప్రసంగం వృధాగా పోకుండా సరైన కార్యాచరణ దిశగా సాగుతుందని ఆశిస్తున్నాం.
నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ ( ఎన్ ఏ జె)
ఎస్.కె పాండే ఎన్ కొండయ్య
అధ్యక్షులు సెక్రటరీ జనరల్
ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ( డి యు జె)
సుజాత మధోక్ జిగేష్
అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపిడబ్ల్యూజేఎఫ్)
ఎస్ వెంకట్రావు జి ఆంజనేయులు
అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీ బీజేఏ)
వి శ్రీనివాసరావు కే మునిరాజు
కన్వీనర్లు
నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ ఎన్ఏజే తెలంగాణ శాఖ
ఎం ఏ రవూఫ్ కన్వీనర్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి