ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగ+ఆది యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృత యుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాదిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తొంది. కాలక్రమేణా వాడుకలో అదే ఉగాది పండుగ అయింది.ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఇందులో తీపి కోసం బెల్లం, వగరు కోసం లేత మామిడి పిందెలు, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం లేత వేప పువ్వులు, కారం కోసం పచ్చి మిరపకాయలు వేసి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. దీని వెనుక గల అంతరార్ధం ఏమిటంటే ఈ సంవత్సరమంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించగల స్థిత ప్రజ్ఞతను సాధించడమే! ఉగాది పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజ చేసి, పిండి వంటలు, మహా నైవేద్యం సమర్పించాలి. అనంతరం కుటుంబ సభ్యులంతా మొదటగా ఉగాది పచ్చడి స్వీకరించాలి.షడ్రుచుల సమ్మేళనంగా ఉండే ఈ పచ్చడికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆరోగ్యపరంగా కూడా ఇది ఎంతో ప్రయోజనకరం. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉగాది పచ్చడి తీసుకోవడం ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు.
ఈ పచ్చడిలో తీపి (మధురం), పులుపు (ఆమ్లం), కారం (కటు), వగరు (కషాయ), ఉప్పు (లవణం), చేదు (తిక్త) రుచులు సమపాళ్లలో ఉంటాయి.ప్రతి రుచి మన జీవితంలోని విభిన్న అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుంది.అది అమృత సమానం. విశేషమైన రోగ నిరోధక శక్తి కలిగినది. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే, ఏడాదంతా సౌఖ్యదాయకంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.ఉగాది పచ్చడిలో వినియోగించే పదార్థాల్లో మొదటిది బెల్లం. ఇది నోటికి తీపిని అందించడమే కాదు, జీవితంలోని తీపిని గురించి కూడా చెబుతుంది. జీవితంలో సంతోషం, విజయాలు ఉంటాయి. అవి దక్కినప్పుడు వాటిని ఆస్వాదిస్తూ కృతజ్ఞతతో ముందుకు సాగాలి.ఉగాది పచ్చడిలో కచ్చితంగా వాడాల్సింది వేపపువ్వు. ఇది జీవితంలో ఎదురయ్యే బాధలు, కష్టాలు, దు:ఖాలకు గుర్తు. మనిషి జీవితంలో కష్టాలు అత్యంత సహజం. తీపిలాంటి సంతోషకరమైన సందర్భాలతోపాటు చేదులాంటి బాధలూ ఉంటాయని దీనర్థం. అందుకే ఎలాంటి బాధలు, కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా ముందుకు సాగాలనే అంతరార్థం ఇందులో ఉంటుంది.ఈ ఉగాది పచ్చడిని ఈ పండుగ నుంచి శ్రీరామనవమి వరకూ లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజూ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఆ సంవత్సరమంతా రోగాలేవీ దరిచేరవనే నమ్మకం కూడా ఉంది.ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు లాంటి అంటురోగాలను దగ్గరకి రానివ్వకుండా కాపాడుతుంది. మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంది. మిరియాలు దగ్గు, జలుబు, పైత్యాలను అదుపులో ఉంచుతాయి. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి