సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు -798
చతుర్వేద ఆమ్న్యాయము
*****
చతుర్వేద అనగా నాలుగు వేదాలు.ఆమ్నాయ అనగా వేదము, సంప్రదాయము, ఉపదేశము, మాటిమాటికీ వల్లెవేయుట అనే అర్థాలు ఉన్నాయి.
 చతుర్వేదాలు వినబడినవి అనగా శ్రుతులు లేదా ఆమ్నాయములనియూ, భగవంతుని ద్వారా తెలుపబడినవనియూ అర్థము.అనగా ఇవి ఏ మానవుల చేతనూ రచింపబడలేదని పండితులు, పూర్వీకులు , మన పెద్దలు చెబుతుంటారు.అందుకే వీటిని అపౌరుషేయాలు అని కూడా పిలుస్తారు. వేదాలను తెలుసుకున్న ఋషులను ద్రష్టలు అని అంటారు.ద్రష్ట అంటే దర్శించిన వాడని అర్థము.
ఈ విధంగా హిందూ శాస్త్రాల ప్రకారం ఋషులు వేదాలను భగవంతుని ద్వారా విని గానం చేశారన్న మాట. అందుకే వేదాలను శ్రుతులు అని కూడా అంటారు.
ఇలా చతుర్వేదాలను శ్రుతి,అనుశ్రవం,త్రయి,సమమ్నాయము,నిగమము,ఆమ్నాయము,స్వాధ్యాయము,ఆగమము అనే పేర్లతో పిలుస్తారు.మరి వీటి అర్థాలను కూడా తెలుసుకుందాం.
1.శ్రుతి అనగా - గురువు ఉచ్ఛరించిన దానిని విని అదే విధంగా శిష్యుడు ఉచ్ఛరిస్తూ నేర్చుకుంటాడు.2. అనుశ్రవం అనగా - గురువు ఉచ్ఛరించిన దానిని సరిగ్గా అదేవిధంగా పదే పదే శిష్యుడు ఉచ్ఛరిస్తూ ఉంటాడు.
3.త్రయి అనగా -ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము...ఈ మూడింటిని కలిపి త్రయి అంటారు.4. సమమ్నాయము అనగా -ఎల్లప్పుడూ అభ్యసింప బడునవి అని అర్థము.
5.నిగమము అనగా - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి.యాస్కుడు వీటిని నిగమములు అని వ్యవహరించాడని చెబుతారు.6.ఆమ్నాయము అనగా -ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య అని అర్థము.
7.స్వాధ్యాయము అనగా -స్వయం అధ్యయనం అంటే మనల్ని మనమే విశ్లేషించుకోవడం.8.ఆగమమం అనగా వచ్చినది.ఆగత,గత,మత అనే మూడు శబ్దాలను కలుపగా వచ్చిన శబ్దమని చెప్పబడింది.ఆగమాలకు తంత్రాలనే పేరు కూడా ఉంది.ఆగమములో రెండు రకాలు ఉన్నాయి.ఒకటి వైఖానశ మునికి విష్ణువు నుండి వచ్చినది.రెండవది పాంచరాత్ర ఆగమము.గరత్మంతునికి అయిదు రాత్రులు విష్ణువు ఉపదేశించినది పాంచరాత్ర ఆగమము . ఈ విధంగా చతుర్వేదాలు అయిన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము,అధర్వణ వేదములను వివిధ పేర్లతో పిలుస్తారు.
ఈ నాలుగు వేదములను విశ్వ సంస్కృతి భవనానికి నాలుగు స్తంభాలని అంటారు. సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడు నలుగురు ఋషులకు నాలుగు వేదాలు ఆవేశింప చేశాడని మన పూర్వీకులు చెబుతుంటారు.అగ్ని అనే ఋషి హృదయంలో ఋగ్వేదం ప్రకాశించిందనీ, వాయువు ఋషి హృదయంలో యజుర్వేదము.ఆదిత్యునిలో సామవేదము.అంగీరసునిలో అధర్వణ వేదం ప్రకాశించాయని, వారే ఆ తర్వాత కాలంలో వేదాలను వ్యాప్తి చేశారని వేదాధ్యయనం వల్ల తెలుస్తోంది.
 
హిందూ మతములో వేదములను సంస్కృతికి, సంస్కృత భాషకు అత్యంత మౌలికమైన ప్రామాణికమైన సాహిత్యంగా చెప్పడం జరిగింది.శాక్తేయము ,వైష్ణవము, శైవము, అద్వైతము, విశిష్టాద్వైతము,ద్వైతము మొదలైన అన్ని రకాల తత్వముల,తత్వ మార్గములను అనుసరించే వారు వేదములను ఆధారంగా చేసుకుని  తమ తమ  వాదనలను, రకరకాల తర్కాల ద్వారా సమర్థించుకున్నారు.
 ముఖ్యంగా ఈ వేదాలు పురాతన హిందూ గ్రంథాల సమాహారంగా, పవిత్ర గ్రంథాలుగా పరిగణించబడినవి.ఈ వేదాల మూలాలను క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నాటివని, అంతకన్నా పూర్వమే ఉన్నాయని చరిత్ర కారులు చెబుతున్నారు.అయితే ఒక రాశిగా ఉన్న వేద వాజ్మయాన్ని వేద వ్యాస మహర్షి వీటిని భాగాలుగా విభజించాడని చెబుతుంటారు.
 మరి ఈ వేదాల యొక్క ప్రభావము కేవలం మతానికే పరిమితం కాలేదు. వీటిని పాలనా పద్ధతులు, ఆయుర్వేదము,ఖగోళము, దైనందిన ఆచారాలు, నిత్య జీవన కార్యాలు  మొదలైన వాటెన్నింటితోనో  ముడిపెట్టి చెప్పడం చాలా గొప్ప విషయం,విశేషం.
 ఎందుకంటే ఈ వేదాల్లో ఎంతో జ్ఞానం నిగూఢమై వుందని తెలుసుకున్న ఋషులు  నాలుగు వేదాల జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి వాటికి సంబంధించిన వివరణ గ్రంథాలను ఇచ్చారు. ఈ వివరణ గ్రంథాలను వేదాంగాలు అంటారు.అందులో శిక్షా, వ్యాకరణము,కల్పకము,నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషం అనే  షడంగాలు (6) ఉన్నాయి. ఇవి వేదాల యొక్క అర్థాలను వివరంగా చెబుతాయి.
ఈ చతుర్వేదాలు అనేవి ప్రాచీన జ్ఞానానికి అమూల్యమైన వనరుగా చెప్పుకోవచ్చు.శతాబ్దాలుగా మొదట్లో మౌఖికంగానూ,ఆ తర్వాత లిఖితపూర్వకంగానూ భద్రపరచబడినవి.ఇందులో ప్రాచీన భారత దేశ సంస్కృతి,సంప్రదాయాలు, నమ్మకాలు మొదలైనవి ఎన్నో ఆనాటి సమాజానికి మాత్రమే కాకుండా ఆధునిక సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఉన్నాయి.
 వివాహాది శుభకార్యాలలో,అశుభ కార్యాలలోనూ,మత పరమైన పండుగలు,ఆచారాలలో వీటి పాత్ర అంతర్లీనంగా ఉండటం గమనించవచ్చు. వీటిలోని శ్లోకాలను,వేద మంత్రాలను కొన్ని ముఖ్యమైన వేడుకల సమయంలోనూ, దైవ  కార్యాలోనూ పఠిస్తుంటారు.
వేదాల్లో ముఖ్యంగా కర్మ,కర్మ యోగము,కర్మ ఫలితాలు,ధర్మం, మోక్షం వంటి ఆధ్యాత్మిక, తాత్విక బోధనలు ఉన్నాయి.ఇవి మానవ జీవితాన్ని సన్మార్గంలో నడిపించడానికి దోహదపడతాయి.వీటితో పాటు కళలు, హస్తకళలు, సైన్స్, ఇంజనీరింగ్ మొదలైన అంశాలకు సంబంధించిన విజ్ఞాన సమాచారం కూడా ఉంది.
 ఈ విధంగా వేదాలు ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల గ్రంథాలని మనం అర్థం చేసుకోవచ్చు.వీటిల్లో మతపరమైన విషయాలే కాకుండా సామాజిక, శాస్త్ర ,సాహిత్య, భాషాపరమైన  విలువలతో కూడిన శ్లోకాలు, పద్యాలు ఎన్నో ఉన్నాయి.
అందుకే "వేదం జీవన నాదం" అంటారు.ఆ వాక్యాన్ని బలపరుస్తూ చెప్పిన  ఈ శ్లోకాన్ని చూద్దాం.
"దృశ్యేన శరదాంశతం/ సున్యామ శరదాంశతం/ప్రబ్రవామ శరదాంశతం/ అదీనా శ్యామ శరదఃశతం/భూయామ శరదఃశతం" ...అంటే మనిషి నిండు నూరేళ్ళు హాయిగా, ఆనందంగా ఆయురారోగ్యాలతో జీవించాలంటే చక్కగా చూస్తూ, చక్కగా వింటూ, మంచిగా మాట్లాడుతూ, ఎవరికీ అధీనుడు కాకుండా బతకాలి.ఇలా వేద సూక్తులు  మానవీయ జీవన విధానంతో పాటు శాంతి, సౌభాగ్యాలను గురించి బోధిస్తున్నాయి.
 ప్రతి వ్యక్తీ "చతుర్వేద ఆమ్న్యాయము" ద్వారా నాలుగు వేదాలలోని సారాన్ని గ్రహించాలి.అందులోని మంచిని పాటిస్తూ నియమబద్ధమైన జీవితాన్ని గడిపినట్లయితే ధర్మం పరిరక్షింపబడుతుంది.సమాజం శాంతికి నిలయం అవుతుంది.

కామెంట్‌లు