రోజూ రాస్తా నిత్యము చదివిస్తా:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
విరిసిన పువ్వులు
మత్తుచల్లుతుంటాయి
వెన్నెల వాన
తనువును తడుపుతుంటాయి

మత్తు నిద్ర
కలలలోకంలోకి తీసుకెళ్తుంది
హృదయము
కవ్వింపులకు గురవుతుంది

శ్రావ్యమైన పాట
వీనులకు విందునిస్తుంది
తియ్యని పలుకులు
తేనెచుక్కలు చిమ్ముతుంటాయి

అందచందాలు
ఆకర్షిస్తుంటాయి
ఆనందాలను
అంతరంగంలోపారిస్తుంటాయి

చిరునవ్వులు
మోమునువెలిగిస్తుంటాయి
ప్రేమాభిమానాలు
గుండెలో పొంగిపొర్లుతుంటాయి

పచ్చని చెట్లు
గాలికి తలలూపుతుంటాయి
నీడలో సేదతీరమని
చెంతకు పిలుస్తుంటాయి

కొత్త విషయాలు
మదిలో పుడుతుంటాయి
చక్కని భావమును
వ్యక్తపరచమంటుంటాయి

అక్షరలోకం
విహారానికి పిలుస్తుంది
పదాలప్రపంచం
పలుపంక్తులను పేర్చమంటుంది

తేటతెలుగు
తొందరపెడుతుంది
అచ్చతెలుగు
వెంటబడుతుంది

ఫలితం
కలం కదలటం
కవిత్వం
కాగితానికి ఎక్కటం

ప్రతిరోజు
ఏదో రాస్తుంటా
అనునిత్యము
ఏదో చదివిస్తుంటా

తెలుగు తల్లికి
మల్లెపూదండలు
పలుకుల తల్లికి
కర్పూరహారతులు


కామెంట్‌లు