ఏభై ఏళ్ళ క్రితం పదోతరగతి చదువుకున్న 1974-75 బ్యాచ్ విద్యార్థులు ఒకచోటకు చేరిన అపూర్వ సమ్మేళనం నేడు జరిగింది. ఇంతటి గొప్ప ఆత్మీయ కలయికకు తోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికైంది. వారంతా ఇక్కడ చదువుకొనే, గొప్ప గొప్ప స్థానాలను అలంకరించి పదవీ విరమణ పొందియున్నారు కూడా. ఐననూ ఒకరికొకరు సమాచారాలను గైకొని సమావేశమవ్వడం ఒక విశేషం అంటూ, వారి పటిష్ఠమైన బాల్యస్నేహానుబంధానికి అందరూ అభినందిస్తున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వీరంతా రోజంతా ఆనందంగా, ఆహ్లాదకరంగా గడిపారు. 50 సంవత్సరాల క్రితం విడిపోయిన వీరంతా ఒక్కటై, ఒకరితో ఒకరు వారి అనుభవాలను పంచుకుంటూ ఆనంద బాష్పాలతో గడిపారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులలో ఇద్దరు మాత్రమే ఉండగా, వారిని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. గణితం, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు సంబంగి శివున్నాయుడు, డ్రిల్లు మాస్టారు గుణుపూరు సింహాచలంలను ఈనాటి వేదికపై సత్కరించడం జరిగింది. ఆనాటి పాఠశాలలో జరిగిన విషయాలను, పరిస్థితులను, విద్యార్థులు క్రమశిక్షణ, వినయ విధేయతలను ఉపాధ్యాయులిరువురూ తమ తమ ప్రసంగాలలో గుర్తుచేశారు. మానవీయ సంబంధాలకు మచ్చుతునక ఈనాటి యీ గెట్ టు గెదర్ అని కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పూర్వ విద్యార్ధి, విశ్రాంత మండల విద్యాశాఖాధికారి కుదమ పరమేశ్వరరావు మాట్లాడుతూ అపుడు ఏ సౌకర్యాలు లేనప్పటికీ, అంకిత భావంతో చదవడం వలనే తామంతా పలు ఉన్నత పదవులలో రాణించామని అన్నారు. అలాగే యీ సమావేశం లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత ఎ.జి.ఎం. పాదుషా బ్రహ్మ, విశ్రాంత ఉపాధ్యాయులు సంబంగి సత్యన్నారాయణ, రంబ సోమేశ్వరరావు, బగ్గాo సురేంద్రనాథ్ బెనర్జీ, బాలబ్రహ్మం, రమేష్ కుమార్ పట్నాయక్, గుంట్రెడ్డి తవిటినాయుడు, పల్ల దాలినాయుడు, ఏగిరెడ్డి కృష్ణ తదితరులు ప్రసంగించిరి. ముఖ్య అతిథులుగా జట్టు ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డొల్లు పారినాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయని జమ్మాన ప్రపూర్ణ హాజరై, ప్రసంగించారు.
వీరి చేతులమీదుగా పూర్వ విద్యార్ధులంతా జ్ఞాపికలతో సత్కారాలు పొందారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి