సంత వ్యాపారం: - బెల్లంకొండ నాగేశ్వరరావు

 ఆరోజు ఆదివారం కావడంతో ఆవీధిలోని పిల్లలంతా సాయంత్రం రాఘవయ్య తాత ఇంటి అరుగుపై కథ వినడానికి చేరారు. పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన తాతయ్య " పిల్లలు ఈరోజు మీరు ఎటువంటి కథ వినాలి అనుకుంటున్నారు " అన్నాడు. " తాతగారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
 " అంటే ఏమిటి? అలాంటి కథ మాకు చెప్పండి " అన్నాడు    .
" మనం చేస్తున్న పనిలోకాని, వ్యాపారంలో కాని రెండు విధాల లాభం పొందడాన్ని ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అంటారు. అటువంటిదే పలురకాల లాభాలను పొందుతున్న రంగయ్య దంపతుల సంత వ్యాపారం అనే కథ
నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.కథవిన్న తరువాత ఈకథపై నేను అడిగే ప్రశ్నలకు ఆలోచించి మీరు సమాధానాలు ఇవ్వాలి... సిరిపురంలో రంగయ్య అనే చిరువ్యాపారి ఉండేవాడు. తన చెక్కబల్ల రిక్షాపై,తమ గ్రామానికి పరిసరాలలో ఉండే అన్ని పల్లెటూర్లు తిరుగుతూ కోళ్ళు,కోడి గుడ్లు కొనుగోలు చేసేవాడు. వాటిని  తమ గ్రామానికి పదికిలోమీటర్ల దూరంలోని చాకిచర్ల మండలంలో ఆదివారం జరిగే వారాంతరపు సంతలో అమ్మేవాడు.అతని భార్య ఇంటివద్ద నిత్యవసర సరుకుల అంగడి నడుపుతూ, నాలుగుపాడి పసువులతో పాల వ్యాపారం కూడా చేస్తూ , తమ ఇంటి పెరడులో పలు రకాల కూరగాయలు పండిస్తూ ఉండేది.
ఒక ఆదివారం కోళ్ళగంప,కోడిగుడ్ల గంపలతో సంతకు సిధ్ధమైనాడు రంగయ్య , అతని భార్య గంప నిండుగా  తమ పెరడు లో పండిన కూరగాయలు,మరో గంపనిండుగా తను తయారు చేసిన జంతికలు తీసుకువచ్చి రిక్షాపై కూర్చుంది. సంతచేరిన రంగయ్య దంపతులు తాము తెచ్చిన కూరగాయలు, కోళ్ళు,కోడిగుడ్లు,జంతికలు అమ్మకం ముగిసిన అనంతరం ఇట్టివద్ద తాము నడుపుతున్న నిత్యావసర వస్తువుల అంగడికి అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకుని రిక్షాపై ఆ సరుకులతో తమ గ్రామానికి  బయలుదేరారు.
పిల్లలూ మీలో ఎవరైనా రంగయ్య ,అతని భార్యా కలసి వారి వ్యాపారంలో ఎన్ని విధాల లాభం పొందుతున్నారో చెప్పగలరా? "అన్నాడు తాతయ్య.
" రంగయ్య, అతని భార్యా కూరగాయలు,  కోళ్ళు,కోడిగుడ్లు,జంతికలు నాలుగు రకాలు సంతలో అమ్మి లాభాలు పొందారు " అన్నాడు జివితేష్ . 
" నీలెక్కతప్పు,కూరగాయలు, కోళ్ళు, కోడిగుడ్లు,జంతికలు అమ్మి తిరుగు ప్రయాణంలో తమఇంటివద్ద రంగయ్య భార్య నిర్వహించే నిత్యవసర సరుకుల అంగడికి కావలసిన వస్తువులు కొనుగోలు చేసారు. అంటే రేపు ఆసరుకులు తమ అంగడిలో అమ్మగా లాభం వస్తుంది.వీటికితోడు ఇంటివద్ద రంగయ్య భార్య ఇంటివద్ద పాల వ్యాపారంకూడా చేస్తుంది.అలా ఆదంపతులు ఆరు రకాలుగా లాభం పొందుతున్నారు "అన్నది పదేళ్ళ కన్యక. "భళా కన్యకా మీఅన్నయ్య జివితేష్ కన్నా నీవే తెలివైన దానవు "అన్నాడు తాతయ్య.

కామెంట్‌లు