సుప్రభాత కవిత : -బృంద
తీరాన్ని తాకాలనే కెరటాల వేగం 
తాకిన వెంటనే తిరుగుముఖం 
తనతో ఇసుకను తీసుకెళ్లే తొందరలో 
నురగను  వదిలేసి వెళ్లిందే పాపం!


అంతులేని ఆరాటం నిండిన 
అవిరళమైన  అలల పోరాటం!
అలలకు లేదే అలుపు 
అసలే లేకపోయినా గెలుపు!

గెలవలేదన్న నీరసం లేదు 
గెలుపు రాదన్న నిస్పృహ లేదు 
గెలవాలన్న నిర్ణయమే కాదు 
గెలిచి తీరతానన్న  నమ్మకం!

ఉవ్వెత్తున  ఎగిరే ఉత్సాహం 
ఉత్తర క్షణమే జారిపోయినా 
ఊరుకోనివ్వని కోరికేదో 
ఊయలూపి ఉసిగొలిపే ప్రయత్నం!

మదికోరే  మధుసీమల
తుది దొరికేవరకూ 
విధి విన్యాసపు కేళిలో 
ఎదురీతలు తప్పని పయనం!

నిరాశకే నిరాశ పుట్టేవరకూ 
అడుగులకు అలుపు రానివ్వక 
ఎడారంటి దారుల వెంట 
వెలుగువెంట గమనమే జీవితం!

దారిదీపమైన దినమణికి జోతలతో 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు