వాయిదా: - సరికొండ శ్రీనివాసరాజు
 వాసు 10వ తరగతి చదువుతున్నాడు. ప్రతీ పనినీ తరవాత చేద్దాములే అని వాయిదా వేసే అలవాటు ఉంది. కొన్ని పనులు ఆలస్యంగా చేసేవాడు. కొన్ని పనులు మరచిపోయేవాడు. ప్రతిరోజూ చేసే హోమ్ వర్క్ విషయంలోనూ, తల్లిదండ్రులు ఎమైనా పనులు చెప్పినా అంతే. తర్వాత చేయొచ్చులే అని వాయిదా వేయటం, కొన్ని ఆలస్యంగా అయినా చేయడం, చాలా వరకు మరచిపోవడం వాసుకు అలవాటు. 
       వాసు చెల్లెలు వాణి చదువులో చాలా తెలివైనది. క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఒకసారి ఒక మేగజైన్ లో గణితానికే సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. కరెక్ట్ సమాధానం రాసిన వారిలో పది మందిని ఎంపిక చేసి వారికి బహుమతులు పంపుతారు మేగజైన్ వారు. వాసు చెల్లెలు వాణి ఆ నెలలో అడిగిన ప్రశ్నకు సమాధానం  నింపింది. ఒక పేపరుపై రాసి, పోస్ట్ కవర్లో పెట్టి, అన్నయ్యకు ఇచ్చింది. "అన్నయ్యా! ఇది పోస్ట్ బాక్స్ లో వేయి. మరచిపోకు." అన్నది. 
      తర్వాత పోస్ట్ బాక్సులో వేయవచ్చులే అనుకున్నాడు వాసు. ఆ తర్వాత దాని విషయమే మర్చిపోయాడు. గడువు దాటాక గుర్తుకు వచ్చింది. ఆ! ఆ ప్రశ్నకు చాలామంది సమాధానం పంపుతారు. లక్కీ డీప్ లో పదిమందిని ఎంపిక చేసి, వాళ్ళకు బహుమతులు ఇస్తారు. ఇది ప్రతీసారీ జరిగేదే, చెల్లెలు పేరు లేకపోతే లక్కీ డీప్ లో తాను ఎంపిక కాలేదు అనుకుంటుంది వాణి అనుకున్నాడు వాసు.
  కాలం గడిచింది. కొత్త మేగజైన్ ఇంటికి వచ్చింది. ఆసక్తిగా మేగజైన్ ఓపెన్ చేసి చూసింది వాణి. "సరైన సమాధానం ఇచ్చారు. అవును తాను రాసిన జవాబే ఇది. కానీ సరైన సమాధానం ఎవరూ పంపలేదు కాబట్టి ఎవరికీ బహుమతి లేదు అని ప్రకటించారు. వాయిదాలు వేసే అన్నయ్యను నమ్ముకొని ఎంత పొరపాటు చేసాను, లేకపోతే ఆ పది మంది బహుమతి విలువ తనకు మాత్రమే వచ్చేది. తన పేరు చూసుకునేది అనుకుంది వాణి. అన్నయ్య మీద బీభత్సంగా అరిచింది వాణి. ఆ తర్వాత అన్నతో మాటలు మానేసింది. వాసు ఎంత బతిమాలినా ఫలితం శూన్యం. ప్రియమైన చెల్లెలు మాటలు మానేసరికి వాసు చాలా బాధపడ్డాడు. వాసు బద్దకానికి స్వస్తి చెప్పాడు. ఎప్పటి పనిని అప్పుడే చేస్తున్నాడు. పోనీలే తనకు బహుమతి రాకున్నా ప్రియమైన అన్నయ్యలో మార్పు వచ్చింది. అదే తనకు పెద్ద బహుమతి అనుకుంది వాణి.

కామెంట్‌లు