న్యాయములు-790
తృణ జలూకా న్యాయము
*****
తృణ అంటే గడ్డి . జలూకా అంటే జలగ ,జెనిగ. తృణ జలూకా అంటే ఒక రకమైన గడ్డి పురుగు లేదా గడ్డి జలగ అని అర్థము.
గడ్డి జలగ గడ్డి మీద ప్రాకేటప్పుడు వేరొక గడ్డిపోచ కనిపిస్తే లేదా దొరికితే గాని తానున్న గడ్డిపరకను వదిలిపెట్టదు లేదా విడిచి పెట్టదు. అలా వదలకుండా పట్టి ఉండటాన్నే "తృణ జలూకా న్యాయము" అంటారు.
మరి జలగ ఏం చేస్తుందో మనందరికీ తెలుసు.అది మనుషులు లేదా జంతువుల శరీరంపైకి చేరి ఒక్కసారి గనుక పట్టుకుందంటే ఇక వదిలి పెట్టదు. చిటికెన వేలంత సన్నగా వున్నదల్లా బొటనవేలంత లావుగా పొడుగ్గా సాగుతుంది. అలాంటి జలగను వదిలించాలంటే పొగాకు కాడను మండించి గానీ, పొగాకు రసం గాని అవి పట్టుకున్న దగ్గర పెడితే ఆ ఘాటుకు వెంటనే ఊడిపోయి చచ్చిపోయేది.పల్లెల్లో పెరిగిన వెనుకటి తరం వారికి ఈ విషయం తెలిసే వుంటుంది.
అయితే ఇక్కడ మనం చెప్పుకునేది రక్తం పీల్చే జలగ గురించి కాదు.గడ్డి జలగ గురించి.దీని వలన మనుషులకు, జంతువులకు ఎలాంటి హానీ జరగదు .
ఇది ఎక్కువగా వర్షాకాలంలో నీటి పారులో పెరిగే గడ్డి మొక్కల మీద కనిపిస్తుంది.సన్నగా జలగ ఆకారంలో ఆకుపచ్చ రంగులో వుంటుంది. దీనికి మూతి పక్కన రెండు కాళ్ళు, వెనుక పక్క రెండు కాళ్ళు వుంటాయి.అది వెనుక కాళ్ళతో నిలబడుతుంది.అలా గడ్డి పరక మీద 'గ' అనే అక్షరం యొక్క ఒత్తులా అంటే తలకట్టు లేని 'గ' లా మారి వేరే గడ్డి పరక మీదకు తన శరీరాన్ని పోనిస్తుంది.అలా ముందుకు సాగుతూ ముందరి కాళ్ళతో గడ్డి పరకను గట్టిగా పట్టుకొని మళ్ళీ వెనుక కాళ్ళతో ముందుకు సాగి వచ్చి గట్టిగా పట్టుకుని అలా వేరే గడ్డి పరక మీదకు చేరుతుంది.అప్పుడు మాత్రమే ఇంతకు ముందు పట్టుకున్న గడ్డి పరకను వదిలేస్తుంది.అలా అది తన ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తూనే వుంటుంది .
సామాన్యంగా మన పెద్దలు దీనిని జీవితానికి అన్వయించి" ఏదైనా పనిని మొదలు పెట్టే ముందు ముందు ఉన్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా ?లేదా ?అనేది నిశితంగా గమనించిన తర్వాతే పని మొదలు పెట్టాలనీ,ముందు ఎదురయ్యే పరిస్థితులను గురించి ఆలోచించి ,ఇక తన పట్టును సడలనీయకుండా ముందుకు సాగాలని "తృణ జలూకా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే ఆధ్యాత్మిక వాదులు ఏమంటారంటే. జీవుడు కూడా వేరొక దేహమును ( శరీరమును) చూసుకోకుండా పూర్వ దేహాన్ని వీడడు, అలాగే ఈ జీవుడి ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే వుంటుందని శ్రీమదాంధ్ర మహా భాగవతములోని దశమ స్కంధము - పూర్వ భాగములోని 29వ పద్యంలో చెప్పబడింది.
అదేమిటో చూద్దామా...
మేని తోడన పుట్టు మృత్యువు జనులకు నెల్లి నేడైన నూరేండ్లకైన/ దెల్లబు మృత్యువు దేహంబు పంచత నంద గర్మానుగుడై శరీరి/ మాఱు దేహము నూది మఱితొంటి దేహబు బాయును దన పూర్వ భాగమెత్తి వేఱొంటిపై బెట్టి వెనుక భాగమెత్తి గమనించు తృణ జలూకయును బోలె/..ఆ.వె." వెంట వచ్చు కర్మ విసరంబు మును మేలు/ గన్నవేళ నరుడు కన్న విన్న/తలపబడిన కార్య తంత్రంబు కలలోన/ బాడితోడ గాన బడియనట్లు (29)"
అనగా జనాలు పుట్టినప్పుడే చనిపోవడం అనేది వుంటుంది.అది నేడు కావచ్చు లేదా రేపు కావచ్చు.వంద యేండ్లకయినా కావచ్చు.అయిదు భూతాల కలయికగా ఏర్పడిన దేహం మళ్ళీ ఐదు భూతాలుగా విడిపోతుంది.దీనినే చావు అంటారు.అయితే దేహం చస్తుంది కానీ దేహంలో ఉన్న జీవుడు చావడు.మరొక దేహాన్ని చూసుకొని ప్రవేశిస్తాడు. ఇలా పునర్జన్మ వుంటుందని చెబుతుంది.
అలాగే చనిపోయాక ఆత్మ తన యాత్రను ఎలా కొనసాగిస్తుందో ... మొదలైన విషయాలన్నీ ఉపనిషత్తులలో ఒకటైన ఛాందోగ్య ఉపనిషత్తులో కూడా ఉన్నాయి.
ఇదంతా నిశితంగా పరిశీలిస్తే చావు పుట్టుకలలో జీవి శరీరం మాత్రమే మరణిస్తుంది.ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మిస్తుందనీ, దేహానికి మాత్రమే మరణం కానీ ఆత్మకు వుండదనీ, శరీరాన్ని కోల్పోయే ముందు ఆత్మ "తృణ జలూకా న్యాయము"లా జీవాత్మ మరో దేహాన్ని చూసుకుని ప్రవేశిస్తుందనీ, ఆ ప్రవేశించేందుకు చేసే ప్రయాణంలో పితృయానం, దేవయానం అనే రెండు రకాల ప్రయాణాలు వుంటాయని ఛాందోగ్యోపనిషత్తు చెబుతోంది. అంతే కాదు ఈ రెండు యానాల తిరుగు ప్రయాణంలో ఆకాశం,అక్కడి నుండి వాయువును,వాయువు నుండి పై పొగకూ,పొగ నుండి మేఘాలకు చేరి వర్షంతో కలిసి భూమిని చేరుతుంది. అలా భూమిపై వివిధ ఆహార పదార్థాల నుండి తిరిగి జీవుడిగా జన్మిస్తుందనే విషయం కూడా చెబుతుంది భగవద్గీతలో కూడా మరో శ్లోకం "అన్నాద్భవంతి భూతానీ" అనేది ఇదే విషయాన్ని చెబుతుంది.ఈ తృణ జలూకా న్యాయము"వలన జీవుడి ఆత్మ గురించిన విషయాలను తెలుసుకోగలిగాం.
ఈ విధంగా "తృణ జలూకా న్యాయము"ను రెండు కోణాల్లో అర్థం చేసుకోవచ్చు.మరణానంతరం ఏం జరుగుతుందో మనకు తెలిసినా తెలియకపోయినా మనం మంచి కార్యాలు చేస్తే మంచి జన్మ ఎత్తుతామనేది.పూర్వ జన్మ సుకృతం వలనే ఈ జన్మ పొందామనేది ఆధ్యాత్మిక వాదుల మాటల ద్వారా గ్రహించవచ్చు.ఇక ఏదైనా మంచి పనిని తలపెట్టినప్పుడు ఎలా వుండాలో కూడా ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోగలిగాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి