పద్యాలు:-
తే.గీ!
ఋతువులందున రారాజు ఋభువుగాదె
జగమునందున నింపెను జానువెంతొ
చైత్రమందుకె నూతన చౌక్షమాయె
సొగసులీనెను చూడగా చోద్యమాయె!
{ఋభువు=దేవుడు; జానువు=ఔషధము;
చౌక్షము=అందము;చోద్యము=ఆశ్చర్యము}
తే.గీ!
మల్లె పూల మధురిమలు మరులుగొలుప
మావి పూమెక్కి పికరాజు మాపుగూయ
పిల్ల గాలులు చల్లంగ పిలువనంప
చైత్రమేతెంచె జగమున చటులనింప!
{చటులు=మెరుపులు}
తే.గీ!
రాజు వాసంతుడు వెడలె రాణమించ
శుభములందించ సమకట్టి శోభతోను
ధరణి వెలిగించె వర్ణాల ధనువుదాల్చి
కరుణ మీరగ మనలను కాచినాడు!!
{రాణ=ప్రీతి, అనురాగము}
ఆ.వె!
మధుమాస వేళలో తలిరాకు జొంపాన
లతలన్ని విరులతో తూగాడు సమయాన
మధుపాలు మురిపాల తారాడు చుండ
కనిపించె పుడమి యా ఇంద్రధనువల్లె!
సీసపద్యము!
మధుమాస సమయాన మధుసఖుడేతెంచ
లతలన్ని విరులతో లాస్యమొప్ప
మధుపాల మండలి మంతనాలాడగా
వినిపించె తీయని వీణయనగ
హేమంత శిశిరాల హేతి హేయమడగ
వాసంత మేతెంచె వరములీయ
విశ్వ నామము దాల్చి వైరము నణచగా
పుడమికేతెంచెను పోటువేయ!!
(మధుసఖుడు=మన్మధుడు;హేతి=మంట;హేయము=రోత)
తే.గీ!
నూత్నవత్సర సమయాన నూత్నముగను
వివిధ కార్యాలు తలపెట్టి విలువపెంచి
సమయసారణి తోడుగా సౌఖ్యమొంద
భరత జనమంత నూతన భాతి పొంద!!
(భాతి=కాంతి)
—----------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి