జీవితమే ఒక నాటక రంగం...
అని పలికె ఏనాడో విశ్వవిఖ్యాత
ఆంగ్ల కవి విలియం షేక్స్పియర్
ఔను జీవితం ఒక మౌనపోరాటం...
అది తీరం చేరని ఆశల ఆరాటం..!
జీవితమంటే..?
చిరునవ్వులు...చీకటి వెలుగులే..
స్నేహాం ప్రేమ అనుబంధం ఆప్యాయతలే
కలతలు కన్నీళ్లు...పగలు ప్రతీకారాలే...
గెలుపు ఓటముల...వింత విన్యాసమే...
సంసారసాగరం ఈదలేకున్న సన్యాసమే..!
ఈ జీవితం ఏడు దశల నాటకరంగం...
అది ఆశల అలల ఉత్తుంగ తరంగం...
ఈ భూమి ఓరంగస్థలం రంగులమయం ...
నేలపై నడయాడే ప్రతినరుడు నటుడే...
పాత్రల నిర్ణయం ఆ పరమాత్మదే...ఔను
దైవం సూత్రధారి...ఓ మనిషి పాత్రధారి...!
ఏడు దశల ఈ నవ్వుల...
పువ్వుల ఏడ్పుల వడగాల్పుల...
నవరస భరిత జీవన నాటకరంగంలో
ముఖ్యమైన ఘట్టాలు మూడేనట...
బాల్యం యవ్వనం వృద్ధాప్యమట...!
బాల్య దశలో...ఈ నరుడు
అమ్మ చల్లనిఒడిలో ఆడి అలసిపోయే
ఆశల కొమ్మలపై అమాయకంగా పెరిగే
రెక్కలులేని పక్షిపాత్రలో...బాలనటుడట.!
యవ్వన దశలో...ఈ నరుడు
ఉదయించే సూర్యుడిలా...
వెలుగులు విరజిమ్ముతూ...
ఎదిగే పచ్చని వృక్షమై...
కుటుంబానికి నీడగా...ప్రేమను
పంచే పాత్రలో...యువనటుడట...!
అంతిమ దశలో...ఈ నరుడు...
పుష్పమై వాడినా...ఆకై రాలినా
ఆధ్యాత్మిక పరిమళాన్ని పంచే...
చీకటిలో చిరుదీపమై మార్గం చూపే...
జీవిత పుస్తకంలో అనుభవ పాఠాల్ని
లిఖించే పాత్రలో...వృద్ధనటుడట...!
మృత్యువును ముద్దాడే ముందు
ముగిసే నాటకంలో నిలిచే పాత్ర ముద్రట..
ఆపై పరమాత్మఒడిలో ప్రశాంతంగా నిద్రట
ఔను ఈ జీవితం...అర్థంకాని నవరసాల
నాటకరంగమట...ఇది నగ్నసత్యమట..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి