సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -793
వహ్ని విస్ఫులింగ న్యాయము
******
 వహ్ని అనగా అగ్ని.నిప్పు.విస్ఫులింగము అంటే అగ్ని కణము.
అగ్ని నుండి అగ్ని కణములు వెలువడినట్లు...
అగ్ని నుండి వెలువడిన అగ్ని కణములు అగ్ని యొక్క అంశలే,అగ్ని యొక్క చిన్న చిన్న రూపాలే.అవి నిప్పు కణాలే కానీ వేరే కాదు.
అలాగే నీటి నుండి చిందిన నీటి బిందువులు నీళ్ళే అవుతాయి కానీ వేరే కావు కదా!.
అలాగే ఓ బండరాయిని గానీ , బంగారాన్ని కానీ ముక్కలు ముక్కలుగా చేసినా వాటిని,రాతి ముక్కలు, బంగారం ముక్కలు అంటారే కానీ వేరుగా పిలవరు కదా!
ఇక ఈ న్యాయంతో పోల్చుతూ ఈ సృష్టిని నిశితంగా పరిశీలించినట్లయితే  మనకు రెండు రకాల రూపాల్లో సృష్టి కనిపిస్తుంది.అది ఒకటి చైతన్య రూపంలోని జీవత్వం అంటే వివిధ రకాల జీవరాశి లేదా జీవులు.రెండవది చైతన్య రహితమైన, నిర్జీవత్వం లేదా నిర్జీవులు.అలా జీవరాశులనూ,  నిర్జీవులనూ రెంటినీ వేరు పరిచేది ప్రాణశక్తి. జీవమున్న ప్రతి ప్రాణిలోనూ ప్రాణశక్తి ఉంటుంది.అలా జీవులు  ఏయే రూపాల్లో ఉన్నా  జీవులకు చైతన్యం కలిగించేది ప్రాణశక్తే.
ఇక అగ్ని విషయానికి వస్తే కూడా అది ఏ రూపాలలో ఉన్నా దాని మూలం అగ్నియే . ఎలాంటి సందేహమూ లేదు. అలాగే మనం ఉదహరించిన  నీళ్ళు, రాళ్ళు, బంగారం మొదలగునవి వివిధ రూపాలు పొందినప్పటికీ మూలాలు ఆయా పదార్థాలే కదా!
ఆధ్యాత్మిక , తాత్త్విక వేత్తలు ఈ సత్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ సృష్టి రచనను తమదైన  దృష్టితో చూశారు.
ఈ జగమంతా పంచభూత నిలయమనీ, ఈ జగత్తును  సృష్టించి పోషించడంతో పాటు దీనిని దేహంగా ధరించి చైతన్య వంతం చేసే మూలశక్తి ఒకటి ఉందని వారు నమ్ముతారు.ఆ మూల శక్తి నుండే ఈ జగత్తు,విశ్వ సృష్టి జరిగిందని చెబుతారు.
ఉపనిషత్తులలోని ఈశావాస్యోపనిషత్తు కూడా  ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. 
మూలాలను ఆశ్రయిస్తే అసలు పదార్థాలు  ఎలా లభ్యం అవుతాయో అలాగే  మూలశక్తి అయిన ఆత్మను ఆశ్రయిస్తే, ఆత్మను దర్శించడం సాధ్యం అవుతుందని ఈ ఉపనిషత్తు చెబుతుంది.
మరి మూలాలను దర్శిస్తే అసలు పదార్థాలు లభ్యం అయినట్లు ఆత్మను దర్శిస్తే అసలైన ఆత్మ కనిపిస్తుందా? మరి దానిని ఎలా దర్శించాలి ? అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఐతే ఆత్మ నిరాకార శక్తి యని,సర్వ వ్యాప్తమైన ఆత్మ  వాయువు వలెనే గోచరం కానిదనీ, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వాయువునెలా అనుభూతించగలమో, అలాగే మనలో  ఆత్మ ఉన్నదనే స్ఫురణ కలిగినట్లయితే... సర్వజీవులలో ఉన్నది కూడా మనలాంటి ఆత్మయేనని తెలుసుకోగలం.అప్పుడు మనలో ఏకత్వ భావన కలుగుతుంది.
ఆ ఏకత్వంతోనే ఆత్మను దర్శించి, తనను తాను తెలుసుకోగలిగిన  వ్యక్తిలో  సమ దృష్టి, సహజత్వం కూడా అబ్బుతాయని ఈ ఉపనిషత్తు చెబుతుంది.
ఇదే భావం స్ఫురించేలా  వేమన గారు చెప్పిన పద్యం చూద్దాం...
"సకల జీవులందు సమముగా నుండెడి/యతని క్రమము దెలియు నతడెయోగి/అతడు నీవె యనుట నన్యుడు కాడయా/ విశ్వధాభిరామ వినురవేమ "
అంటే సకల ప్రాణులను సమానంగా చూడటం తెలిసిన వాడే అసలైన యోగి.ఏ ప్రాణి మరో ప్రాణి కన్నా ఎక్కువా కాదు తక్కువా కాదు.అన్ని ప్రాణులూ ఒక్కటే.అన్నీ సమానమే.వేరు వేరుగా  ఏదీ లేరు" అని  అర్థం చేసుకోవాలి అంటారు.
"సర్వం ఖల్విదం బ్రహ్మ", అహం బ్రహ్మాస్మి ",తత్వమసి,... అనే  వాక్యాలకు వేమన చెప్పిన వివరణ ఇదే"సమస్తం బ్రహ్మ మయం", "అతడే నేను",నా కంటే అన్యుడు లేడు" అని.
దీనిని మరింత సరళంగా  వేమన చెప్పిన  మరో పద్యాన్ని కూడా చూద్దామా...
పసుల వన్నె వేరు పాలేక వర్ణమౌ/పుష్పజాతి వేరు పూజ యొకటె/దర్శనములు వేరు దైవంబు ఒక్కటే/ విశ్వధాభిరామ వినురవేమ!"
అనగా "పశువులు ఏ రంగులో ఉన్నా పాలు మాత్రం ఒకే రంగులో ఉంటాయి.పూలు ఎన్ని రకాలైనా పూజ మాత్రం ఒకే విధంగా ఉంటుంది.దర్శనాలు ఎన్నైనా కనబడే దైవం ఒక్కడే" అని అర్థం.
ఈ విధంగా పరమాత్మ నుండి రకరకాల సృష్టులు జరుగుచున్నాయనీ, అలా ఎన్ని సృష్టులు జరిగినా అవన్నీ ఆతని కళామాత్రములే గానీ భిన్నమైనవి కావనీ, ఈ జీవులన్నింటిలో ప్రాణశక్తి రూపంలో ఉన్న మూలశక్తి ఒకటేనని  ఈ "వహ్ని విస్ఫులింగ న్యాయము" తెలియజేస్తుంది. అందులోని నిగూఢమైన అంతరార్థాన్ని గ్రహించిన మనం సర్వ జీవుల పట్ల సమాదరణ కలిగి వుండాలి .

కామెంట్‌లు