ఓ మంచి మనిషీ..!
అవినీతికి...
ఆధిపత్యానికి...
అహంకారానికి...
అంధ విశ్వాసాలకు...
అడ్డు తగులు...అతిగా
ఆలోచించకు...అశ్రద్ధ చేయకు..!
చైతన్యమే నీ దివిటి...
ఆత్మగౌరవమే నీ ధ్వజం...
ఆత్మవిశ్వాసమే నీ కవచం..!
నిత్యం ఆరని
అగ్నిగుండమై చెలరేగు...
చిమ్మ చీకట్లను...దహించు...
పునర్జన్మకు పునాదులు వెయ్..!
వేగంతో పారే నదివై ఉరకలు వేయ్...
పక్షిరాజువై అంతరిక్షంలో విహరించు...
పర్వతశిఖరమై ఆకాశపుటంచుల్ని తాకు.!
గద్దించు...
గర్జించు...
గాండ్రించు...
అవసరమైతే
గండ్రగొడ్డలికి పదునుపెట్టు...
బానిసత్వపు బంధాలను
త్రుంచే వజ్రాయుధమై నిలబడు..!
అలాగే...
ఆచరణలకు...
ఆలోచనలకు...
అభిరుచులకు...
అభిప్రాయాలకు...
అంగీకార ముద్ర వెయ్...
అది విజ్ఞతకు మకుటం..!
కలనైనా
తలంచకు...
అనురాగానికి...
ఆప్యాయతలకు...
అనుబంధాలకు...
అడ్డుకట్ట వేయాలని..
అది మానవత్వపు
మధురగీతమని మరువకు..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి