పంచాంగ శ్రవణం:- సి.హెచ్.ప్రతాప్
 తెలుగు సంవత్సరాల ప్రకారం చైత్రమాసంలోని పాడ్యమితో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది నాడు ముఖ్యమైంది పంచాంగ శ్రవణం. ఉగాది రోజున ఆలయంలోగానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో గానీ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఏవైనా దోషాలుంటే వాటి నివారణకు పూజలు నిర్వహించి ఇబ్బందులు తొలగించుకోడానికే పంచాంగ శ్రవణం చేస్తారు. కొత్త ఏడాదిలో మనం చేయాల్సిన కార్యక్రమాలకు అనువైన వాటిని చూపించే కరదీపికగా దీన్ని భావిస్తారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణములనే అయిదు అంగాలు కలిగిన కాలజ్ఞానాన్నే పంచాంగం అని శాస్త్ర వాక్యం.వచ్చే ఏడు వర్షాలు ఎలా పడతాయి? పంటలు ఎలా పండుతాయి? దేశంలోని రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి? శుభకార్యాలకు అనువైన సమయాలు ఏమిటి? ఈసారి అధిక మాసం ఎప్పుడు వచ్చింది?గ్రహణాముల్ ఎప్పుడు వస్తున్నాయి, లాంటి విశేషాలతో నిండి ఉంటుంది. అలా పంచాంగం వ్యవసాయం, రాజకీయం, సామాజిక, ఆధ్యాత్మిక రంగాలన్నింటినీ ప్రతిబించేదిలా ఉంటుంది. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరం వైపుగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఏరువాక ఎప్పుడు సాగాలి, వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.కొత్త ఏడాది ప్రారంభం రోజునే తమ రాశి ఫలాలు, స్థితిగతులను గురించి తెలుసుకుని అందుకు తగిన విధంగా శాంతులను చేసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేసి చెబుతారు.శుభకార్యాలకు ముహర్తం పెట్టడం కోసం, పూజాదికార్యక్రమాల వంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి పంచాంగాన్ని ఉపయోగిస్తారు. ఈ పంచాంగం ఉగాది రోజు నుంచి అమల్లోకి వచ్చి.. మళ్ళీ కొత్త సంవత్సరం ముందు రోజు వరకూ అమల్లో ఉంటుంది.    
ఏడాది కాలాన్ని ప్రమాణంగా చేసుకొని... ఆ కాలంలో గ్రహాల సంచారం, అవి కలిగించే ఫలితాలు, ఆయా నక్షత్ర జాతకులు పొందబోయే శుభాశుభ ఫలితాలు, రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు... ఇలా పలు విషయాలు పంచాంగంలో సవివరంగా ఉంటాయి. అలాగే గ్రహ సంచారాలు, నక్షత్ర గమనం, పండుగల నిర్ణయం, శుభ ముహూర్తాలువన్నీ పంచాంగాన్ని అనుసరించే ఉంటాయి కాబట్టి ఉగాది నాడు తప్పనిసరిగా పంచాంగాన్ని పూజించాలి మరియు పంచాంగ శ్రవణం విధిగా చేస్తే అంతా మంచే జరుగుతుందని మన పూర్వీకుల అభిప్రాయం.

కామెంట్‌లు