నీడల చాటున
నడిచే శూన్యం వలె
నేడు కళ్లెందుకు
చెమ్మగిల్లాయని
కనురెప్పలను అడగకు..!
దేహానికి
గుచ్చుకున్న
గునపాలతో
నిన్న రగిలి పగిలిన
గుండె గాయాలనడుగు...
ఎన్ని వేదనలకది బలైపోయిందో..!
విసిరిన అగ్నికణంలా...
రగులుతున్న ఆ గుండెలో
బ్రద్దలౌతున్న అగ్నిపర్వతాన్ని అడుగు...
ఆ కళ్లెందుకు వర్షిస్తున్నాయో ధారగా...!
అజంతా సుందర శిల్పంలా...
అందమైన బాపు బొమ్మలా...
అందాల జాబిలి అసూయచెందేలా...
చిలకపలుకుల రంగుల రామచిలకను
నీకు పెళ్లెందుకాలేదని అడగకు...!
పెసర గింజలో
ప్రాణం వెతుక్కునేలా
అధిక కట్నాల కోసం
తమ పిల్లల్ని పట్నాలకు
అమెరికా, ఆస్ట్రేలియాలకు పంపే
ఆశబోతులైన తల్లిదండ్రులనడుగు..!
దారితప్పిన నావలా
పబ్బులకు...క్లబ్బులకు
డబ్బులు తగలేస్తూ...
విందు వినోదాలమత్తులో
మునిగి తేలుతూ...
సంతలో సరుకులా
అమ్ముడుపోతున్న
ఆధునిక యువకులనడుగు...!
చీకటి తొలగని నిశీథిలా
ఒంటరిగా కూర్చొని ఆ చిట్టి చిలకమ్మ
ఎందుకు చింతిస్తున్నదో...పాపం..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి