కవితమ్మ కవ్వింపులు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆమె
వెన్నుతడుతుంది
వేకువనే
నిద్రలేపుతుంది

ఆమె
ఆలోచనలులేపుతుంది
అక్షరాలను
అందంగా అల్లమంటుంది

ఆమె
విషయాలను ఇస్తుంది
విన్నూతనంగా
వ్యక్తపరచమంటుంది

ఆమె
కలము చేతికిస్తుంది
కాగితాలను
నింపమని కోరుతుంది

ఆమె
సూర్యోదయము కనమంటుంది
ముందుగానే
కవితోదయము చేయమంటుంది

ఆమె
భుజము తడుతుంది
సంతసంతో
అభినందనలు తెలుపుతుంది

ఆమె
పొగడ్తలుగుప్పిస్తుంది
ఏలనో
ప్రోత్సాహపరుస్తుంది

ఆమె
పాఠకులను నిత్యమూచదివిస్తుంది
ఎందుకో
చక్కగా స్పందింపజేయిస్తుంది

అదే
కవితాకన్యక ప్రేమాభిమానము
ఇదే
కవ్వింపులకు ప్రతిస్పందనము

అదే
సాహితీ సమ్మోహనము
ఇదే
కవితలకి జన్మకారణము


కామెంట్‌లు